waiting for fishermens మీ రాకకై.. నిలువెళ్ల కనులై..
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:38 AM
waiting for fishermens అనుకోకుండా జరిగిన పొరపాటుకు పాపం ఆ మత్స్యకారులు పరదేశంలో కష్టాలు పడుతున్నారు. సముద్రంలో వేటాడుతుండగా వాతావరణం సహకరించక.. సిగ్నల్స్ అందక తమకు తెలియకుండానే బంగ్లాదేశ్ వైపుగా వెళ్లిపోయారు. అక్కడి కోస్టుగార్డుకు చిక్కి 20 రోజులుగా కుటుంబ సభ్యులకు దూరంగా బంధీలుగా ఉండిపోయారు. భారతదేశం నుంచి ఎంతవేగంగా పిలుపు వస్తుందానని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.
మీ రాకకై.. నిలువెళ్ల కనులై..
బంగ్లాదేశ్‌లో బందీలుగా ఉన్న మత్స్యకారుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబీకులు
ఏం కష్టాలు పడుతున్నారోనని ఆందోళన
ప్రారంభంలో హడావిడి చేసిన నేతలు, అధికారులు
సీఎం చంద్రబాబును కలిసేందుకు సిద్ధమవుతున్న వైనం
అనుకోకుండా జరిగిన పొరపాటుకు పాపం ఆ మత్స్యకారులు పరదేశంలో కష్టాలు పడుతున్నారు. సముద్రంలో వేటాడుతుండగా వాతావరణం సహకరించక.. సిగ్నల్స్ అందక తమకు తెలియకుండానే బంగ్లాదేశ్ వైపుగా వెళ్లిపోయారు. అక్కడి కోస్టుగార్డుకు చిక్కి 20 రోజులుగా కుటుంబ సభ్యులకు దూరంగా బంధీలుగా ఉండిపోయారు. భారతదేశం నుంచి ఎంతవేగంగా పిలుపు వస్తుందానని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. మనసులో మాట అక్కడి అధికారులకు చెబుదామన్నా వినేవారులేక.. భాష తెలియక అయోమయంలో ఉన్నారు. వారు ఏం పెడితే అది తింటూ కారాగారవాసం చేస్తున్నారు. ఘటన జరిగినప్పుడు హడావిడి చేసిన అధికారులు, నేతలు మేమున్నామన్నారు. తొందరంగా స్వగ్రామాలకు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ఎందుకు ఆలస్యం అవుతోందో తెలియక మత్స్యకారుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు.
భోగాపురం, నవంబరు13(ఆంధ్రజ్యోతి):
భోగాపురం మండలం కొండ్రాజుపాలెం, పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు ఇంకా బంగ్లాదేశ్ కోస్టుగార్డు అదుపులోనే ఉన్నారు. వీరంతా విశాఖలోని జాలరిపేటలో ఉంటూ వేటకు వెళ్తుండేవారు. అయితే గత నెల 22న జరిగిన ఘటన తర్వాత వరుసగా నాలుగు రోజుల పాటు అధికారులు, నేతలు వచ్చి మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. వారిని స్వదేశానికి క్షేమంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుటోందని కలెక్టర్ ప్రకటించారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోందని, ఢాకాలోని భారత హైకమిషనర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయబృందం వారిని రక్షించేందుకు అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తోందని వివరించారు. ఆ తర్వాత ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు తదితరులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడారు. బంగ్లాదేశ్‌నుంచి వారిని రప్పించేందుకు హైకమిషన్‌తో చర్చలు కూడా జరిపారు. దీంతో తమవారు త్వరలోనే ఇంటికి చేరుకొంటారని ఆశతో ఎదురుచూశారు. అయితే ఇంటినుంచి వేటకు బయలుదేరి సుమారు 30 రోజులు కావస్తున్నా తమవారు రాకపోవడంతో ఆయా కుటుంబాలు దిగులుతో ఉన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మారుపల్లి చిన్నప్పన్న, రమేష్ కుమారులు బంగ్లాదేశ్ అదుపులో ఉండడంతో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండుల్రు నిరాశతో ఉన్నారు. గర్భిణి సూరాడ అనిత భర్త అప్పలకొండ కోసం ఎదురు చూస్తోంది. మత్స్యకారులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియలో ఆలస్యంగా జరుగుతుండడంతో ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడ్ని కలిసి తమ సమస్యను విన్నవించుకుందామని వారి కుటుంబీకులు సన్నద్ధం అవుతున్నారని మత్స్యకార నాయకుడు సూరాడ చిన్నారావు తెలిపారు. మత్స్యకారుల పరిస్థితిపై జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయకృష్ణను వివరణ కోరగా బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన 9 మంది మత్స్యకారులను తీసుకొచ్చేందుకు మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ కేంద్ర హోం వ్యవహారాల శాఖ, విదేశాంగ మత్రిత్వశాఖ కార్యదర్శులకు లెటర్లు రాశారని, ఇంకా అటునుంచి ఎటువంటి సమాచారం అందలేదని, వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
-----------