Climbed the Hills… మూడు కిలోమీటర్లు నడిచి.. కొండలెక్కి..
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:11 AM
Walked Three Kilometers and Climbed the Hills… జిల్లాలో పర్యాటకాభివృద్ధికి కంకణం కట్టుకున్న కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఆదివారం లొద్ద జలపాతానికి వెళ్లారు. అయితే ఇందుకోసం బాగా శ్రమించారు. మూడు కిలోమీటర్లు పైబడి నడిచి కొండలెక్కి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. భారీ వర్షంలో తడుస్తూ జలపాతాన్ని పరిశీలించారు.
అభివృద్ధిపై అధికారులతో సమీక్ష
సాలూరు రూరల్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పర్యాటకాభివృద్ధికి కంకణం కట్టుకున్న కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఆదివారం లొద్ద జలపాతానికి వెళ్లారు. అయితే ఇందుకోసం బాగా శ్రమించారు. మూడు కిలోమీటర్లు పైబడి నడిచి కొండలెక్కి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. భారీ వర్షంలో తడుస్తూ జలపాతాన్ని పరిశీలించారు. వాస్తవంగా ఏవోబీ పరిధి సాలూరు మండలం కొదమ పంచాయతీలో లొద్ద బారిబంద జలపాతం ఉంది. సుందరంగా ఉండే ఈ జలపాతానికి చేరుకోవడానికి రోడ్డు నిర్మాణం జరుగుతుంది. కాగా జలపాతం సందర్శించేందుకు పార్వతీపురం నుంచి కారులో మక్కువ మండలం నంద వరకు వెళ్లారు. అక్కడ నుంచి అధికారులతో కలిసి జీపుల్లో లొద్దకు పయనమయ్యారు. వర్షాలకు ఆ మట్టి రోడ్డు పాడవ్వడంతో జీపులను మాసిన వలస దాటిన తర్వాత నిలిపివేశారు. అక్కడి నుంచి కొద్ది దూరం బైక్‌పై కలెక్టర్ పయనమవగా.. అధికారులంతా కాలినడకన వెళ్తుండడంతో ఆయన కూడా నడకబాట పట్టారు. ఆ తర్వాత మూడు కిలోమీటర్లు నడిచి లొద్ద వద్దకు చేరుకున్నారు. అక్కడ గిరిజనులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నదీ లేని ఆరా తీశారు. ఏయే పంటలు పండిస్తున్నారు? ఏ ఆహారం తింటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు మంజూరుకు హామీ ఇచ్చారు. బందపాయి, చింతామలకు రోడ్డు నిర్మించి, అంబులెన్స్ అందు బాటులో ఉండేటట్టు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరారు. లొద్ద పర్యటనకు వెళ్లిన జిల్లా కలెక్టర్ స్థానిక గిరిజనులు అందించిన రాగి సంకటి, అంబలి, టమాటా చట్నీ తిన్నారు. అనంతరం కలెక్టర్ మరో రెండు కిలోమీటర్లు వరకు నడిచి లొద్ద జలపాతానికి చేరుకున్నారు. అనంతరం జలపాతంలో ఆయన స్నానం చేశారు. ఆ తర్వాత కలెక్టర్ లొద్ద చేరుకుని అధికారులతో సమీక్షించారు. లొద్ద జలపాతం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. లొద్ద జలపాతానికి వెళ్లే మార్గాన్ని స్థానికుల సాయంతో బాగు చేయాలని పీఆర్ డీఈని ఆదేశించారు. చింతచెట్టు, కాగితపు పూల మొక్కలు నాటాలని, జలపాతానికి వెళ్లడానికి సూచిక బోర్డులు పెట్టాలని ఉపాధి ఏపీవో టి.రామకృష్ణకు సూచించారు. గిరిజనులకు రుణాలందించి జలపాతం సమీపంలో దుకాణాలు, చిన్న హోటల్స్ ఏర్పాటు చేయించాలని వెలుగు ఏపీఎం ఎ.జయమ్మను ఆదేశించారు. రోడ్లు అనుమతులు తదితర అంశాలపై డీఎఫ్‌వో ప్రసూనతో మాట్లాడారు. పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి లభిస్తుందన్నారు. సాయంత్రం వర్షం తగ్గిన తర్వాత లోద్ద జీపుల వద్దకు చేరుకొని తిరుగు పయనమయ్యారు.