Share News

కొర్లాం పంచాయతీ విభజనకు ఒప్పుకోం

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:05 AM

మండలంలోని కొర్లాం పంచాయతీ విభజనకు స్థానికుల నుంచి చుక్కెదురైంది. బుధవారం గ్రామంలో ఏర్పాటుచేసిన గ్రామసభలో విభజన తీర్మానం వీగిపోయింది.

 కొర్లాం పంచాయతీ విభజనకు ఒప్పుకోం
గ్రామసభనిర్వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

మెరకముడిదాం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొర్లాం పంచాయతీ విభజనకు స్థానికుల నుంచి చుక్కెదురైంది. బుధవారం గ్రామంలో ఏర్పాటుచేసిన గ్రామసభలో విభజన తీర్మానం వీగిపోయింది. ముగ్గురు మాత్రమే అనుకూలం ఓటేయగా 204 మంది తీర్మానాన్ని తిరస్కరించారు. కొర్లాం పంచాయతీ పరిధిలో కొత్తకర్ర, కుంచిగుమడాం, సీరియాలపేట శివారు గ్రామాలు ఉన్నాయి. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల విభజనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపధ్యంలో పంచాయతీలో ఎవరూ కోరకపోయినా అధికారులు పంచాయతీ విభజనను తెరపైకి తెచ్చారు. కొర్లాం నుంచి కొత్తకర్ర, కుంచి గుమడాంలను వేరుచేసి ఆ రెండింటినీ ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయతలపెట్టారు.ఈనేపఽథ్యంలో బుధవారం కొర్లాం రామమందిరం వద్ద కొర్లాం, కొత్తకర్ర, సిరియాలపేట, కుంచిగుమడాం గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో గ్రామసభ ఏర్పాటుచేశారు. ప్రస్తుత సర్పంచ్‌ బూర్లె పార్వతమ్మతోపాటు మాజీ సర్పంచ్‌ బూర్లె నరేష్‌కుమార్‌, ఎంపీటీసీ సభ్యుడు జె.శ్రీనురాజు, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ పాల్గొన్నారు. నాలుగు గ్రామాల నుంచి 206 మంది హాజరయ్యారు. కార్యదర్శి వెంకటరమణ సభ ఏర్పాటుచేసి తీర్మా నం ఉద్దేశాన్ని వారికి చదివి వినిపించి ప్రజాభిప్రాయ సేకరణ కోరారు. చేతులెత్తే విధానం ద్వారా అభిప్రాయాలను తెలపాలని సూచించారు. దీంతో గ్రామసభకు హాజరైన 206 మందిలో 203 మంది విభజనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కేవలం ముగ్గురు మాత్రమే విభజనకు అనుకూలత వ్యక్తం చేశారు.

Updated Date - Dec 25 , 2025 | 12:05 AM