కార్మిక హక్కులను కాపాడుకుంటాం
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:50 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని, పోరాటాలతోనే వాటిని కాపాడుకుంటామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు అన్నారు.
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు
- కార్మికులను ఉత్తేజపరిచిన సినీనటుడు ఆర్.నారాయణమూర్తి
- ముగిసిన జిల్లా మహాసభలు
పాలకొండ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని, పోరాటాలతోనే వాటిని కాపాడుకుంటామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు అన్నారు. పట్టణంలో రెండు రోజుల పాటు జరిగిన సీఐటీయూ మహాసభలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ.. కార్మికులు, ఉద్యోగులు, అధికారులపై రాజకీయ వేధింపులు పెరిగాయన్నారు. ఈ విషయంలో నూతన ప్రభుత్వంలో కూడా ఎటువంటి మార్పులు లేవని అన్నారు. కార్మికుల పోరాటాలను అణిచివేసే కుట్రలను మానుకోవాలన్నారు. విశాఖపట్నం కేం ద్రంగా డిసెంబరు 31 నుంచి వారం రోజుల పాటు జాతీయ మహాసభలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. కార్మిక రంగం సమరశీల పోరాటాలతో పాటు నిర్మాణ కార్యాచరణపై దృష్టిసారించాలని అన్నారు. అనంతరం ఆర్.నారాయణమూర్తి పాటలు పాడి కార్మికులను ఉత్తేజపరిచారు. మహాసభల సందర్భంగా 47 మంది సభ్యులతో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డి.రమణారావు, ప్రధాన కార్యదర్శిగా వై.మన్మథరావు, కోశాధికారిగా గొర్లె వెంకటరమణ, కార్యదర్శులుగా బీవీ రమణ, ఎన్.వై.నాయుడు, ఎం.ఉమామహేశ్వరి, రామలక్ష్మి, జ్యోతిలక్ష్మి, శాంతికుమారి, రెడ్డి వేణు ఎన్నికయ్యారు.