walk is slow.. but great helper నడక నెమ్మది.. మేలు గొప్పది
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:52 PM
walk is slow.. but great helper పర్యావరణానికి మేలు చేసే జీవుల్లో తాబేళ్లదీ కీలక పాత్రే. సముద్రంలో మత్యసంపద పెరిగేందుకు ఇవి తోడ్పడతాయని చెబుతారు. చేపల గుడ్లను తినే జెల్లీ ఫిష్‌లను తాబేళ్లు తింటా యి. దీంతో మత్స్య సంపదకు రక్షణ దొ రుకుతుంది

నడక నెమ్మది.. మేలు గొప్పది
పర్యావరణ పరిరక్షణకు తాబేళ్ల తోడ్పాటు
సంరక్షణకు ప్రభుత్వం చర్యలు
నేడు సముద్ర తాబేళ్ల దినం
భోగాపురం/పూసపాటిరేగ, జూన్ 15(ఆంధ్రజ్యోతి): పర్యావరణానికి మేలు చేసే జీవుల్లో తాబేళ్లదీ కీలక పాత్రే. సముద్రంలో మత్యసంపద పెరిగేందుకు ఇవి తోడ్పడతాయని చెబుతారు. చేపల గుడ్లను తినే జెల్లీ ఫిష్‌లను తాబేళ్లు తింటా యి. దీంతో మత్స్య సంపదకు రక్షణ దొ రుకుతుంది. సముద్రపు నాచును కూడా ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ఇది కూడా మత్స్యసంపద పెరిగేందుకు దోహ దం చేసేదే. వీటి ప్రాముఖ్యత తెలుసుకున్న ప్రభుత్వం వీటి సంరక్షణకు చర్యలు తీసుకుం టోంది. ముఖ్యంగా మన సముద్రంలో ఎక్కువగా ఆలివ్‌రిడ్లే తాబేళ్లు కానవస్తాయి. ఇవి ఏటా డిసెం బరు నుంచి మే నెల లోపల ఒడ్డుకు వచ్చి అరమీటరు వరకు గొయ్యి తవ్వి.. గుడ్లను పెట్టి.. తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. గతంలో ఈ గుడ్లకు సంరక్షణ ఉండేది కాదు. ఫలితంగా గుడ్లను...లేదా పొదిగిన తరువాత పిల్లలు ఇతర జంతువుల భారిన పడేవి. దీని వల్ల ఇటు తాబేళ్ల ఉనికికి ము ప్పు కలగడంతో పాటు మత్స్య సంపదకూ ప్రమా దం వాటిల్లింది. దీంతో వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛం ద సంస్థల సహకారంతో ప్రభుత్వమే వీటి సంరక్షణకు చర్యలకు దిగింది. ఈ ప్రాంతం లో అటవీ, మత్యశాఖలతో పాటు ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీటి బాధ్యతలు చూస్తున్నారు. తీరప్రాంతంలో గుడ్లను సేకరించి... అవి పిల్లలయ్యాక సముద్రంలో విడిచి పెడుతున్నారు. ఏటా ఈ ప్రక్రియ నడుస్తోంది. దీని వల్ల కొంతవరకు వీటి సంరక్షణకు అవకాశం కలుగుతోంది. ఈఏడాది ఎన్నడూ లేని విధంగా 56 వేల గుడ్లు సేకరించి... పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టినట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది అధిక సంఖ్యలో తాబేళ్లు మృత్యువాత పడినట్టు వివరించారు.
ఎన్ని రకాలంటే..
సముద్ర తాబేళ్లలో ఏడు జాతులు ఉన్నాయి. వాటిలో గ్రీన్, హాక్స్‌బిల్, కెంప్స్ రిడ్లీ, లెదర్‌బ్యాక్ సముద్ర తాబేలు సుమారు 550 నుంచి 2000 పౌండ్ల బరువు ఉంటాయి. ఇవి ఆరడుగుల పొడవు వరకు పెరుగుతాయి. సముద్ర తాబేళ్లు చల్లని, వెచ్చని నీటిలో నివసిస్తాయి. ఇవి 50 నుంచి 100 సంవత్సరాలు జీవించగలవు. కొన్ని సముద్ర తాబేళ్లు తమ గూడు ప్రదేశాలకు తిరిగి రావడానికి 1000 మైళ్లకు పైగా ప్రయాణిస్తాయి. రెండు వారాల వ్యవధిలో అనేకసార్లు గూడు కట్టుకుంటాయి. ఒక్కో గూటిలో సుమారు 125 గుడ్లు పెడతాయి. కెంప్స్, రిడ్లీ తప్ప చాలా తాబేళ్లు రాత్రి వేళల్లో గూడు కట్టుకుంటాయి. లేదర్‌బ్యాక్ సముద్ర తాబేళ్లు నీటిలో దాదాపు 4000 అడుగుల లోతు వరకు డైవ్ చేయగలవు. గూడులోని ఉష్ణోగ్రత సముద్ర తాబేలు లింగాన్ని నిర్ణయిస్తుంది. మగ పిల్లలు చల్లని ఉష్ణోగ్రతలలో జన్మిస్తాయి. ఉష్ణోగ్రతలు వేడిగా ఉన్నప్పడు అది ఆడపిల్లను ఉత్పత్తి చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తూర్పు తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆ వలలతో ప్రమాదం
గతంలో ఎన్నడూలేని విధంగా ఇటీవల కాలంలో పెద్ద మొత్తంలో సముద్రపు తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ మధ్య కాలంలో మత్యకారులు వాడుతున్న నానాజాతి వల, అటుకో వలలు కూడా వీటికి హాని చేస్తున్నట్టు చెబుతున్నారు. తాబేళ్లు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి నీటిమీదకు వచ్చి గాలి పీల్చుకొని మళ్లీ నీటిలోకి వెళతాయట. ఈ వలలు సుమారుగా మూడు గంటల పాటు నీటిపై ఉంచుతారట. దీంతో వాటికి గాలి అందక మృతి చెందుతున్నట్లు తెలుపుతున్నారు. అలాగే మెకెనైజ్డ్ పడవలు తీరం నుంచి 8 కిలోమీటర్ల తరువాత మాత్రమే వేట చేయాలనేది నిబంధన. కానీ దీన్ని అతిక్రమించి.. వేట సాగించడంతో తాబేళ్లు మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తోంది. వలల వినియోగంపై మత్స్యకారుల్లో అవగాహన కల్పిస్తే తాబేళ్లను కాపాడిన వారమవుతామని పర్యావరణ ప్రేమికులు అధికారులను కోరుతున్నారు.