కాలువ నిర్మాణానికి ఒప్పుకోం
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:05 AM
ముంజేరు పంచాయతీలోని సిద్ధార్థ కాలనీలో మురుగు కాలువ నిర్మాణ పనుల విషయంలో మంగళవారం ఉద్రిక్తత తలెత్తింది.
భోగాపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ముంజేరు పంచాయతీలోని సిద్ధార్థ కాలనీలో మురుగు కాలువ నిర్మాణ పనుల విషయంలో మంగళవారం ఉద్రిక్తత తలెత్తింది. వివరాల్లోకి వెళితే... సిద్థార్థ కాలనీ మీదుగా మురుగు కాలువ నిర్మాణం విషయమై స్థానికులు, ముంజేరు వాసుల మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ముంజేరు ఆర్ అండ్‌బీ రహదారి నుంచి సిద్ధార్థ కాలనీ మీదుగా మురుగు కాలువ నిర్మాణానికి కొన్నేళ్ల కిందట అధికారులు ప్రయత్నించారు. దీనిని సిద్ధార్థ కాలనీ వాసులు అడ్డుకున్నారు. గతంలో కలెక్టర్, ఆర్డీవో, ఎస్సీ కమిషన్ చైర్మన్, పోలీసు అధికారులు వచ్చి.. ప్రయత్నించినా పరిష్కారం కాలేదు. దీంతో కాలువ సమస్య అలాగే ఉండిపోయింది. ఇటీవల మరోసారి కాలువ నిర్మాణానికి పంచాయతీలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో ముంజేరు గ్రామస్థులు, కాంట్రాక్టర్ ( డ్వాక్రా మహిళ) కలసి మంగళవారం కాలువ నిర్మాణ పనుల కోసం జేసీబీతో సిద్ధార్థ కాలనీ సమీపంలో పూడిక తొలగించేందుకు యత్నించారు. దీనిని సిద్ధార్థ కాలనీకి చెందిన మహిళలు అడ్డుకున్నారు. కాలువ నిర్మాణం చేపట్టడానికి అంగీకరించబోమని పట్టుబట్టారు. అక్కడి గృహాలను తొలగించి...మరోచోట మంజూరు చేయించి... అప్పుడు కాలువ నిర్మించుకోవా లని అన్నారు. లేదంటే తమ ప్రాణాలు పోయినా మురుగు కాలువ నిర్మాణానికి అంగీక రించబోమని తేల్చిచెప్పారు. దీంతో ముంజేరు గ్రామస్థులు, సిద్ధార్థ కాలనీవాసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ పాపారావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చే శారు. మరోవైపు ఈవోపీఆర్‌డీ గాయత్రి, కార్యదర్శి రమణమ్మ అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, అధికారులు స్థానికులతో కొంతసేపు మాట్లాడి అక్కడి నుంచి వెనుదిరిగారు. మధ్యాహ్నం తరువాత ముంజేరుగ్రామస్థులు మరోసారిపనులు చేపట్టగా..సిద్ధార్థ కాలనీ వాసులు అడ్డుకున్నారు. కాలువ నిర్మాణ ప్రాంతంలో బైఠాయించారు. దీంతో అక్కడ పనులను ఆపేశారు. ఈ విషయమై వివరణ అడిగేందుకు ప్రయత్నించగా అధికారులు మాట్లాడేందుకు విముఖత చూపారు.