Share News

Weapon worship at Bobbili Fort బొబ్బిలి కోటలో ఆయుధ పూజ

ABN , Publish Date - Oct 02 , 2025 | 12:41 AM

Weapon worship at Bobbili Fort బొబ్బిలి కోటలో బుధవారం ఆయుధ పూజ అంగరంగ వైభవంగా జరిగింది. రాజవంశీయులైన మాజీ మంత్రి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగారావు, సోదరులు రామకృష్ణరంగారావు, ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన)తో కలిసి ఈ ఆయుధ పూజను స్థానిక దర్బార్‌ మహల్‌లో చేపట్టారు.

Weapon worship at Bobbili Fort బొబ్బిలి కోటలో   ఆయుధ పూజ
బొబ్బిలి యుద్ధంలో వినియోగించిన తుపాకులు, కత్తులు, డాళ్లకు పూజలు

బొబ్బిలి కోటలో

ఆయుధ పూజ

సోదరులతో కలిసి పాల్గొన్న మాజీ మంత్రి సుజయ్‌

రాజరికపు మర్యాదలతో దర్బార్‌హోల్‌లోకి ప్రవేశం

తిలకించిన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు

బొబ్బిలి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి):

బొబ్బిలి కోటలో బుధవారం ఆయుధ పూజ అంగరంగ వైభవంగా జరిగింది. రాజవంశీయులైన మాజీ మంత్రి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగారావు, సోదరులు రామకృష్ణరంగారావు, ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన)తో కలిసి ఈ ఆయుధ పూజను స్థానిక దర్బార్‌ మహల్‌లో చేపట్టారు. ఈ పూజా ప్రక్రియను తిలకించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు తరలివచ్చారు. నాటి రాజులు వినియోగించిన బంగారు, వెండి సింహాసనాలను ప్రధాన కోట నుంచి దర్బారు మహల్‌కు మేళతాళాలతో... వందిమాగధులు, పరివారం కలిసి సంప్రదాయసిద్ధంగా తోడ్కొని వచ్చారు. అనంతరం ముగ్గురు సోదరులు నాటి రాజుల మాదిరిగా వజ్ర వైడూర్యాలతో కూడిన తలపాగాలు, ఆభరణాలు, దుస్తులు ఽధరించి పూజాస్థలానికి చేరుకున్నారు. వారి వెంట కోటలో పనిచేసే ఉద్యోగులంతా పరివారంగా ప్రత్యేక అలంకరణతో అనుసరించారు. దర్బారు మహల్‌లో అగ్రభాగాన స్వర్ణసింహాసనాన్ని ఏర్పాటు చేసి రెండు వైపులా వెండి సింహాసనాన్ని, సాదా సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. స్వర్ణ సింహాసనంపై దివంగత బొబ్బిలి రాజా, నాటి మద్రాసు ఉమ్మడి రాష్ర్టాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజా ఆర్‌ఎస్‌ఆర్‌కే రంగారావు (బొబ్బిలి రాజవంశంలో ఆఖరి పట్టాభిషిక్తులు) చిత్రపటాన్ని, వెండి సింహాసనంపై ఆయన తనయుడైన మాజీ ఎంపీ ఆర్‌వీజీకే రంగారావు (సుజయ్‌ తండ్రి) చిత్రపటాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. మరో సముచితాసనంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయరు స్వామి చిత్రపటాన్ని ఉంచి పూజలు చేశారు. పూజలో భాగంగా వెండి కంచాలలో విలువైన నైవేద్యాలను సమకూర్చారు.

ఫ చారిత్రాత్మకమైన బొబ్బిలియుద్ధంలో నాటి రాజులతో పాటు, బొబ్బిలి వీరునిగా పేరుగాంచిన తాండ్ర పాపారాయుడు, ఇతర సైన్యం వినియోగించిన తుపాకులు, కత్తులు, డాళ్లకు వేదపండితుడు భద్రం శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ తంతును తిలకించేందుకు ఆసక్తి చూపారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, సీనియర్‌ నేతలు, నియోజకవర్గ పరిధిలోని నాయకులు మున్సిపల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు, ఏఎంసీ చైర్మన్‌ నర్సుపల్లి వెంకటనాయుడు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంప్రదాయాలను గౌరవించుకోవాలి

మాజీ మంత్రి సుజయ్‌, ఎమ్మెల్యే బేబీనాయన

కోటలో ఆయుధ పూజ అనంతరం ఎమ్మెల్యే రాజవంశీయుడైన ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన), సుజయ్‌లు విలేకరులతో మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి వస్తున్న సం ప్రదాయాలను పరిరక్షించుకుంటూ వాటిని అలా కాపాడుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలనాటి బొబ్బిలి యుద్ధంలో వినియోగించిన ఆయుధాలు, స్వర్ణ, రజత సింహాసనాలతో పాటు తాము ప్రస్తుతం వినియోగిస్తున్న అన్ని రకాల వాహనాలకు ప్రత్యేక పూజలు చేశామన్నారు. నవరాత్రి మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటూనే ఆఖరి రోజున ఆయుధ పూజ చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

Updated Date - Oct 02 , 2025 | 12:41 AM