Share News

water in all జలమయం

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:49 PM

water in all

water in all  జలమయం
లక్కవరపుకోట: కల్లేపల్లి వద్ద ఉధృతంగా రామన్న చెరువు చప్టా

జలమయం

జిల్లా వ్యాప్తంగా కుండపోత

46.9 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదు

ఎస్‌.కోటలో అత్యఽధికం, గజపతినగరం అత్యల్పం

అప్రమత్తమైన అధికార యంత్రాంగం

మంత్రి, జిల్లా ప్రత్యేకాధికారి, కలెక్టరు, జేసీ పర్యటన

నలుగురు అధికారులకు షోకాజ్‌ నోటీసులు

138 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం

పాక్షికంగా దెబ్బతిన్న 20 ఇళ్లు

49 కిలోమీటర్ల మేర పాడైన ఆర్‌అండ్‌బీ రోడ్లు

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ జిల్లా ప్రజలను టెన్షన్‌ పెడుతోంది. రెండు రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు అంతా జలమయం అయింది. వల్లపు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. బుధవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ విభాగం హెచ్చరికలతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జిల్లా వ్యాప్తంగా 46.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎస్‌.కోట మండలంలో అధికంగా 91.8 మిల్లీమీటర్లు నమోదు కాగా గజపతినగరం మండలంలో అత్యల్పంగా 21.6 మిల్లీమీటర్లు కురిసింది. చెరువులు, కాలువలు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరురావడంతో దిగువకు విడిచిపెడుతున్నారు. భారీ వర్షాలకు రెండో రోజు కూడా ప్రజలెవరూ గడప దాటలేదు. పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. కాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, జిల్లా ప్రత్యేకాధికారి రవి సుభాస్‌, ఎస్పీ దామోదర్‌, జేసీ సేతుమాధవన్‌, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. యంత్రాంగం, లోతట్టు ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు. కాగా కలెక్టర్‌ గజపతినగరం, బొండపల్లి మండలాల్లో పర్యటించిన సమయంలో కంట్రోల్‌ రూం విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. బొండపల్లి మండల ప్రత్యేకాధికారి పట్టు పరిశ్రమ సహాయ సంచాలకుడు సాల్మన్‌రాజు, అక్కడి తహసీల్దార్‌ రాజేశ్వరరావు, గజపతినగరం మండల ప్రత్యేకాధికారి జిల్లా కోఆపరేటివ్‌ అఽధికారి రమేష్‌, తహసీల్దార్‌ రత్నకుమార్‌లకు నోటీసులు ఇచ్చారు. కాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ రాత్రి వరకూ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలో ఉండి పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

146 హెక్టార్లలో పంటలకు నష్టం

తుఫాన్‌ వర్షాలకు జిల్లాలో 146 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా వరి పంట నేలవాలింది. కూరగాయల పంటలూ నీటి మునిగాయి. బొండపల్లి, డెంకాడ, విజయనగరం, గంట్యాడ తదితర మండలాల్లో 20 ఇళ్ల వరకూ పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులకు నివేదికలు అందాయి. గంట్యాడ, గుర్ల, నెల్లిమర్ల, విజయనగరం తదితర ప్రాంతాల్లో 49 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. భోగాపురం, బొండపల్లి మండలాల్లో రెండు పశువులు మృతి చెందాయి. విద్యుత్‌ శాఖకు సంబంధించి 12 స్తంభాలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా ఆ శాఖ అధికారులు గుర్తించారు.

తీరంలో మంత్రి పర్యటన

పూసపాటిరేగ, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): చింతపల్లి తీరాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు మంగళవారం సందర్శించి మత్స్యకారులతో మాట్లాడారు. పాక్షికంగా దెబ్బతిన్న గృహాల్లో ఉన్న వారిని అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ఈదురుగాలుల కారణంగా కొన్ని ప్రాంతాలలో బొప్పాయి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. మరికొన్ని ప్రాంతాల్లో వరిపంట నేలకొరిగింది.

అతివేగంగా గాలులు

భోగాపురం, అర్టోబరు28(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ కారణంగా మంగళవారం సాయంత్రానికి తీరం వెంబడి గాలుల తీవ్రత పెరిగింది. తాటాకు గృహాల కమ్మలు ఎగిరిపోయాయి. చాలా చెట్లు ఒక వైపుగా వాలిపోయాయి. పూరిపాకల్లో ఉంటున్న వారు వణుకుతున్నారు. ముక్కాం, కొండ్రాజు పాలెం, చేపలకంచేరు, ఎర్రముసలయ్యపాలెం గ్రామాల్లో గాలుల తీవ్రత స్పష్టంగా కనిపించింది. మరోవైపు సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు సముద్రం ఎర్రగా మారింది. తీర గ్రామాల నుంచి వర్షం నీరు సముద్రంలో కలవడంతో రంగు మారినట్లు మత్స్యకారులు తెలిపారు. అలాగే వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో వరి పంట నేలవాలింది. తోటపల్లి గ్రామంలో కొంత మేర రాగి పంట నేలకొరిగింది.

200 ఎకరాల్లో మునిగిన వరి

వేపాడ, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): వర్షాలకు వేపాడ మండలంలో సుమారు 200 ఎకరాలల్లో వరి పంట నీటి మునిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. సిబ్బంది నీటమునిగిన వరి చేలను, నేల కొరిగిన వరి పంటల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అలాగే వర్షాల నుంచి పంటను ఏవిధంగా రక్షించుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు.

సమర్థంగా ఎదుర్కొంటున్నాం

కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అందరి సమన్వయంతో ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా అందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో 69 ముంపు ప్రాంతాలను గుర్తించామని, 71 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరంగా తగిన మందులు అందుబాటులో ఉంచామని, పునరావాస కేంద్రాల్లోని వారికి భోజన, మంచినీటి వసతిని కల్పించామన్నారు. ప్రాజెక్టుల్లో నీటి మట్టం, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలో కూడా పెద్ద చెరువులోని నీరు బయటకు రాకుండా పూడిక తీయిస్తున్నామన్నారు. 41 కంట్రోలు రూంలు ఏర్పాటు చేశామని, వ్యవసాయాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి రైతులకు తగిన సూచనలు ఇస్తున్నామన్నారు. 1,900 విద్యుత్‌ స్తంభాలు, 380 ట్రాన్స్‌ఫార్మర్లు, 500 మంది సిబ్బందిని సిద్ధం చేశామన్నారు. ప్రసవ సమయం సమీపించిన 306 మంది గర్భిణులను వారు కోరుకునే ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశామన్నారు.

కంట్రోల్‌ రూంను పర్యవేక్షించిన మంత్రి శ్రీనివాస్‌

విజయనగరం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ఎదుర్కొవడానికి జిల్లా అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లు, సహాయక చర్యలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మంగళవారం జిల్లా కేంద్రం నుంచి పర్యవేక్షించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కంట్రోల్‌ రూం నుంచి ఆయన జిల్లా అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.

నగరంలో లోతట్టు ప్రాంతాలకు అధికారులు

విజయనగరం టౌన్‌/ క్రైం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ నేపథ్యంలో నగరంలో ప్రభావితమయ్యే లోతట్టు ప్రాంతాలైన ఐస్‌ఫ్యాక్టరీ జంక్షన్‌, లోయర్‌ ట్యాంకుబండ్‌, పెద్ద చెరువును కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌లు మంగళవారం పరిశీలించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తినా, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వారి వెంట కమిషనర్‌ నల్లనయ్య ఉన్నారు.

--------------

Updated Date - Oct 28 , 2025 | 11:49 PM