హౌసింగ్ బిల్లులకు ఎదురుచూపు
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:34 AM
: బిల్లుల కోసం ఎన్టీఆర్ గృహ లబ్ధిదారులకు ఎదురుచూపు తప్పడం లేదు. మొత్తం రూ.15.32కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి.
- టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణం
- 5,186 గృహాలకు రూ.15.32కోట్ల బిల్లులు పెండింగ్
- చెల్లించని గత వైసీపీ సర్కారు
- కూటమి ప్రభుత్వంపైనే లబ్ధిదారుల ఆశలు
గృహ నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం చేసింది. జగనన్న కాలనీల పేరిట నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో లేఅవుట్లు ఏర్పాటు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద కట్టిన ఇళ్లకు బిల్లులు చెల్లించలేదు. రాజకీయ కక్షతోనే ఈ పని చేసింది. అందుకే ఎన్టీఆర్ గృహనిర్మాణానికి సంబంధించి పెండింగ్ బిల్లులు పూర్తిగా చెల్లిస్తాం.
- గత ఏడాది ఆగస్టులో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన ఇది.
రాజాం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): బిల్లుల కోసం ఎన్టీఆర్ గృహ లబ్ధిదారులకు ఎదురుచూపు తప్పడం లేదు. మొత్తం రూ.15.32కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. బిల్లులు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి ఏడాది అవుతున్నా ఇంకా అమలుకు నోచుకోకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకాన్ని అమలు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి రూ.2 లక్షలు మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సబ్‌ప్లాన్ నిధులను రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ అదనంగా మంజూరు చేసింది. 2014 నుంచి 2017 వరకూ మంజూరైన ఇళ్లకు బిల్లుల చెల్లింపులు సక్రమంగానే జరిగాయి. ఆ తరువాత బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగింది. ఇంతలో ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రావడంతో చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ పెండింగ్ బిల్లులు చెల్లించలేదు. అప్పటి నుంచి లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి 5,186 మంది లబ్ధిదారులకు రూ.15.32 కోట్లు చెల్లించాల్సి ఉందని జిల్లా అధికారులు నివేదికలు పంపారు. కానీ, ఏడాది అవుతున్నా వాటికి మోక్షం లేదు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక నాయకులు చాలాచోట్ల కలెక్షన్ల పర్వానికి దిగారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లకు బిల్లులు మంజూరు చేయిస్తామని చాలా గ్రామాల్లో భారీగా వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే జగన్ సర్కారు నుంచి ఉలుకూపలుకూ లేకపోవడంతో లబ్ధిదారులు నిలువునా మోసపోయారు. అటు బిల్లులు రాక.. ఇటు నేతలకు కొంత వరకూ సమర్పించుకొని రెండింటికీ చెడ్డ రేవడిగా మారిపోయారు. జిల్లాలో రాజాం నియోజకవర్గంలో అధికంగా రూ.4.2కోట్ల బిల్లులు పెండింగ్ ఉండగా, అత్యల్పంగా విజయనగరం నియోజకవర్గంలో రూ.68 లక్షలు చెల్లించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వంపైనే లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు.
బిల్లులు చెల్లించాలి..
ఇంటి బిల్లు కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నా. గత టీడీపీ ప్రభుత్వం సగం బిల్లు చెల్లించింది. వైసీపీ ప్రభుత్వం దాని గురించి అసలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా బిల్లులకు మోక్షం కలగలేదు. తక్షణం చెల్లింపులు చేయాలి.
-జి.ధనంజయ, ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్ధిదారు, రాజాం
అప్పుచేసి ఇల్లు కట్టాం..
పేరుకే గృహనిర్మాణ లబ్ధిదారులం. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. కానీ, బిల్లులు మాత్రం చెల్లించలేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో వినతిపత్రాలు అందించామే తప్ప బిల్లులు మాత్రం మంజూరు కాలేదు. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారులు వివరాలు తెలుసుకోవడంతో బిల్లులు మంజూరుచేస్తారని ఆశించాం. కానీ ఇంతవరకూ చెల్లించలేదు.
- చింత సత్యనారాయణ, ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్ధిదారు, రాజాం
ప్రభుత్వానికి నివేదించాం
కొద్ది నెలల కిందట జిల్లాలో సర్వే చేశాం. ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపాం. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో 5,186 ఇళ్లకుగాను రూ.15.52 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం వద్ద కూడా సమగ్ర సమాచారం ఉంది. నిధులు విడుదల చేసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.
-శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ, విజయనగరం