Share News

Waiting for six years! ఆరేళ్లుగా ఎదురుచూపు!

ABN , Publish Date - May 23 , 2025 | 12:45 AM

Waiting for six years! అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు చెల్లింపులపై ఆశలు పెట్టుకున్నారు. తాము చెల్లించిన నగదు కోసం గత ఆరేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల మంది అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు, ఏజెంట్లు ఉన్నారు.

Waiting for six years! ఆరేళ్లుగా ఎదురుచూపు!

ఆరేళ్లుగా ఎదురుచూపు!

అగ్రిగోల్డ్‌ ఖాతాదారులకు చెల్లింపులు ఎప్పుడో?

జిల్లాలో 1.50 లక్షల మంది ఖాతాదారులు

ప్రభుత్వంపైనే ఆశలు

రాజాం, మే 22(ఆంధ్రజ్యోతి):

అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు చెల్లింపులపై ఆశలు పెట్టుకున్నారు. తాము చెల్లించిన నగదు కోసం గత ఆరేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల మంది అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు, ఏజెంట్లు ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందే అగ్రిగోల్డ్‌ సంస్థ బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ అగ్రిగోల్డ్‌ బోర్డు తిప్పేయడం వెనుక అప్పటి టీడీపీ ప్రభుత్వం హస్తం ఉందని ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే బాధితులకు చెల్లింపులు చేపడ్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. దీంతో ఖాతాదారులు, ఏజెంట్లు ఆందోళనలు చేశారు. దీనికి స్పందనగా మొక్కుబడి చర్యలకు దిగింది. 2019, 2021లలో రెండు విడతల్లో రూ.10 వేలు, రూ.20 వేలలోపు బాండ్లు ఉన్న వారికి చెల్లింపులు చేశారు. ఈ విధంగా 1,20,225 మందికి రూ.102.83 కోట్లు అందించినట్టు అధికారులు చెబుతున్నారు. వడ్డీ కాకుండా అసలు చెల్లించారు. వీరిలోనూ చాలామందికి నగదు అందలేదు. దీంతో అప్పట్లో మళ్లీ ఆందోళనలు కొనసాగాయి. రూ.20 వేలకు మించి రూ.లక్షలోపు డిపాజిట్‌ చేసిన వారికి రూ.10 వేలు అందించినట్టు అధికారులు చెబుతున్నారు. రెండుకు మించి బాండ్లు ఉన్నవారిని అసలు పరిగణనలోకి తీసుకోలేదు. డిపాజిట్లు కట్టి మోసపోయిన పదుల సంఖ్యలో బాధితులు చనిపోయారు. కొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మన్యం జిల్లాతో పోల్చుకుంటే రూ.20 వేల నుంచి రూ.లక్ష కట్టిన డిపాజిటుదార్లు విజయనగరం జిల్లాలో చాలా ఎక్కువ. సీఐడీ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్‌ భూములను విక్రయించి అందిస్తామని జగన్‌ ప్రకటించారు కానీ అది ప్రకటనగానే మిగిలిపోయింది.

వీధినపడ్డాం

కుటుంబ అవసరాల కోసం అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేశాను. కానీ మా ఆశలను సంస్థ చిదిమేసింది. ఉన్నఫలంగా బోర్డు తిప్పేసింది. అధికారంలోకి వస్తే డిపాజిట్టు చెల్లిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. కానీ నిలబెట్టుకోలేకపోయారు. నా కుటుంబం వీధిన పడింది.

- ఆర్పిపల్లి సింహాచలం, అగ్రిగోల్డ్‌ బాధితుడు, రాజాం

హామీ అమలు కాలేదు

పిల్లల భవిష్యత్‌ కోసమని కష్టమంతా అగ్రిగోల్డ్‌లో పెట్టాం. కానీ ఆ సంస్థ మూతపడింది. ఆదుకుంటామని చెప్పిన నాటి సీఎం జగన్‌ హామీలకే పరిమితమయ్యారు. రూ.20 వేలలోపు చెల్లింపులు చేసినా మాకు పైసా దక్కలేదు. అసలు చెల్లిస్తారా? లేదా? అన్న సందేహంలో ఉన్నాం. అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారం బయటకు రావడంతో ఆశలు చిగురిస్తున్నాయి.

- చోడిశెట్టి శ్రీనివాసరావు, అగ్రిగోల్డ్‌ బాధితుడు, రాజాం

--------------

Updated Date - May 23 , 2025 | 12:45 AM