Share News

వేతన యాతన

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:05 AM

గ్రామాల్లో ప్రజలకు ఉపాధి పనులు చూపించే క్షేత్ర సహాయకులు జీతాల కోసం పోరుబాట పట్టారు.

వేతన యాతన
నిరసన వ్యక్తం చేస్తున్న క్షేత్ర సహాయకులు (ఫైల్‌)

విజయనగరం కలెక్టరేట్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజలకు ఉపాధి పనులు చూపించే క్షేత్ర సహాయకులు జీతాల కోసం పోరుబాట పట్టారు. మూడు నెలలుగా వేతనాలు అందక ఆందోళన చెందుతున్నారు. ఫామ్‌పాండ్స్‌ పూర్తి చేయలేదన్న కారణంతో ఉన్నతాధికారులు వారి జీతాలను నిలిపివేశారు. ఆకలిమంటలతో అలమటిస్తున్న వారు తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

భూగర్భ జలాలు పెంపొందించడానికి ఫామ్‌పాండ్‌ తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి పంచాయతీ పరిధిలో 25 ఫామ్‌పాండ్స్‌ తవ్వాలని ఉన్నతాధికారులు లక్ష్యాలు విఽధించారు. జిల్లా వ్యాప్తంగా 776 పంచాయతీల్లో 11,220 ఫామ్‌పాండ్స్‌ తవ్వాలని నిర్దేశించారు. వీటిలో 10,156 ఫామ్‌పాండ్‌లు తవ్వడానికి పనులు మంజూరు చేశారు. ఒక్క ఫామ్‌పాండ్‌ తవ్వడానికి 9 మీటర్ల పొడువు, 9 మీటర్ల వెడల్పు స్థలం ఉండాలి. ఇందులో నాలుగు స్టెప్‌లు ఉంటాయి. ప్రతి ఆరమీటరుకు ఒక స్టెప్‌ చొప్పున తవ్వాలి. తరువాత అవుట్‌ లెట్‌.. ఇన్‌లెట్‌ తవ్వాలి. ఇదిలా ఉండగా జిల్లాలో 5,353 ఫామ్‌పాండ్స్‌ ప్రగతిలో ఉన్నాయి. నాలుగు స్టెప్‌లు తవ్వినవి 2552 ఉన్నాయి. వీటిల్లోనే సిల్డ్‌ట్రాప్‌, ఇన్‌లెట్‌, ఔట్‌ లెట్‌ పూర్తి అయినవి 1924 ఉన్నాయి. మొత్తం 238 పూర్తి అయినట్లు అధికార గణంకాలు వెల్లడిస్తున్నాయి.

జిల్లా వ్యాప్తంగా 25 నుంచి 100 శాతం ఫామ్‌పాండ్స్‌ పూర్తి చేసినవారు 501 మంది ఫీల్డ్‌ ఆసిస్టెంట్లు ఉన్నారు. వీరందరికీ వేతనాలు అందాయి. 25 శాతం మాత్రమే చేసిన వారు 156 మంది, అసలు ఫామ్‌పాండ్స్‌ తవ్వని వారు 119 మంది ఉన్నారు. ఈ రెండు కేటగిరీలకు చెందిన 275 మందికి వేత నాలు నిలిపివేశారు. కాగా పామ్‌పాండ్స్‌ తవ్వడానికి రైతులు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిలో అనుకున్న స్థాయిలో క్షేత్రస్థాయిలో లక్ష్యాలు పూర్తి కావడం లేదు. మరోవైపు ప్రసుత్తం కురుస్తున్న చిరుజల్లుల వల్ల కూడా ఫామ్‌పాండ్స్‌ తవ్వడానికి అనుకూలం కాదని, ఈ కారణంతో లక్ష్యాలు పూర్తి చేయలేకపోతున్నామని క్షేత్ర సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదెక్కడి నిబంధన?

క్షేత్ర సహాయకులను ప్రతి ఏడాది ఏప్రిల్‌ నెలలో సర్వీసు రెన్యూవల్‌ చేయాలి. కమిషనర్‌ మార్గదర్శకాల ప్రకారం ఏడాది కాలంలో ప్రతి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ 7,500 పని దినాలు (మెన్‌ డేస్‌) చేయని వారికి మాత్రమే రెన్యూవల్‌ ఆపాలని నిబంధనలు చెబుతున్నాయి. ఇలా రెన్యూవల్‌ కానివారికి జీతాలు నిలుపుదల చేస్తారు. 7,500 పనిదినాలు పూర్తి చేసిన వారికి జీతాలు ఇవ్వాల్సి ఉంది. కాని ఫామ్‌పాండ్స్‌ పూర్తి చేయని కారణంగా జీతాలు నిలిపేయడం సరికాదని వారంతా వాపోతున్నారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ జీతాలు మంజూరు చేయలేదు. దీనిపై వారు నాలుగు రోజులు క్రితం కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇదే విషయమై డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ శారదాదేవి వద్ద ప్రస్తావించగా ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం మేరకు ప్రతి క్షేత్ర సహాయకుడు 25 ఫామ్‌పాండ్స్‌ తవ్వాలని చెప్పామని, కొందరు కనీస స్థాయిలో తవ్వించలేదని, అయినా అందరికీ విడతల వారీగా వేతనాలు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నామన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:05 AM