Share News

Welfare as the goal.. as the agenda of development సంక్షేమమే ధ్యేయంగా.. అభివృద్ధి అజెండాగా

ABN , Publish Date - Jun 11 , 2025 | 11:47 PM

Welfare as the goal.. as the agenda of development సామాజిక పింఛన్ల పెంపుతో ఆదిలోనే పేదల పెన్నిధి అనిపించుకుంది. ఒకేసారి రూ.1000 పెంచి లబ్ధిదారుల మోములో వెలుగు నింపింది. మెగా డీఎస్సీతో నిరుద్యోగులకు ఓ దారి చూపింది. ఉచిత గ్యాస్‌ సిలిండర్లతో పేదలకు ఆర్థిక భారం తగ్గించింది.

Welfare as the goal.. as the agenda of development సంక్షేమమే ధ్యేయంగా.. అభివృద్ధి అజెండాగా
చురుగ్గా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు

సంక్షేమమే ధ్యేయంగా.. అభివృద్ధి అజెండాగా

అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు

ఉచిత ఇసుకతో ఊపందుకున్న గృహ నిర్మాణం

మెగా డీఎస్సీతో నిరుద్యోగుల్లో వెలుగులు

ఉచిత గ్యాస్‌తో పేద కుటుంబాలకు ఊతం

వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రోత్సాహం

పేదల ఆకలి తీర్చుతున్న అన్నాక్యాంటీన్లు

వాయువేగంతో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం

చురుగ్గా గిరిజన వర్సిటీ భవనాల పనులు

ఇదీ ఏడాది కూటమి పాలన ప్రత్యేకత

ఏడాది కూటమి ప్రభుత్వ పాలన సంక్షేమమే ధ్యేయంగా.. అభివృద్ధే అజెండాగా సాగింది.

సామాజిక పింఛన్ల పెంపుతో ఆదిలోనే పేదల పెన్నిధి అనిపించుకుంది. ఒకేసారి రూ.1000 పెంచి లబ్ధిదారుల మోములో వెలుగు నింపింది. మెగా డీఎస్సీతో నిరుద్యోగులకు ఓ దారి చూపింది. ఉచిత గ్యాస్‌ సిలిండర్లతో పేదలకు ఆర్థిక భారం తగ్గించింది. ఉచిత ఇసుక విధానంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల గృహ నిర్మాణాలకు కొండంత అండగా నిలిచింది. వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలతో పారదర్శక ఈ-పాలనకు శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల దారి కష్టాలకు తెరదించుతూ రాష్ట్రమంతటా రహదారుల నిర్మాణాన్ని చేపట్టి ప్రజలందరి మన్నన పొందింది.

పేదవారి ఆకలి తీర్చే లక్ష్యంతో రూ.5కే రుచికరమైన భోజనం అందించే అన్న క్యాంటీన్లను కూడా పునఃప్రారంభించింది. మరోవైపు భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వాయువేగంతో ముందుకు తీసుకెళ్తోంది. నియోజకవర్గానికో ఎంఎస్‌ఎంఈ పార్కును ప్రకటించి పారిశ్రామిక ప్రగతిని సరికొత్త మార్గంలో పరుగులు పెట్టిస్తోంది. కీలకమైన గిరిజన యూనివర్సిటీని సాకారం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. మొత్తంగా ఏడాది కూటమి పాలన శభాష్‌ అనిపించుకుంది.

విజయనగరం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వచ్చింది. ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తూనే వైసీపీ హయాంలో గాడి తప్పిన పాలనను సరిచేసే ప్రయత్నం చేసింది. అదే సమయంలో అనేక అభివృద్ధి పనులతో కూటమి తొలి ఏడాది పాలన నడిచింది. ముఖ్యంగా సామాజిక పింఛన్ల పంపిణీలో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. దేశంలో అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలను ఆకర్షించింది. ఒకేసారి ఏకంగా రూ.1000 పెంచి.. ఒక్కో లబ్ధిదారుడికి రూ.4 వేలు అందిస్తోంది. దివ్యాంగులకు రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచింది. ఇక మంచానికే పరిమితమైన రోగులకు, దివ్యాంగులకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు అందిస్తోంది. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, దీర్ఘకాలిక రోగులు..తదితర 14 విభాగాలకు చెందిన 2,79,336 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెల రూ.116 కోట్లు వీరికి పింఛన్ల పంపిణీకి ఖర్చు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి నెలలో మూడు నెలల పాత బకాయితో కలిపి గత ఏడాది జూలైలో రూ.7 వేలు అందించింది.

నిరుద్యోగుల్లో సంతోషం

కూటమి ప్రభుత్వం 16వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 583 పోస్టులను భర్తీ చేయనున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో డీఎస్సీ నోటిఫికేషన్‌ రాలేదు. సరిగా 2024 ఎన్నికలకు ముందు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కొద్దిరోజులకే ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో డీఎస్సీ నిలిచిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మెగా డీఎస్సీని ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది.

