We will send the case.. Commission knock. కేసు పంపిస్తాం.. కమీషన్ కొట్టు
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:35 AM
We will send the case.. Commission knock.వైద్యసేవలు వాణిజ్యపరం అయిపోయాయి. సేవ అర్థం మారిపోతోంది. రోగులకు సహాయం చేస్తున్నట్లు నటించి వారికే తెలియకుండా దండుకుంటున్నారు. ఫలానా వైద్యుని వద్దకు వెళ్లండి బాగా చూస్తారు.. తాను కూడా మాట్లాడతాను అని రోగికి చెబుతారు
కేసు పంపిస్తాం.. కమీషన్ కొట్టు
కొందరు ఆర్‌ఎంపీలు, పీఎంపీల తీరిదీ
ఫలానా ఆస్పత్రికి వెళ్లాలని రోగులకు సూచనలు
అక్కడ ఆర్థిక దోపిడీకి గురవుతున్న వైనం
30 శాతం మొత్తం ఆస్పత్రికి పంపించిన వారికే
వైద్యసేవలు వాణిజ్యపరం అయిపోయాయి. సేవ అర్థం మారిపోతోంది. రోగులకు సహాయం చేస్తున్నట్లు నటించి వారికే తెలియకుండా దండుకుంటున్నారు. ఫలానా వైద్యుని వద్దకు వెళ్లండి బాగా చూస్తారు.. తాను కూడా మాట్లాడతాను అని రోగికి చెబుతారు. దీంతో రోగి చాలా నమ్మకంతో వెళ్తాడు. అక్కడకు వెళ్లాక రోగం తగ్గుతుందో లేదో కాని ఆర్థికంగా దివాలా తీస్తున్నాడు. ఈ విధంగా కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో కమీషన్ల దందా నడుస్తోంది. రోగి పెట్టే ఖర్చులో 30 శాతం సిఫారసు చేసిన వ్యక్తికి అందుతోంది.
- విజయనగరంలోని ఓ పేరుమోసిన కార్పొరేట్ ఆస్పత్రిలో అన్నిరకాల వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. అయితే చికిత్సకు వచ్చేవారిలో అక్కడి సేవలు చూసి నమ్మకంతో చేరే వారు అరుదు. ఆర్‌ఎంపీలు, ల్యాబ్ టెక్నీషియన్‌లు, గ్రామాల్లోని ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు సూచించిన వారే ఎక్కువగా వస్తుంటారు. రోగి తనకు సాయంగా ఆర్‌ఎంపీలు వస్తున్నారని భావిస్తుంటారు కానీ అక్కడయ్యే ఫీజులో 10 నుంచి 20 శాతం ఆ ఆర్‌ఎంపీ ఖాతాకు వెళ్తాయట. అలాగని డబ్బులు చేతికి ఇవ్వరు. ప్రతి ఆర్‌ఎంపీ బ్యాంక్ అకౌంట్ కార్పొరేట్ ఆస్పత్రి వద్ద ఉంటుంది.
- చీపురుపల్లి ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికకు ఆపరేషన్ అవసరమైంది. ఆమె స్థానికంగా ఉన్న ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్‌ను ఆశ్రయించింది. దీంతో ఆ పీఎంపీ విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తూ చీటీ రాసి ఇచ్చారు. కానీ రూ.30 వేలతో తేలిపోయే ఆపరేషన్‌కు ఏకంగా రూ.60 వేలు వరకూ అక్కడ వసూలు చేశారు.
విజయనగరం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి):
గతంలో ఫలానా డాక్టర్ దగ్గరకు వెళ్తే ఫలానా వైద్యం అందుతుందని ప్రజలకు ఒకరకమైన నమ్మకం. నేడు ప్రత్యేక వైద్య నిపుణుల పేరుతో కొత్త సంస్కృతి పుట్టుకొచ్చింది. ప్రాథమిక వైద్యం కోసం స్థానికంగా ఉండే ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ల వద్దకు వెళుతుంటే.. వారు ముందస్తు భేరం కుదుర్చుకొని కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యుల వద్దకు పంపిస్తున్నారు. ముందుగానే ‘నాకింత’ అని బేరం కుదుర్చుకుంటున్నారు. సంబంధిత కార్పొరేట్ ఆస్పత్రులు రోగి వద్ద పిండుకొని తమ వద్దకు పంపిస్తున్న వారికి కమీషన్లు ముట్టజెబుతున్నారు. జిల్లాలో 300కుపైగా ఆస్పత్రులు ఉన్నాయి. దాదాపు చాలా ఆస్పత్రుల్లో ఇలా పీఎంపీలు, ఆర్‌ఎంపీలు సిఫారసు చేసిన కేసులే వస్తుంటాయి. ఓపీ, ఐపీ, రోగికి ఆస్పత్రికి అయ్యే బిల్లులో 20 నుంచి 30 శాతం కమీషన్ల రూపంలో వెళుతోంది. దీంతో రోగికి అవసరమైన వైద్యం అందించే నిపుణుల వద్దకు కాకుండా కమీషన్లు అందించేవారి వద్దకు పంపి కాసులు దండుకుంటున్నారు. దీంతో ఖర్చు పెరుగుతుండగా.. రోగానికి తగ్గ వైద్యం అందక ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు.
