Warehouses are empty గోదాములు ఖాళీ
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:02 AM
Warehouses are empty జిల్లాలో చాలా గోదాములు వృథాగా పడి ఉన్నాయి. రైతులకు ఉపయోగపడడం లేదు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. రైతులు పండించిన పంటను, వ్యవసాయ ఉత్పత్తులను దాచుకునేందుకు వీలుగా ప్రాథమిక వ్యవసాయపరపతి సంఘాలకు సంబంధించి గోదాములు నిర్మించారు కానీ అవి గ్రామాలు, పట్టణాలకు దూరంగా ఉన్నాయి.
గోదాములు ఖాళీ
నిరుపయోగంగా పీఏసీఎస్ గోడౌన్లు
ఊరికి దూరంగా నిర్మాణం
ఉపయోగించేందుకు రైతుల విముఖత
వైసీపీ నిర్వాకంతో రూ.30 కోట్ల ప్రజాధనం వృథా
నెల్లిమర్ల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చాలా గోదాములు వృథాగా పడి ఉన్నాయి. రైతులకు ఉపయోగపడడం లేదు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. రైతులు పండించిన పంటను, వ్యవసాయ ఉత్పత్తులను దాచుకునేందుకు వీలుగా ప్రాథమిక వ్యవసాయపరపతి సంఘాలకు సంబంధించి గోదాములు నిర్మించారు కానీ అవి గ్రామాలు, పట్టణాలకు దూరంగా ఉన్నాయి. రక్షణ లేని ప్రాంతాల్లో నిర్మించారు. దీంతో నిరుపయోగంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో 92 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వైసీపీ హయాంలో 65 గోదాములు నిర్మించాలని భావించారు. 41 గోదాముల నిర్మాణాన్ని పూర్తిచేశారు. 17 వివిధ దశల్లో ఉన్నాయి. మరో 7 స్థల సమస్య కారణంగా నిర్మాణానికి నోచుకోలేదు. 500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన గోదాము ఒక్కోదానికి రూ.40 లక్షలు, 1000 మెట్రిక్ టన్నుల గోదాముకు రూ.70 లక్షలు ఖర్చుచేశారు. అంటే రూ.30 కోట్లు అన్నమాట. కానీ ఈ గోదాములేవీ వినియోగంలోకి తేకపోవడంతో అసలు లక్ష్యం దెబ్బతింది.
పూర్తిగా నిర్వీర్యం..
వైసీపీ హయాంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. రైతుభరోసా కేంద్రాల పేరిట పీఏసీఎస్‌లను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కూటమి వచ్చిన తరువాత మాత్రమే పీఏసీఎస్‌ల బలోపేతానికి ఒక్కో నిర్ణయం తీసుకుంటోంది. అందులో భాగంగా పూర్తిగా కంప్యూటరీకరణకు దిగింది. ఆన్‌లైన్‌లో రైతుల వివరాలను నమోదుచేస్తున్నారు. ప్రతి రైతుకు ఈకేవైసీపీ చేసి వివరాలను పూర్తిస్థాయిలో కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ సచివాలయాలకు ఆయా సొసైటీల వివరాలు, లావాదేవీలకు సంబంధించి దస్త్రాలు వెళ్లాయి. సహకార సంస్థ, గ్రామ సచివాలయ సిబ్బంది సమన్వయంతో ఈకేవైసీపీ పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో జిల్లాలో చాలా ప్రాథమిక సహకార సంఘాల్లో అక్రమాలు బయటపడ్డాయి. కేవలం కంప్యూటరీకరణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కూటమి ప్రభుత్వం భావించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.