Ganja ఉత్తరాంధ్రలో గంజాయి సాగు తగ్గించాం
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:05 AM
We Have Reduced Ganja Cultivation in North Andhra ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఏడాది గంజాయి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించగలిగామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. సోమవారం ఎల్విన్‌పేట పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు.
గుమ్మలక్ష్మీపురం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఏడాది గంజాయి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించగలిగామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. సోమవారం ఎల్విన్‌పేట పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ..‘ అల్లూరి సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతంలో 11,000 ఎకరాల్లో గంజాయి సాగు జరిగేది. ఈ ఏడాది 93 ఎకరాలకు సాగు తగ్గింది. డ్రోన్లు, శాటిలైట్ ద్వారా గంజాయి సాగును గుర్తిస్తున్నాం. వేలాది ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి చర్యలు తీసుకున్నాం. గంజాయి రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఏవోబీ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నాం. గతంలో పోలిస్తే ఒడిశా నుంచి ఏపీ మీదుగా గంజాయి రవాణా బాగా తగ్గింది. బస్సులు, రైళ్లు , కార్లు, ఇతర వాహనాల్లో రవాణా చేస్తున్న వారిపై నిఘా పెట్టాం.’ అని తెలిఆపరు.
కేసులు నమోదు ఇలా..
‘గత ఏడాది 867 గంజాయి కేసులను నమోదు చేసి 20,467 మందిని అరెస్టు చేశాం. 65 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశాం. 500 వాహనాలను సీజ్ చేశాం. సంకల్పం పేరిట గంజాయికు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాం. ఇప్పటివరకు 12 లక్షల మంది విద్యార్థులు, యువత, మహిళా సంఘాలకు అవగాహన కల్పించాం. అభ్యుదయం పేరిట గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు సైకిల్ యాత్ర నిర్వహి స్తున్నాం. విద్యార్థినులకు పోక్సోపై అవగాహన కల్పిస్తున్నాం. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్‌లపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నాం. బాధితుల నగదు రికవరీ చేయడానికి కృషి చేస్తున్నాం. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.’ అని డీఐజీ వెల్లడించారు
మన్యంలో తగ్గిన క్రైం రేటు
‘పార్వతీపురం మన్యం జిల్లాలో క్రైం రేటు తగ్గింది. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై ఆర్‌అండ్‌బీ అధికారులతో చర్చిస్తున్నాం. డ్రంకెన్ డ్రైవ్ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి.’ అని డీఐజీ తెలిపారు. ఆయన వెంట ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ వెంకటేశ్వరరావు, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, సీఐలు, ఎస్‌ఐలు తదితరులున్నారు.
పెట్రోల్ బంక్ ప్రారంభం
పాలకొండ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పాలకొండ ఆర్టీసీ డిపో సమీపంలో పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంక్‌ను సోమవారం డీఐజీ ప్రారంభించారు. జిల్లా పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్ బంక్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సిబ్బంది వెల్ఫేర్‌కు ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు.
శ్రీవారి ఆలయంలో పూజలు
సీతంపేట రూరల్: సీతంపేటలోని వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.