Share News

గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Aug 04 , 2025 | 12:26 AM

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం
గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేస్తున్న మంత్రి సంధ్యారాణి

- వారి ఆచారాలు, సంప్రదాయాల పరిరక్షణ అందరి బాధ్యత

- మంత్రి సంధ్యారాణి

- ఘనంగా ఆదివాసీ దినోత్సవం

సాలూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం సాలూరులో ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోసుబొమ్మ జంక్షన్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు గిరిజనులతో కలిసి మంత్రి సంధ్యారాణి ర్యాలీ నిర్వహించారు. తమ సంప్రదాయ మేళతాళాలు, థింసా నృత్యాలతో గిరిజనులు అలరించారు. ఈ ర్యాలీలో ఆదివాసీ ఐక్యత మన బలం, గిరిజన గౌరవం-గిరిజన హక్కులు వంటి నినాదాలు చేశారు. అనంతరం కమ్యూనిటీ హాలులో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడారు. గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు, భాష, సాంస్కృతిక వారసత్వం పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. గిరిజన విద్యార్థుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేయడంతో పాటు వారికి స్కాలర్‌షిప్‌లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 12:26 AM