Share News

చివరి ఎకరాకూ సాగునీరు అందిస్తాం

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:28 AM

ప్రతి ఏడాది ఖరీఫ్‌, రబీలో రైతులు ఇబ్బందులు పడకుండా చివరి ఎకరా వరకూ సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

చివరి ఎకరాకూ సాగునీరు అందిస్తాం
చంపావతి వంతెన వద్ద బీవీ చానల్‌ను పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్‌

- మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

గజపతినగరం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రతి ఏడాది ఖరీఫ్‌, రబీలో రైతులు ఇబ్బందులు పడకుండా చివరి ఎకరా వరకూ సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం గంగచోళ్ల పెంట, పట్రువాడ గ్రామాల మధ్య చంపావతి వంతెన వద్ద గల బీవీ చానల్‌ను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీవీ చానల్‌తో గజపతినగరం, బొండపల్లి మండలాల్లో 1,100ఎకరాలకు, 13వంతుల కాలువ ద్వారా 1400ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందన్నారు. అయితే చంపావతి వంతెన నుంచి నీరు బీవీ చానల్‌కు వెళ్లకపోవడంతో ప్రతి ఏటా ఇసుక బస్తాలు వేసి నీటిని మళ్లించుకునేందుకు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నట్లు ఆయకట్టు రైతులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. దీనిపై అధికారులతో మాట్లాడి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామ న్నారు. ఖరీఫ్‌లో బీవీ చానల్‌, 13వంతుల కాలువకు రూ.80 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి 2,500ఎకరాలకు సాగునీరు అందించినట్లు తెలిపారు. అనంతరం పట్రువాడ గ్రామస్థులతో మంత్రి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం తమ పింఛన్లు నిలిపివేసిందని, వాటిని పునరుద్ధరించాలని పలువురు కోరారు. తాగునీటి సమస్య తీర్చాలని వేడుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు మక్కువ శ్రీధర్‌, పార్టీ మండల అధ్యక్షుడు గంట్యాడశ్రీదేవి, ఆండ్రా ప్రాజెక్టు చైర్మన్‌ కోడి సతీష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ లెంక బంగారునాయుడు, ఇరిగేషన్‌ డీఈ రామునాయుడు, జేఈ సురేష్‌ రామ్‌కుమార్‌, ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

అధికారులపై మంత్రి ఆగ్రహం

పట్రువాడ నుంచి చంపావతి వంతెన వద్దకు వెళ్లే మార్గంలో ఎక్కడి చెత్త అక్కడే ఉండడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టకుంటే సంబంధిత అధికారుల వేతనాలను నిలిపి వేస్తామని హెచ్చరించారు. గ్రీన్‌ అంబాసిడర్‌లు ఎంత మంది ఉన్నారని డిప్యూటీ ఎంపీడీవో శంకరరావును ప్రశ్నించారు. చంపావతికి రెండు వైపులా పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు.

Updated Date - Dec 27 , 2025 | 12:28 AM