ఆక్రమణల తొలగింపునకు సహకరించాలి
ABN , Publish Date - Jun 08 , 2025 | 11:52 PM
గజపతినగరం నాలుగు రోడ్ల జంక్షన్ నుంచి మెంటాడకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఆక్రమణల తొలగింపునకు వ్యాపారులు సహకరించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): గజపతినగరం నాలుగు రోడ్ల జంక్షన్ నుంచి మెంటాడకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఆక్రమణల తొలగింపునకు వ్యాపారులు సహకరించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక ఫంక్షన్ హాల్‌లో వ్యాపారులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల రూ.39లక్షలతో 1.2కిలో మీటర్ల మేర బీటీ రోడ్డు వేశామన్నారు. కానీ, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ఆక్రమణకు గురి కావడంతో చిన్నపాటి వర్షానికే రోడ్డుపై నీరు చేరి చెరువును తలపిస్తుందన్నారు. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మెంటాడ రోడ్డులో 40 అడుగుల వరకు ఆర్‌అండ్‌బీ అధికారులతో పాటు గ్రామ పంచాయతీ అధికారులు సర్వే చేపట్టి హద్దులు నిర్ణయించాలన్నారు. రోడ్డుపై ఆక్రమణలు తొలగిస్తే పదేళ్ల వరకు ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఆక్రమణల తొలగింపులో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు మక్కువ శ్రీధర్, రామ్‌కుమార్, ప్రదీప్‌కుమార్, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పూసర్ల మోహన్ పంచాయుతీ అధికారి శ్రీనివాస్, ఉపసర్పంచ్ మండల సురేష్ తదితరులు పాల్గొన్నారు.