Share News

Water Problem సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తాం

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:05 AM

We Will Solve the Irrigation and Drinking Water Problem

  Water Problem సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తాం
శోభాయాత్రలో పాల్గొన్న మాధవ్‌

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌

పార్వతీపురం/బెలగాం, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): ‘ జిల్లాలోని జంఝావతి, తోటపల్లి ప్రాజెక్టుల ద్వారా పూర్తిస్థాయిలో సాగు, తాగు నీరు అందిస్తాం. పార్వతీపురంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తాం.‘ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసి.. ప్రతి కార్యకర్తకూ భరోసా కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన పార్వతీపురంలో పర్యటించారు. తొలుత జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావుతో కలిసి శోభా యాత్రలో పాల్గొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు ఇది కొనసాగింది. అనంతరం స్థానిక ప్రైవేట్‌ కల్యాణ మండపంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ కార్యకర్తలను ఉత్తేజ పరిచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాలో పర్యటిస్తున్నా. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి కార్యాచరణ రూపొందిస్తాం. జిల్లాలో జాతీయరహదారి నిర్మాణం జరుగుతుంది. ఇది పూర్తయితే మన్యం ముఖచిత్రం మారిపోతుంది. వలసలు అరికట్టి.. జిల్లా అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తాం. ప్రశాంత వాతావరణంలో ఉన్న జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం ఉంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రధాని మోదీ నాయకత్వంలో అరాచక శక్తులకు తగిన బుద్ధి చెబుతున్నాం. జిల్లాలో కేంద్రీయ విద్యాలయం, నవోదయ ఏర్పాటు ఎంతో అవసరం. కొత్త జిల్లాలకు గెజిట్‌ విడుదలైన తర్వాత అవి మంజూరవుతాయి. గిరిజన యూనివర్సిటీ పనులు 30శాతం పూర్తయ్యాయి. నిర్మాణం వేగవంతానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా చర్యలు చేపడతాం. జిల్లాలో ఏనుగుల సమస్యను పరిష్కరిస్తాం. బీజేపీకి రావల్సిన నామినేటెడ్‌ పదవులను సాధిస్తాం. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించాం. రేషియో ప్రకారం నామినేటెడ్‌ పదవుల కేటాయింపు ఉంటుంది. ఎవరూ నిరాశ పడొద్దు. ఈ విషయంలో కూటమి పార్టీల్లో కొంతమేర అసంతృప్తి ఉన్నమాట వాస్తమే. ఈ నెల 30న విజయవాడలో స్ఫూర్తి కార్యక్రమం పేరిట సంచార-అర్ధ సంచార విముక్తి దినోత్సవం నిర్వహిస్తాం.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జి.సీతారామాంజనేయ చౌదరి, రెడ్డి పావని, జిల్లా పరిశీలకుడు ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 12:05 AM