Share News

We have introduced new Vangadas కొత్త వంగడాలను ఆవిష్కరించాం

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:57 PM

We have introduced new Vangadas ‘వరి, ఇతర పంటలపై నిత్యం అధ్యయనం చేస్తున్నాం. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉపయోగించేందుకు వరి, మొక్కజొన్న, వేరుశనగ, అపరాల కోసం ప్రత్యేకంగా నూతన వంగడాలను ఆవిష్కరించాం. వాటిపై రైతులకు అవగాహన కల్పిస్తాం’ అని ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్‌, సీనియర్‌ శాస్త్రవేత్త కె.లక్ష్మణరావు తెలిపారు. తనను కలిసిన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ అనేక అంశాలను వెల్లడించారు. పంటల్లో రసాయన ఎరువులు తగ్గించాలని కోరారు. ఈ విషయంలో తొందరగా మార్పులు రావాలన్నారు.

We have introduced new Vangadas కొత్త వంగడాలను ఆవిష్కరించాం
కె.లక్ష్మణరావు, ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్‌

కొత్త వంగడాలను ఆవిష్కరించాం

వాటిపై రైతుల్లో అవగాహన తెస్తున్నాం

మామిడి పంట విస్తీర్ణం పెరిగితే ఎన్నో లాభాలు

కొత్త పరిశ్రమలొస్తాయి

పంటల్లో రసాయన ఎరువులు తగ్గించాలి

ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్‌, సీనియర్‌ శాస్త్రవేత్త కె.లక్ష్మణరావు

విజయనగరం రూరల్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ‘వరి, ఇతర పంటలపై నిత్యం అధ్యయనం చేస్తున్నాం. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉపయోగించేందుకు వరి, మొక్కజొన్న, వేరుశనగ, అపరాల కోసం ప్రత్యేకంగా నూతన వంగడాలను ఆవిష్కరించాం. వాటిపై రైతులకు అవగాహన కల్పిస్తాం’ అని ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్‌, సీనియర్‌ శాస్త్రవేత్త కె.లక్ష్మణరావు తెలిపారు. తనను కలిసిన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ అనేక అంశాలను వెల్లడించారు. పంటల్లో రసాయన ఎరువులు తగ్గించాలని కోరారు. ఈ విషయంలో తొందరగా మార్పులు రావాలన్నారు.

ప్రశ్న: పంటలపై ఉష్ణోగ్రతల ప్రభావం ఏమేర ఉంటుంది?

జ: ఏటా వేసవిలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నాయి. గత పదేళ్లుగా ఈ పరిస్థితి కన్పిస్తోంది. అంతకుముందు 0.5 డిగ్రీలు పెరిగేది. దీంతో పెరిగినట్టు అన్పించేది కాదు. ఇప్పుడలా కాదు. ఏటా ఒకటి నుంచి రెండు డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ప్రభావం మనిషిపైనే కాదు పంటపైనా పడుతోంది. దిగుబడి తగ్గుతోంది.

ప్రశ్న: ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణాలేంటి?

జ: నానాటికీ కాలుష్యం పెరుగుతోంది. పంటలకు, అటు మానవాళి మనుగడకూ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా ప్లాస్టిక్‌, పాలిథిన్‌ వినియోగం పెరగడం ఇబ్బందికరమే. ఎక్కడికక్కడ అడ్డుకట్ట పడాలి. ఇందుకు అందరి సహకారం అవసరం. లేకుంటే ఉష్ణోగ్రతలు తగ్గవు.

ప్రశ్న: కొత్త వంగడాలు వచ్చాయా?

జ: ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ ఆదేశాల మేరకు వరి, ఇతర పంటల కోసం నిత్యం అధ్యయనం చేస్తున్నాం. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉపయోగించేందుకు వరి, మొక్కజొన్న, వేరుశనగ, అపరాల నూతన వంగడాలను ఆవిష్కరించాం. ఈ వంగడాల పట్ల రైతులకు అవగాహన కల్పిస్తాం. కొత్త వంగడాలు రైతులకు అధిక ప్రయోజనాన్ని చేకూర్చుతాయి.

ప్రశ్న: మామిడి, జీడి విస్తీర్ణం తగ్గుతోందా?

జ: విజయనగరం ఉమ్మడి జిల్లాగా ఉండేటప్పుడు మామిడి, జీడి పంటల విస్తీర్ణం ఎక్కువగా ఉండేది. విడిపోయిన తరువాత విజయనగరంలో మామిడి పంట తగ్గినప్పటికీ దాదాపు 75 వేల ఎకరాల్లో సాగు విస్తరించి ఉంది. విజయనగరం, మెరకముడిదాం, చీపురుపల్లి, గరివిడి, మెంటాడ, గజపతినగరం, దత్తిరాజేరు, గంట్యాడ, కొత్తవలస, బొండపల్లిలో ఎక్కువగా మామిడి తోటలు ఉన్నాయి. జీడి పంట విషయానికి వస్తే మెరకముడిదాం, చీపురుపల్లి, బొండపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కువ.

ప్రశ్న: ఫలసాయం పరిస్థితి ఏంటి?

జ: మామిడికి సంబంధించి గత ఏడాది కంటే ఫలసాయం పెరిగే అవకాశం వుంది. అంతకుముందు ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా ఈ ఏడాది అధికంగా నమోదైంది. ఈ నేపథ్యంలో మామిడి, జీడి పంటలు కలిసి వచ్చే అవకాశం ఉంది.

ప్రశ్న: మామిడి సాగు పెరగాలంటే ఏం చేయాలి?

జ: గతంలో మామిడిని ఒడిశాలోని భువనేశ్వర్‌, జైపూర్‌, ఢిల్లీ తదితర ప్రాంతాలకు విజయనగరం నుంచి ఎగుమతి చేసేవారు. పదేళ్లుగా ఆ పరిస్థితి లేదు. ఇక్కడి పంటను ఇక్కడే రైతులు అమ్ముకుంటున్నారు. మామిడి ఆధారిత పరిశ్రమలకు సంబంధించి విజయనగరంలో ఒక్క మామిడి తాండ్ర తప్ప వేరేది లేదు. మామిడి ప్రోసెసింగ్‌ ఆధారంగా పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుంది. రైతులకు మంచి ధర వస్తుంది. మరింతగా సాగు చేయాలని ఆసక్తి చూపుతారు. ఆ దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి.

Updated Date - Apr 09 , 2025 | 11:57 PM