Voluntary rule in the management of quarries క్వారీల నిర్వహణలో ఇష్టారాజ్యం
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:58 PM
Voluntary rule in the management of quarries జిల్లాలో క్వారీల నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదు. అనుమతులకు మించి రాతి తవ్వకాలు చేపడుతున్నారు. భారీ యంత్రాలు, అభ్యంతకర స్థాయిలో బాంబులు వాడుతూ కొండలను దోపిడీ చేస్తున్నారు. వీటి నిర్వహణలో లోపాల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న చుట్టుపక్కల గ్రామాల వారు అధికారులకు, నేతలకు ఫిర్యాదులు, విన్నపాలు ఇస్తున్నా పరిగణనలోకి తీసుకోవడం లేదు. తెరవెనుక క్వారీల నిర్వాహకులకు సహకారం అందిస్తున్నట్లు ప్రజల్లో అనుమానాలున్నాయి.
క్వారీల నిర్వహణలో
ఇష్టారాజ్యం
అనుమతికి మించి తవ్వకాలు
నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం
సమీప గ్రామాల ప్రజల్లో వణుకు
ఫిర్యాదులు ఇస్తున్నా పట్టించుకోని అధికారులు
ఏదైనా ఘటన జరిగినప్పుడే హడావుడి
జిల్లాలో క్వారీల నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదు. అనుమతులకు మించి రాతి తవ్వకాలు చేపడుతున్నారు. భారీ యంత్రాలు, అభ్యంతకర స్థాయిలో బాంబులు వాడుతూ కొండలను దోపిడీ చేస్తున్నారు. వీటి నిర్వహణలో లోపాల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న చుట్టుపక్కల గ్రామాల వారు అధికారులకు, నేతలకు ఫిర్యాదులు, విన్నపాలు ఇస్తున్నా పరిగణనలోకి తీసుకోవడం లేదు. తెరవెనుక క్వారీల నిర్వాహకులకు సహకారం అందిస్తున్నట్లు ప్రజల్లో అనుమానాలున్నాయి.
రాజాం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో క్వారీల ఏర్పాటుకు ముందు నిర్వాహకులు చెప్పే మాటలేవీ ఆచరణలో ఉండడం లేదు. భరోసా ఇచ్చిన అధికారులు నిఘా పెట్టడం లేదు. సమీపంలో గ్రామాలు ఉన్నా.. ప్రజలు నివసిస్తున్నా.. ప్రకృతి వనరులు విధ్వంసానికి గురవుతున్నా.. వన్యప్రాణులకు ముప్పువా టిల్లుతున్నా.. చివరకు మనుషుల ప్రాణాలు పోతున్నా పట్టించుకునేవారు కరువవుతున్నారు. నిర్వాహకులకు అనధికారికంగా పేలుడు పదార్థాలు విక్రయిస్తున్న వ్యాపారులపైనా ఎటువంటి చర్యలు లేకుండా పోతున్నాయి.
జిల్లాలో గనుల శాఖ పరిధిలో దాదాపు 200 క్వారీలు ఉన్నాయి. 98 క్రషర్లు కొనసాగుతున్నాయి. ప్రధానంగా జిల్లాలో ఎక్కువగా ఎస్.కోట, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో క్వారీలు అధికం. రాజాం నియోజకవర్గానికి సంబంధించి రేగిడి, వంగరలో క్రషర్లు నడుస్తున్నాయి. వీటిలో చాలాచోట్ల అనధికారిక పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. సాధారణంగా పేలుడు సామగ్రి వినియోగించాలంటే పెట్రోలియం అండ్ పేలుడు పదార్థాల భద్రత సంస్థ (పెసో) అనుమతితో కూడిన లైసెన్స్ ఉండాలి. భద్రతా ప్రమాణాల దృష్ట్యా సాధారణంగా మంజూరు చేయరు. అంత సులువుగా లైసెన్స్ ఇవ్వరు. ప్రస్తుతం జిల్లాలో ఓ రెండు సంస్థలకు మాత్రమే అనుమతులు న్నాయి. అయితే క్వారీలు ఎక్కువగా నడుస్తున్న ప్రాంతాల్లో అనధికారికంగా విక్రయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో వీటి ధర తక్కువగా ఉండడంతో అక్కడ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే నిబంధనలు పట్టకుండా తెస్తున్న పేలుడు పదార్థాలతో భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికులు మూల్యం చెల్లించుకుంటున్నారు.
ప్రమాదాలు జరుగుతున్నా..
గత ఐదు సంవత్సరాల్లో జిల్లాలో వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న క్వారీ ప్రమాదాల్లో చాలా మంది కార్మికులు మృతిచెందారు. మరెందరో క్షతగాత్రులయ్యారు. అయినా సరే యంత్రాంగంలో కనీస చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిలెటెన్ స్టిక్స్ వంటి పేలుడు పదార్థాలు వినియోగించాలంటే క్వారీ నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్, గనులు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అనుమతులు పొందాలి. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారమందించాలి. అటు తరువాత లైసెన్స్‌దారుడు నుంచి మాత్రమే పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలి. నిపుణుల సమక్షంలో వాటిని పేల్చాల్సి ఉంటుంది. అదే సమయంలో క్వారీలో పనిచేస్తున్న కార్మికుల భద్రతను చూడాలి. వారికి లైఫ్ జాకెట్‌తో పాటు రక్షణ సామగ్రి అందించాలి. కానీ జిల్లాలో ఇవి ఎక్కడా కనిపించడం లేదు. ఫలితంగానే క్వారీల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.
పర్యవేక్షణ కరువు..
క్వారీల నిర్వహణ, క్రషర్లపై అధికారుల కనీస పర్యవేక్షణ కరువవుతోంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తరువాత మరిచిపోవడం పరిపాటిగా మారింది. వాస్తవానికి నిర్ణీత సమయంలో విధిగా క్వారీలను తనిఖీలు చేయాలి. గనులు, పోలీస్, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ, భద్రత, అగ్నిమాపక శాఖలు క్వారీలను నిత్యం పర్యవేక్షిస్తుండాలి. తనిఖీలు చేపట్టి నిబంధనాలు ప్రకారం నడుపుతున్నారా? లేదా? అన్నది పరిశీలించాలి. లేకుంటే చర్యలకు ఉపక్రమించాలి. కేసులు నమోదుచేయాలి. కానీ ఏదైనా ఘటన జరిగినప్పుడు ఉరుకులు పరుగులు పెట్టడం.. తరువాత దాని గురించి మరిచిపోవడం జరుగుతోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం క్వారీల నిర్వహణపై దృష్టిసారించాల్సి అవసరం ఉంది.
ప్రత్యేకంగా దృష్టి పెట్టాం
జిల్లాలో క్వారీల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. ముఖ్యంగా పేలుడు పదార్థాల వినియోగానికి అనుతులు తప్పనిసరి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని క్వారీల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఇకపై నిత్య పర్యవేక్షణ, తనిఖీలు ఉంటాయి. ఎక్కడైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్వారీ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తాం.
- హెచ్.ఉపేంద్ర, సీఐ, రాజాం
----------------