We emerged with foresight. ముందుచూపుతో బయటపడ్డాం
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:23 AM
We emerged with foresight. జిల్లాలో ముందస్తు చర్యలతో మొంథా తుఫాన్‌కు ఎటువంటి ప్రాణనష్టం సంభవించకుండా చూడగలిగామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో ఇల్లు కూలిపోయిన బాధితుడితో పాటు ఏరియా ఆసుపత్రిలో ప్రసవించిన మర్రివసల గ్రామానికి చెందిన మహిళను బుధవారం పరామర్శించారు.
ముందుచూపుతో బయటపడ్డాం
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరం, అక్టోబరు29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ముందస్తు చర్యలతో మొంథా తుఫాన్‌కు ఎటువంటి ప్రాణనష్టం సంభవించకుండా చూడగలిగామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో ఇల్లు కూలిపోయిన బాధితుడితో పాటు ఏరియా ఆసుపత్రిలో ప్రసవించిన మర్రివసల గ్రామానికి చెందిన మహిళను బుధవారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులంతా సమన్వయంతో పనిచేయడంతో ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోగలిగామన్నారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయడంతో విద్యుత్, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సమీప తేదీల్లో ప్రసవాలు జరిగే అవకాశం ఉన్న గర్భిణులను ముందే గుర్తించి 360 మందిని ఆస్పత్రుల్లో చేర్పించామన్నారు. మంగళవారం ఒక్కరోజే 15 మందికి ప్రసవాలు జరిగాయని తెలిపారు. గజపతినగరం మండలంలోని కొనిస, కాళంరాజపేట గ్రామాల్లో చెరువులకు గండ్లు పడ్డాయని, ప్రత్యామ్నాయ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వరి, ఉద్యాన పంటలకు సంబంధించి నష్టం జరిగిన చోట వివరాలు తీసుకుంటున్నామన్నారు.
బాధితులకు పరామర్శ
గంగచోళ్లపెంట గ్రామంలో కాళ సన్యాసినాయుడు నివాసం ఉంటున్న ఇంటికి సంబంధించి మంగళవారం అర్ధరాత్రి ఒక పక్క గోడ కూలిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ బుధవారం బాధితుడిని పరామర్శించారు. ఇంటి స్థలం మంజూరు చేయాలని తహసీల్దార్ బి.రత్నకుమార్‌కు ఆదేశించారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రుణం అందేలా చూడాలని గృహనిర్మాణశాఖ అధికారులకు సూచించారు. మెంటాడ మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందిన బాలింత మీసాల పార్వతిని కూడా మంత్రి పరామర్శించారు. పురిటినొప్పులతో బాధపడుతున్న ఈమెను ప్రమాదకర స్థితిలో గ్రామస్థులు ఆటోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ప్రసవించిన ఆమెను మంత్రి పరామర్శించారు. విజయవంతంగా శస్త్రచికిత్స చేసినందుకు వైద్య సిబ్బందిని అభినందించారు. మంత్రి వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్, పీఏసీఎస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, ఆండ్ర ప్రాజెక్టు చైర్మన్ కోడిసతీష్, మాజీ ఎంపిపి గంట్యాడశ్రీదేవి, మాజీ జడ్పీటీసీ మక్కువ శ్రీధర్ ఉన్నారు.