'Nela Nela Vennela ‘నెలనెలా వెన్నెల’ కోసం ఎదురుచూపు
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:33 AM
Waiting for 'Nela Nela Vennela గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ‘నెలనెలా వెన్నెల’కు బ్రేక్ పడింది. దీనిని అమలు చేయడంలో పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో గిరిజన విద్యార్థుల్లో నైరాశ్యం నెలకొంది.

గిరిజన విద్యార్థుల ఉన్నతికి దోహదం
వైసీపీ హయాంలో కార్యక్రమానికి బ్రేక్
కూటమి ప్రభుత్వం పైనే ఆశలు
సీతంపేట రూరల్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ‘నెలనెలా వెన్నెల’కు బ్రేక్ పడింది. దీనిని అమలు చేయడంలో పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో గిరిజన విద్యార్థుల్లో నైరాశ్యం నెలకొంది. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వం 2016లో ఐటీడీఏల వేదికగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లో మంచి స్పందన కూడా లభించింది. గిరిజన విద్యార్థుల ఉన్నత భవిష్యత్ కోసం రూపొందించిన ఈ కార్యక్రమం 2019 వరకు దిగ్విజయంగా కొనసాగింది. అనంతరం ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం గిరిజన విద్యాభివృద్థిని గాలికొదేలేసింది. దీనిపై అప్పట్లో విద్యార్థులు తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు మండిపడ్డాయి. అయినా వైసీపీ సర్కారు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంపైనే గిరిపుత్రులు ఆశలు పెట్టుకున్నారు.
ఇదీ పరిస్థితి...
సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 47 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు ఉన్నాయి. వాటిల్లో 13 వేలకు పైబడి గిరిజన విద్యార్థులు ఉన్నారు. వారికి గతంలో ఒక్క ఆదివారం మాత్రమే చికెన్ పెట్టేవారు. అయితే నెలనెలా వెన్నెల కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి మూడేళ్ల పాటు వారానికి రెండు రోజులు పాటు చికెన్ అందించేవారు. ప్రతి పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ముగ్గురు విద్యార్థులను ఓ క్లస్టర్‌గా ఎంపిక చేసేవారు. వారిని ఐటీడీఏ పీవో నివాస గృహంలో పీవోతో ఇష్టాగోష్ఠి, విందు కార్యక్రమంలో పాల్గొనేలా చూసేవారు. విద్యార్థులతో అనేక అంశాలపై చర్చించి, ఎన్నో సందేహాలను నివృత్తి చేసి.. భవి ష్యత్తులో ఉన్నతంగా స్థిరపడేందుకు అవసరమైన సలహాలు, సూచనలను అధికారులు అందించే వారు. టెన్త్ చదువుతున్న గిరిజన విద్యార్థులు 80మంది వరకు ఎంపిక చేసి విజ్ఞాన, విహార యాత్రలకు తీసుకెళ్లేవారు. కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తుండే వారు. తొమ్మిదో తరగతి చదువుతన్న గిరిజన విద్యార్థులను విశాఖపట్నం వంటి పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లేవారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఏపీ దర్మన్ పేరుతో రైళ్లలో తీసుకెళ్లి.. రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రధాన నగరాలను చూపించే వారు. అదే విధంగా టెన్త్‌లో మెరుగైన మార్కులు సాధించిన గిరిజన విద్యార్థులను భారత్ దర్మన్ కార్యక్రమం ద్వారా విమానంలో తీసుకువెళ్లి ఢిల్లీ నగరాన్ని చూపించేవారు. అక్కడ పనిచేస్తున్న ఉన్నతాధికారులతో గిరిజన విద్యార్థులకు ఇంట్రాక్షన్ ఏర్పాటు చేసే వారు. అంతేకాకుండా వారితో కలిసి విద్యార్థులు విందు భోజనం చేసేవారు. యోచన ద్వారా విలువలతో కూడిన ప్రసంగాల ద్వారా పిల్లల్లో ఆత్మస్థైర్యం, నైపుణ్యం పెంపొందించేవారు.
విజ్ఞానాన్ని పెంపొదిస్తూ..
ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించేందుకు గిరి ఒలింపిక్స్, గణితం, సైన్స్ ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తుండే వారు. ఇందు కోసం చిత్ర లేఖనం, క్రీడాపోటీలు, సైన్స్‌ఫెయిర్ వంటి కార్యక్రమాలను నిర్వహించే వారు. వాటిల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు అందజేసేవారు. తొమ్మిదో తరగతిలో ఉత్తర్ణులై టెన్త్‌కు చేరుకునే విద్యార్థులకు రిస్ట్‌వాచ్‌లను పంపిణీ చేసేవారు. పరీక్షా కాలంలో వారు టైం ప్రకారం నడుచుకునేలా వాటిని అందించేవారు.
పాఠశాలల్లోనే పండగలు
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే గిరిజన పండగలను నిర్వహించే వారు. దీంతో గిరిజనులు విద్యార్థులు ఇంటిబాట పట్టేవారు కాదు. ప్రతి శనివారం సందేశాత్మక తెలుగు సినిమా ప్రదర్శించే వారు. నెలలో మొదటి ఆదివారం హ్యాపీ సండే, రెండో శనివారం 2కే రన్ వంటివి నిర్వహించేవారు.
ప్రత్యేకంగా ఓ క్యాలెండర్
నెలనెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా గిరిజన పాఠశాలల్లో ఏయే కార్యక్రమాలు అమలు చేయాలనే దానిపై ప్రత్యేకంగా ఓ క్యాలెండర్‌ను అప్పట్లో రూపొందించారు. దాని ఆధారంగా పాఠశాల, క్లస్టర్ స్థాయిలో వివిధ క్రీడా పోటీలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే వారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఐటీడీఏ కేంద్రంగా బహుమతులు అందజేసేవారు. అదే విధంగా భవిత కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులను అభినందించే వారు. విద్యార్థుల భవిష్యత్తు విద్యా ప్రణాళికపై మెగా అవగాహన సదస్సు నిర్వహించేవారు. ఇలా నెలనెలా వెన్నెల కార్యక్రమం ద్వారా గిరిజన విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు మార్గనిర్దేశం చేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని గిరిజనులు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
డీడీ ఏమన్నారంటే..
అప్పట్లో నిర్వహించిన ‘నెలనెలా వెన్నెల’ పై తనకేమీ తెలియదని గిరిజనసంక్షేమ శాఖ డీడీ అన్నదొర తెలిపారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం అమలుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి గైడ్‌లైన్స్ రాలేదని చెప్పారు.