పౌర సేవలకు నిరీక్షణ!
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:21 AM
పార్వతీపురం మునిసిపాలిటీలో సిటిజన్ చార్టర్ సక్రమంగా అమలు కావడం లేదు.
- సక్రమంగా అమలుకాని సిటిజన్ చార్టర్
- కాగితాలకే పరిమితమైన సేవలు
- రోజుల తరబడి పరిష్కారంకాని దరఖాస్తులు
- శ్రద్ధచూపని, అధికారులు, పాలకవర్గ సభ్యులు
పార్వతీపురంటౌన్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మునిసిపాలిటీలో సిటిజన్ చార్టర్ సక్రమంగా అమలు కావడం లేదు. కేవలం కాగితాలకే సిటిజన్ చార్టర్ పరిమితమైందనే విమర్శలు ఉన్నాయి. కనీస సేవలు అందక పుర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మునిసిపాలిటీలోని 30 వార్డుల ప్రజలకు ఒకేచోట.. సత్వరం, సులభతరంగా పౌర సేవలు అందేలా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేశారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం ఈ సేవలను పూర్తిగా గాలికొదిలేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి నెలకొందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాగునీరు, ప్రజారోగ్యం, ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాలకు సంబంధించిన సేవలు సక్రమంగా అందడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పురసేవలు రోజురోజుకూ అధ్వానంగా ఉన్నాయని ప్రజాసంఘాలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా సిటిజన్ చార్టర్ సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేయాలని కోరుతున్నారు.
ఇంజనీరింగ్ విభాగం..
మునిసిపాలిటీలో తాగునీటి సరఫరాకు ఆయువుపట్టువంటిది ఇంజనీరింగ్ విభాగం. అయితే, ఈ విభాగంపై పలు ఆరోపణలు ఉన్నాయి. కుళాయి కనెక్షన్ కోసం ప్రజలు సిటిజన్ చార్టర్ ప్రకారం దరఖాస్తు చేసుకుంటే మంజూరు కావడం లేదు. సంబంఽధిత అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే డబ్బులు చెల్లించిన వారికి క్షణాల్లో కుళాయిలను ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాగునీటి పైపులైన్, కుళాయిల లీకులకు సంబంధించి ఫిర్యాదులు వచ్చిన వెంటనే మరమ్మతులు చేయాల్సిన ఉంది. కానీ, ఆ సమస్య పరిష్కారానికి వారం రోజులకు పైనే అవుతుందని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. అధికారులు మాత్రం సిటిజన్ చార్టర్ సక్రమంగా అమలు చేస్తున్నామని చెబుతున్నారు.
రెవెన్యూ విభాగం..
మునిసిపల్ విభాగాల్లో మరో కీలకమైనది రెవెన్యూశాఖ. ఇక్కడ కూడా పౌర సేవల్లో జాప్యం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఇంటి పన్ను విధింపుతో పాటు డోర్ నంబరు కేటాయింపునకు సంబంధించి సచివాలయ వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ వారం రోజులకు పైగా జాప్యం జరుగుతుందని నివాసితులే చెబుతున్నారు. ఇంటి పన్ను మార్పులు, చేర్పులు, ఇళ్ల క్రయ విక్రయాలకు సంబంధించి ఆయా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరిష్కారం కావడం లేదు. ఈ దరఖాస్తులు రెవెన్యూ అధికారుల టేబుల వద్ద పేరుకుపోతున్నాయి. ఎన్‌వోసీ రాకపోవడంతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇళ్ల అసిసెమెంట్ ధ్రువపత్రాలను వారం రోజుల్లో మంజూరు చేయాల్సి ఉన్నా, నెలల తరబడి అధికారులు తిప్పిస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇంటి పన్నులకు సంబంధించిన ధ్రువపత్రాలు మంజూరుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై దరఖాస్తుదారులు ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు పి.ఈశ్వరరావు, శంకరరావు ఏసీబీకి చిక్కారు.
ప్రజారోగ్య విభాగం..
ఈ విభాగం సేవలు మరి అధ్వానంగా ఉన్నాయి. 30 వార్డుల్లో పారిశుధ్యం లోపించినా అధికారులు గాని, పాలకవర్గ సభ్యులు గాని పట్టించుకోవడం లేదు. పారిశుధ్యం నిర్వహణ దారుణంగా ఉంది. అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఫిర్యాదు వెళ్లిన ఒకట్రెండు రోజుల్లో ఆ సమస్యను పరిష్కరించాలి. కానీ, ఆ ఫిర్యాదు బుట్టదాఖలు అవుతుండడంతో ప్రజలు అపరిశుభ్రత మధ్య జీవిస్తున్నారు. జనన ధ్రువపత్రం ఐదు రోజుల్లో మంజూరు చేయాల్సి ఉన్నా, వారం రోజులకు పైగా సమయం తీసుకుంటున్నారు. జనన ధ్రువపత్రంలో పేరు సరి చేసేందుకు అవసరమైన నాన్ అవైలబులిటీ సర్టిఫికెట్ కోసం ఏడు రోజుల సమయం తీసుకోవాలి. కానీ, చాలా ఆలస్యం చేస్తున్నారు. దీంతో ఆ ధ్రువపత్రం కోసం దరఖాస్తుదారులు మునిసిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది. వ్యాపారాలకు సంబంధించిన లైసెన్స్‌ల మంజూరు, రెన్యూవల్ వారం రోజుల్లో జరగాలి. ప్రజారోగ్యశాఖ అధికారులతో మంచిగా ఉన్న వ్యాపారుల పని సులువుగా జరిగిపోతుంది. విద్యాసంస్థలకు సంబంధించి శానటరీ రఽధువపత్రం 15 రోజుల్లో మంజూరు చేయాల్సి ఉంది. ఆయా విద్యాసంస్థల యాజమాన్యం తీరును బట్టి ఈ పత్రాలు మంజూరవుతు న్నాయి. భవన నిర్మాణ అనుమతులు, మాస్టర్ ప్లాన్ ప్రకారం స్థలం వినియోగించుకునేందుకు అవసరమైన ధ్రువపత్రాలను 15 రోజుల్లో ఇవ్వాలి. అయితే, వీటిని పొందేందుకు సంబంధిత యజమానులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
పక్కాగా అమలు చేస్తాం
సిటిజన్ చార్టర్‌లో ఉన్న ప్రతి సేవనూ పక్కాగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇంజనీరింగ్, రెవెన్యూ, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక విభాగాలకు వచ్చిన దరఖాస్తులు, వినతులను నిర్దిష్ట సమయంలో పరిష్కరించేలా చర్యలు చేపడతాం. త్వరలోనే అన్ని విభాగాల అధికారులతో చర్చించి, సిటిజన్ చార్టర్ సేవలు ప్రజలకు సకాలంలో అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తాం.
- కె.కిషోర్‌కుమార్, కమిషనర్, పార్వతీపురం మునిసిపాలిటీ