water problem గొంతు తడవక.. ముద్ద దిగక
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:38 PM
water problem ఆ పాఠశాల విద్యార్థులు భోజన సమయంలో గుక్కెడు తాగునీటికి నోచుకోవడం లేదు. దీంతో గొంతు తడవక.. ముద్ద దిగక ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటిలాగే మంగళవారం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. చేసేదిలేక అరకొర అన్నంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదీ గంట్యాడ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో పరిస్థితి.
గొంతు తడవక.. ముద్ద దిగక
భోజన సమయంలో అవస్థలు పడుతున్న విద్యార్థులు
తాగునీరు కరువు
పూర్తి స్థాయిలో తినని భోజనం
మిగిలిపోయిన అన్నం పారబోసిన ఏజెన్సీ సభ్యులు
గంట్యాడ, నవంబరు 25 (ఆంరఽధజ్యోతి): ఆ పాఠశాల విద్యార్థులు భోజన సమయంలో గుక్కెడు తాగునీటికి నోచుకోవడం లేదు. దీంతో గొంతు తడవక.. ముద్ద దిగక ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటిలాగే మంగళవారం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. చేసేదిలేక అరకొర అన్నంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదీ గంట్యాడ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో పరిస్థితి. ఈ పాఠశాలలో 377 మంది చదువుతున్నారు. వీరికి తాగునీరు లేకపోవడంతో పాఠశాల ఆవరణలో పంచాయతీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన కొళాయి నీరు అందిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే భోజనం చేసే షెడ్‌లో తాగునీటి సదుపాయం లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు ముద్ద గొంతు దిగని పరిస్థితి చోటు చేసుకుంటోంది. నిత్యం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. కాగా మంగళవారం 316 మంది విద్యార్థులకు ఏజెన్సీ సభ్యులు భోజనం తయారు చేసి పెట్టారు. ఆ సమయంలో విద్యార్థుల వద్ద నీళ్ల సీసాలు గానీ, గాస్లులతో నీరు గానీ అందుబాటులో లేదు. దీంతో పూర్తి స్థాయిలో వారు అన్నం తినకుండా బయట పారబోశారు. ఇదిలా ఉంటే.. విద్యార్థులు భోజనం చేసిన తరువాత చాలా అన్నం (గంపలతో) మిగిలిపోవడంతో ఏజెన్సీ సభ్యులు బయట పారబోశారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7న కలెక్టర్ రామసుందర్ రెడ్డి పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి.. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. భోజనం తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినా పాఠశాలలో పరిస్థితి మారలేదు. దీనిపై హెచ్‌ఎం అలమండ ఝూన్సీ వద్ద ప్రస్తావించగా ‘పాఠశాలలో విద్యార్థులకు పంచాయతీ ఆధ్వర్యంలో కొళాయి సదుపాయం ఉంది. విద్యార్థులు సీసాలతో నీరు తెచ్చుకుంటున్నారు. పాఠశాల వద్ద బిందెలతో నీరు అందుబాటులో ఉంచాం. తాగునీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లాం. ఆర్‌వో ప్లాంట్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. నిర్వాహకులు అన్నాన్ని ఎందుకు బయట పడేశారో తెలియదు. విషయం తెలుసుకుంటా’నని చెప్పారు.