Waiting for the bills బిల్లుల కోసం ఎదురుచూపు
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:21 PM
Waiting for the bills జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమల వుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి గత ఐదు నెలలుగా బిల్లులు అందడం లేదు. గౌరవ వేతనం కూడా మంజూరు కాకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి కాలం నెట్టుకొస్తున్నారు.
ఇబ్బందులో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు
జియ్యమ్మవలస, నవంబరు2(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమల వుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి గత ఐదు నెలలుగా బిల్లులు అందడం లేదు. గౌరవ వేతనం కూడా మంజూరు కాకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి కాలం నెట్టుకొస్తున్నారు. వాస్తవంగా ఈ పథకం 2025 జనవరి 4న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. జిల్లాలో గరుగుబిల్లి మినహా అన్ని మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 3,288 మంది బాలురు, 2,202 మంది బాలికలు ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.8.57 చొప్పున ప్రభుత్వం వెచ్చిస్తోంది. దీంతో విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని నిర్వాహకులు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 48 మంది కుక్ కం హెల్పర్స్ (సీసీహెచ్) వండి వడ్డిస్తున్నారు. అయితే పథకం ప్రారంభం నాటి నుంచి ఏప్రిల్ వరకు నిర్వాహకుల ఖాతాల్లో ప్రతినెలా బిల్లులు జమయ్యేవి. కానీ కళాశాలలు పునఃప్రారంభం నాటి నుంచి అంటే జూన్ నుంచి అక్టోబరు వరకు బిల్లులు అందడం లేదు. దీంతో నిర్వాహకులు నానా అవస్థలు పడు తున్నారు. దుకాణదారుల నుంచి అప్పు రూపంలో అవసరమైన సరుకులు తీసుకుని వంటలు చేస్తున్నారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రిన్సిపాళ్లు పర్యవేక్షిస్తుండగా.. బిల్లులు విడుదల మాత్రం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు అప్పగించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ చొరవ చూపాలని వంట నిర్వాహకులు కోరుతున్నారు. దీనిపై డీఐఈవో వై.నాగేశ్వరరావును వివరణ కోరగా.. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఏ నెలకు ఆ నెల బిల్లు ప్రపోజల్స్ పాఠశాల విద్యాశాఖ అధికారికి పంపిస్తున్నాం. నిధులు విడుదల కోసం ఎదురు చూస్తున్నాం.’ అని తెలిపారు.