Share News

We Faced It Efficiently! సమర్థంగా ఎదుర్కొన్నాం!

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:24 AM

We Faced It Efficiently! సీఎం చంద్రబాబు సూచనలు, జిల్లా యంత్రాంగం సహకారంతో ఎటువంటి నష్టం లేకుండా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు.

We Faced It Efficiently! సమర్థంగా ఎదుర్కొన్నాం!
మామిడిపల్లి వద్ద సువర్ణముఖి నదిని పరిశీలిస్తున్న మంత్రి

  • మంత్రి సంధ్యారాణి

సాలూరు/సాలూరు రూరల్‌, అక్టోబరు29(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు సూచనలు, జిల్లా యంత్రాంగం సహకారంతో ఎటువంటి నష్టం లేకుండా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. బుధవారం సాలూరు తహసీల్దార్‌ కార్యాలయంలో సంబంఽధిత అధికారులతో సమీక్షించారు. ‘వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాతే పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను తిరిగి ఇళ్లకు పంపించాలి. వారికి ఆహార పదార్థాలు, తాగునీరు అందించాలి. గ్రామాలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకూడదు. వ్యవసాయ, రెవెన్యూ శాఖాధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి నష్టపోయిన పంటలను పరిశీలించాలి. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందనే విషయాన్ని అన్నదాతలకు తెలియజేయాలి. సాలూరు మార్కెట్‌ యార్డులో పత్తిని కొనుగోలు చేస్తాం. సాలూరులోని ఓ మిల్లులో రైతుల పంటలను నిల్వ చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న గోదాములను త్వరలో అందుబాటులోకి తేస్తాం. వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. లబ్ధిదారులు అడిగితే ముందస్తుగా బియ్యం అందించాలి. ’ అని మంత్రి తెలిపారు. నిధుల కోసం తమను సంప్రదిచాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆమె సాలూరు మండలం మామిడిపల్లిలో పర్యటించారు. ఆ గ్రామంలో పీహెచ్‌సీ, సువర్ణముఖి నది ప్రవాహాన్ని పరిశీలించారు. ‘ వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల మామిడిపల్లి పీహెచ్‌సీతో సహా పలు లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు తప్పింది. పీహెచ్‌సీలో ఉన్న వైద్య పరికరాలను పక్కనే ఉన్న వైద్యుల క్వార్టర్స్‌కు తరలించాం. రోగులు ఇబ్బంది పడకుండా వైద్యాధికారులు సేవలు అందిస్తున్నారు. జిల్లాలో మహిళా పోలీసులకు వాకీటాకీలు ఇచ్చాం. వాటి ద్వారా ఏ సమస్య అయినా ఉన్నతాధికారులకు చెప్పొచ్చు. తుఫాన్‌ బాధితులు 1912, 100, 101 ట్రోల్‌ ఫ్రీ నెంబర్లకు ఫోన్‌ చేసి సాయం పొందొచ్చు. వరద ఉధృతి నేపథ్యంలో కాజ్‌వేలపై రాక పోకలు నిషేధించగా.. ఆయా గ్రామస్థులకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలి.’ అని మంత్రి చెప్పారు.

Updated Date - Oct 30 , 2025 | 12:24 AM