ఉచితంగా సిలిండర్లు

కూటమి ప్రభుత్వంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు జీవన కష్టాలు తొలగాయి. ముఖ్యంగా ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తుండడంతో వారిపై కొంత ఆర్థికభారం తగ్గించినట్లయింది. ప్రస్తుతం జిల్లాలో 6,61,547 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. రేషన్‌కార్డుల ప్రతిపాదికగా తీసుకుంటే 5,81,688 మందికి రాయితీ వర్తిస్తుంది. మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందించడం ద్వారా రూ.142 కోట్ల ఆర్థికబారం ప్రభుత్వంపై పడుతోంది.

ఇసుకా ఉచితమే..

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉచితంగా ఇసుక అందించి సామాన్య, మధ్యతరగతి వర్గాలకు కొండంత అండగా నిలిచింది. టన్ను ఇసుకను నామమాత్రంగా రూ.609కి అందిస్తున్నారు. ప్రభుత్వ ఫీజు లేదు. సీనరేజ్‌, నిర్వహణ ఖర్చులనే వసూలు చేస్తున్నారు. జిల్లాలో మూడు స్టాక్‌ పాయింట్లు ఏర్పాటుచేసి ఇసుక కొరత లేకుండా నిర్మాణదారులకు అందించారు. వేలాది కార్మికులకు ఉపాధి మెరుగయ్యేలా చేశారు. పల్లెపండుగ పేరిట జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సీసీ కాలువలు, రహదారుల నిర్మాణం చేపట్టారు. రూ.151.90 కోట్లతో 2,199 పనులు పూర్తిచేసింది.

వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలు..

ఏపీలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలకు తెరతీసింది కూటమి ప్రభుత్వం. మనమిత్ర యాప్‌ పేరిట 95523 00009 నంబర్‌కు హాయ్‌ అని చెబితే చాలు. మనకు అవసరమైన సేవల వివరాలు వస్తాయి. అందులో పొందుపరిస్తే క్షణాల్లో మనకు అవసరమైన సేవలు పొందేందుకు అవకాశం ఉంది. తొలిదశలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా 161 సేవలను అందుబాటులోకి తెచ్చారు. మలి విడతలో మరో 300 సేవలు అందించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే విద్యార్థుల హాల్‌టిక్కెట్లు, పరీక్ష ఫలితాలు ఈ గవర్నెన్స్‌ ద్వారా అందించారు.

పాడిరైతులకు ప్రోత్సాహం

వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా పాడిరైతులను ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున పశువుల శాలల నిర్మాణం చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా గోకులాల పేరిట 700 పశువుల షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

పీపీపీ పద్ధతిలో రహదారుల నిర్మాణం

జిల్లాలో ప్రధాన రహదారులపె కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రహదారుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. గుంతల్లో రోడ్లను వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. కనీసం ప్రధాన రహదారులను బాగుచేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. కూటమి ప్రభుత్వం జిల్లాలోని రహదారులతో పాటు అంతర్రాష్ట్ర రోడ్లను పీపీపీ విధానంలో నిర్మించాలని యోచించింది. దీనికి రూ.613.91 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేశారు.

జెట్‌ స్పీడ్‌తో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం

కూటమి ప్రభుత్వం రాకతో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు జెట్‌ స్పీడుతో సాగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఎయిర్‌పోర్టు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయం, కళలు ఉట్టిపడేలా ఇంటీరియర్‌ డిజైన్‌తో విమానాశ్రయ నిర్మాణం సాగుతోంది. గత ఏడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం రావడం.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మెహన్‌నాయుడు బాధ్యతలు చేపట్టడంతో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులకు మళ్లీ కదలిక వచ్చింది. తక్కువ వ్యవధిలోనే నిర్మాణం జోరందుకుంది.

ఎంఎస్‌ఎంఈ పార్కులతో కొత్త రూపు

కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామ పరిధిలో 57.09 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణానికి ఇటీవల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ భూమి పూజ చేశారు. ఇతర చోట్ల కూడా శంకుస్థాపన చేశారు. ఈ పార్కుల్లో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను నెలకోల్పేందుకు ఆసక్తి ఉన్న వారికి స్థలాలను కేటాయించనున్నారు.

శరవేగంగా గిరిజన వర్సిటీ పనులు

గిరిజన యూనివర్సిటీ సాకారం చేసే దిశగా టీడీపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో నత్తతో పోటీపడిన వర్సిటీ పనులు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మెరుపువేగంతో జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా పూర్తిచేయించి వర్సిటీని అందుబాటులోకి తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది. వర్సిటీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ సత్ఫలితాలను ఇస్తున్నాయి. వర్సిటీ పనులు ఊపందుకోవడంతో జిల్లావాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Updated Date - Jun 11 , 2025 | 11:47 PM