Manyam Development మన్యాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:24 PM
We Will Lead Manyam on the Path of Development జిల్లాలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం.. ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో మన్యాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం..’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో సుపరిపాలన ‘తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు.
పార్వతీపురం, జూన్27(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం.. ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో మన్యాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం..’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో సుపరిపాలన ‘తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన్యం జిల్లా జీడీపీ చాలా బాగుంది. జిల్లా ఏర్పడిన నాటికి 12.06 శాతం ఉండే జీడీపీ 2023-24లో 16.94 శాతం వృద్ధి సాధించింది. ఈ ప్రాంతంలో పనిచేసేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. ఇకపై బదిలీలు జరిగితే వారి స్థానంలో వేరే అధికారి చేరిన తర్వాతే పాతవారిని రిలీవ్ చేయాలని అధికారులను ఆదేశించాం. ఇక్కడ జీడి దిగుబడి బాగా ఉంది. అందుకే జిల్లా ప్రధాన కేంద్రంలో జీడి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చే శాం. టెన్త్, ఇంటర్ ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం గొప్ప విషయం. అందుకే ఈ జిల్లాలో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని నిర్వహించాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో అన్ని రోడ్లుకు మరమ్మతులు చేపట్టాం. గిరిజన గ్రామాలకు తారు రోడ్లు నిర్మించాం. డోలీ మోతలు లేకుండా చేశాం. జంఝావతి, కొఠియాకు సంబంధించి ఒడిశాతో ఉన్న సమస్యలు పరిష్కరిస్తాం.’ అని మంత్రి వెల్లడించారు.
జిల్లాకేంద్రం రూపురేఖలు మార్చాలి..
‘గ్రామీణ వాతావరణం తలపించేలా జిల్లా కేంద్రం ఉంది. పార్వతీపురం పట్టణ రూపురేఖలు మార్చాలి. రోడ్లు, పార్క్‌లు, పచ్చదనం కనిపించేలా అభివృద్ధి చేసుకోవాలి. జిల్లాలో 38 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నా పూర్తిస్థాయిలో వైద్యులు లేరు. కలెక్టర్ ఆధ్వర్యంలో వైద్యులను నిమిమించేలా చర్యలు తీసుకుంటాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా రీసర్వే చేపట్టారు. దీంతో భూ వివరాలు, రికార్డులు సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ రీ సర్వే చేపట్టి వాటిని ప్రక్షాళన చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కుంకీ ఏనుగులను రాష్ర్టానికి తీసుకొచ్చారు. వాటితో త్వరలోనే జిల్లాలో ఏనుగుల సమస్యను పరిష్కరిస్తాం.’ అని మంత్రి తెలిపారు.
రూ.400 కోట్లతో రహదారుల పనులు
మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. ‘ ప్రతి గిరిజన గ్రామానికి పక్కా రహదారి నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. జిల్లాలో సుమారు రూ. 400 కోట్లతో రహదారుల పనులు జరుగుతున్నాయి. కొఠియా గ్రూప్ గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. గిరిజనులకు పట్టాలు అందిస్తాం. ఈ సంవత్సరం ఎంబీబీఎస్‌లో 12 మంది, ఐఐటీలో 20 మంది, ఎన్‌ఐటీలో 8 మంది గిరిజన విద్యార్థులు సీట్లు సాధించారు. సాలూరు ఏరియా ఆసుపత్రి పనులను రెండు నెలల్లో పూర్తి చేస్తాం. వసతిగృహాలను అభివృద్ధి చేస్తున్నాం. మెగా డీఎస్సీలో పలు పోస్టులను గిరిజనులకు కేటాయించాం.’ అని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోలు అశుతోష్ శ్రీవాత్సవ, సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో హేమలత పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయండి
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది పథకాల అమలుపై జిల్లా ప్రజా ప్రతినిధులకు సమాచారాన్ని అందిస్తూ.. సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా కృషి చేయాలి. మన్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్య ఉంది. కేవలం 50 శాతం మంది మాత్రమే పనిచేయడం వల్ల అభివృద్ధిపై ప్రభావం పడుతుంది. ఈ ప్రాంతంలో వరి దిగుబడి ఎక్కువగా ఉంది. ప్రకృతి సాగు వైపు రైతులను ప్రోత్సహించాలి. రైతు సేవా కేం ద్రాలు, ఏఎంసీలు, పీఏసీఎస్‌ల ద్వారా ఎరువులు, విత్తనాలు అందించాలి. జీడిమామిడి, పైనాపిల్ వంటి ఇతర ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించాలి. రానున్న నాలుగు మాసాల్లో పూర్తిస్థాయిలో లస్కర్లను నియమించాలి. జలపాతాలు, ఇతర పర్యాటక ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయాలి. తోటపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. టీటీడీ లేదా ఇతర నిధులను మంజూరయ్యేలా చూస్తాం. జిల్లాలో ఆసుపత్రుల మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి వాటిని అందుబాటులోకి రావాలి.’ అని తెలిపారు. అంతకుముందు సమాచార శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల కోసం జైకా నిధులు అవసరమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్న దృష్టికి తీసుకొచ్చారు. వైద్యుల నియామకానికి ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మలేరియా, డయేరియా ప్రబలకుండా వైద్యాధికారులు ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ పార్వతీపురంలో కనీస సౌకర్యాలు లేవన్నారు. కార్యాలయాల్లో ఫర్నీచర్, మౌలిక వసతులు, అధికారులు కూడా లేరన్నారు. తోటపల్లి, జంఘావతి సమస్యలను పరిష్కరిస్తే సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు అందించొచ్చని తెపాపారు. కేరళ పైనాపిల్, పత్తి, పామాయిల్ వంటి వాణిజ్య పంటలకు గిరాకీ ఉందన్నారు. మహిళలతో డెయిరీ ఫారాలను ఏర్పాటు చేయించాలని కోరారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ... జీడీపీ వృద్ధి రేటులో రాష్ట్ర స్థాయిలో జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. గతంతో పోలిస్తే రూ.18000 కోట్లు అదనంగా సమకూరినట్టు తెలిపారు.
జీడి ప్రాసెసింగ్ యూనిట్ పరిశీలన
పార్వతీపురం మార్కెట్ యార్డులో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్‌ను మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. రూ.74 లక్షలతో ఏర్పాటు చేసిన యూనిట్‌ను మహిళా సంఘాలు నిర్వహిస్తున్నాయని అధికారులు తెలిపారు.