Tribal Area Development మన్యం అభివృద్ధికి సహకరిస్తాం
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:31 PM
We Will Support Tribal Area Development ఆశావహ జిల్లాల జాబితాలో ఉన్న పార్వతీపురం మన్యం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్‌సింగ్ తెలిపారు. ప్రత్యేక అభివృద్ధి అవసరాలపై నివేదిక అందజేస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. శుక్రవారం విశాఖపట్నం కలెక్టరేట్‌లో పలు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు.
నిధుల మంజూరు కృషి
కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్‌సింగ్
కలెక్టర్లతో సమీక్ష
పార్వతీపురం, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఆశావహ జిల్లాల జాబితాలో ఉన్న పార్వతీపురం మన్యం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్‌సింగ్ తెలిపారు. ప్రత్యేక అభివృద్ధి అవసరాలపై నివేదిక అందజేస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. శుక్రవారం విశాఖపట్నం కలెక్టరేట్‌లో పలు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. అంతకముందు ఆశావహ జిల్లాలు వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు దినేష్‌కుమార్, శ్యామ్‌ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్య, ఆరోగ్య, వ్యవసాయ, మౌలిక వసతులు, ఆర్థిక అభివృద్ధి తదితర 49 అంశాల్లో సాధించిన పురోగతి, నీతి అయోగ్ నిధుల వినియోగాన్ని తెలియజేశారు. జిల్లాల ప్రత్యేక అవసరాలు, అభివృద్ధిలో నిధులు పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. మన్యం జిల్లా పారిశామ్రిక అభివృద్ధిలో వెనుకబడి ఉందని, సూక్ష్మ స్థాయి మినహా మధ్య, భారీ పరిశ్రమలు ఏవీ లేవని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. ఐటీఐలు, సాంకేతిక, ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మన్యంలో కొన్ని రాష్ట్ర రహదారులను హైవేలుగా మార్పుచేయాలని, పార్వతీపురంలో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ..‘ వివిధ కార్యక్రమాల అమలులో లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుని ముందుకెళ్లాలి. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు మంజూరుకు ప్రయత్నిస్తాం.’ అని తెలిపారు. ఈ సమావేశంలో పార్వతీపురం , పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, తదితరులు పాల్గొన్నారు.