We will complete Tarakarama Tirtha Sagar. తారకరామ తీర్థసాగర్‌ను పూర్తి చేస్తాం
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:37 AM
We will complete Tarakarama Tirtha Sagar. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు 25 ఏళ్లలో పూర్తికాలేదని, తాము పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో బుధవారం నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
తారకరామ తీర్థసాగర్‌ను పూర్తి చేస్తాం
గిరిజన వర్సిటీ సమీంలో గ్రేహౌండ్ క్యాంపస్
ఉత్తరాంధ్ర సుజలస్రవంతితో చివరి ఎకరాకు నీరు
భోగాపురం ఎయిర్‌పోర్టుతో ప్రపంచపటంలో జిల్లా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
దత్తి గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ
విజయనగరం/ గజపతినగరం/ గంట్యాడ/ మెంటాడ/ దత్తిరాజేరు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి):
తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు 25 ఏళ్లలో పూర్తికాలేదని, తాము పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో బుధవారం నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో వ్యవస్థలను బాగుచేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తిచేసి జిల్లాలో చివరి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం సమీపంలో త్వరలో గ్రేహౌండ్స్ క్యాంపస్ వస్తుందని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టుతో విజయనగరం జిల్లా ప్రపంచానికి కనెక్టు అవుతుందన్నారు.
- ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్ల పండుగ చేపడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు. 1985లో అన్న ఎన్టీఆర్ రూ.30తో పింఛన్ పథకాన్ని ప్రారంభించారని, తాను సీఎం అయ్యాక రూ.75కి పెంచామన్నారు. ఆ తరువాత వెయ్యికి పెరిగిన పింఛన్‌ను 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత రూ.4వేలకు పెంచామన్నారు. ప్రతి నెలా రాష్ట్రంలో ఏదో గ్రామానికి వెళ్లి పింఛన్ పంపిణీని పర్యవేక్షిస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకం కింద 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10,090 కోట్లు జమ చేశామన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా ఈనెల 4వ తేదీన 2 లక్షల90వేల మందికి రూ.15వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. స్ర్తీశక్తి పథకం వల్ల నష్టం కలిగిన ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఎంతో ఊరట నిస్తుందన్నారు. అన్నా క్యాంటీన్ పథకాన్ని మరింత విస్తరిస్తామన్నారు. అనకాపల్లి వద్ద అర్సలాల్ మిటల్ సంస్థ లక్ష కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.
- అంతకుముందు హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నావికుడిగా మారారని, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ఆయన ముందుకు సాగుతున్నారన్నారు. ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రానికి గొప్ప భవిష్యత్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గత 30 ఏళ్లుగా పేదరిక నిర్మూలనలోనే నిమగ్నమై ఉన్నారని, సావరగెడ్డ ప్రాజెక్టు తమ నియోజకవర్గ ప్రజల కల అని, దాన్ని మంజూరు చేయాలని కోరారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతు కేవలం 15 నెలల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కిందని, పి-4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు.
- కలెక్టర్ రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ భోరోసా పథకం పేదల గౌరవాన్ని పెంచిందన్నారు. జిల్లాలో 16.9శాతం అభివృద్ధి సాధించే లక్ష్యంతో ఉన్నామన్నారు. కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంద్యారాణి, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, అదితి గజపతిరాజు, బేబీనాయన, లోకం మాదవి, ఎన్.ఈశ్వరరావు, కళావెంకటరావు, బోనెల విజయచంద్ర, కోండ్రు మురళీమోహన్, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, మాజీమంత్రి చినరాజప్ప, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, టీడీపీ నేతలు ఐవీపీ రాజు, సువ్వాడ రవిశేఖర్, కర్రోతు బంగార్రాజు, సెర్ప్ సీఈవో వాకేటి కరుణ, నియోజక వర్గనాయకుల, కార్యకర్తలు పాల్గొన్నారు