ఓపీ ధర చూస్తుంటే బీపీ..
కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ ధరల సూచిక బోర్డులు కనిపించడం లేదు. అటు వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ లేదు. దీంతో ఓపీ ధరను పెంచి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఓపీ టిక్కెట్ ధర రూ.100 లేదా రూ.200 ఉండేది. సామాన్యులకు కొంత అందుబాటులో ఉండేది. కొవిడ్ తరువాత పరిస్థితి మారిపోయింది. రూ.500 వరకూ పెంచేశారు. అత్యవసర విభాగాలకు సంబంధించి ఓపీ అయితే రూ.700 నుంచి గరిష్ఠంగా రూ.1000 వరకూ పెంచేశారని రోగుల బంధువులు తెలిపారు. సాధారణ ఐసీయూ గది రోజుకు రూ.4000నుంచి రూ.7000 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ఆస్పత్రిలో ఉండే రోగులకు ఉదయం, సాయంత్రం రౌండ్స్‌లో తనిఖీ చేస్తున్నందుకు డాక్టరు ఫీజు రూ.2000 వరకూ వసూలు చేస్తున్నారు. సామాన్యుడు ఏదైన అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరితో ఇల్లు గుల్ల కావాల్సిందే. కొందరు ప్రైవేటు వైద్యులు, ఆస్పత్రుల యాజమాన్యాలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
- ముఖ్యంగా అవుట్ పేషెంట్ (ఓపీ) కార్డుల ధరలు చూస్తే రోగులకు బీపీ వచ్చినంత పని అవుతోంది. జాతీయ వైద్యమండలి నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారీతిన వసూలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఆర్‌ఎంపీలు, పీఎంపీలు సాయం అవుతారనుకుంటే వారు కమీషన్ల రూపంలో దండుకుంటున్నారు.
వారం రోజులకు తగ్గిన కాలపరిమితి..
గతంలో అవుట్ పేషెంట్ (ఓపీ) టోకెన్ కాలపరిమితి 15 రోజుల వరకూ ఉండేది. సాధారణంగా వైద్యులు స్వల్పకాలానికి మందులు ఇస్తారు. వాటిని వాడి మరోసారి కలవాలని సూచిస్తారు. అప్పుడు 15 రోజుల్లో రెండోసారి వెళ్లినా ఓపీ ఫీజు వసూలు చేసేవారు కాదు. కానీ ఇప్పుడు వారం రోజుల కాలపరిమితికి మాత్రమే ఓపీ టోకెన్ అందిస్తున్నారు. పది రోజులకు తగ్గట్టు మందులు అందించి వాటిని వాడిన తరువాత మళ్లీ రావాలని సూచిస్తున్నారు. దీంతో ఆ టోకెన్ చెల్లుబాటు కావడం లేదు. మళ్లీ డబ్బులు కట్టి టోకెన్ పొందాల్సి వస్తోంది. దీనిపై రోగి బంధువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక టోకేన్‌తో రెండుసార్లు వైద్యం అందేదని.. ఇప్పడు టోకెన్ ధర పెరిగినా.. ఒకసారికి మాత్రమే పరిమితమవుతోంది.
ల్యాబులు, మందుల షాపుల్లో..
ప్రైవేటు ఆస్పత్రులకు అనుబంధంగా ల్యాబులు, మందుల షాపులు నడుపుతున్నారు. బయట ల్యాబుల్లో వైద్య పరీక్షలకు తక్కువ ధర ఉంటే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు. బయట ల్యాబులను ఆశ్రయించి రిపోర్ట్సును తీసుకెళ్తే సదరు వైద్యులు దానిని చూడడం లేదు. తిరస్కరించి బయటకు పంపుతున్నారు. ల్యాబుల్లో సైతం ల్యాబ్ టెక్నీషియన్లు ఉండడం లేదు. కచ్చితంగా అక్కడ నిబంధనల మేరకు ల్యాబ్ టెక్నిషియన్, ఓటీ అసిస్టెంట్ వంటి కోర్సులు పూర్తిచేసి అనుభవం ఉన్నవారినే నియమించాలి. కానీ అదెక్కడా అమలుచేస్తున్న దాఖలాలు లేవు. ఇక ఆస్పత్రిలో పనిచేస్తే అన్ ట్రైన్డ్ సిబ్బందితోనే మందుల దుకాణాలను సైతం నడిపిస్తున్నారు. ఇలా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సగటు రోగిని పిప్పిచేస్తున్నారు. ఆర్థికంగా గుల్ల అయ్యే వరకూ వదలడం లేదు. ఇప్పటికైనా ప్రైవేటు ఆస్పత్రుల దందాపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
దృష్టిపెడతాం..
ప్రైవేటు ఆస్పత్రులపై దృష్టిపెడతాం. ముఖ్యంగా అవుట్ పేషెంట్ టోకెన్ ధరల నియంత్రణకు కృషిచేస్తాం. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించి ధరలు నియంత్రించేలా చేస్తాం. కచ్చితంగా ఆస్పత్రుల యాజమాన్యాలు నోటీస్ బోర్డుల్లో అన్ని వివరాలను ప్రదర్శించాలి. లేకుంటే చర్యలు తప్పవు.
- జీవనరాణి, డీఎంహెచ్‌వో, విజయనగరం
============