Share News

స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:07 AM

స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత ఉంటుందని, మార్గదర్శి నిర్ణయమే ముఖ్యమని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అన్నారు.

స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత
శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న జేసీ

- జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి

పార్వతీపురం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత ఉంటుందని, మార్గదర్శి నిర్ణయమే ముఖ్యమని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పీ-4 బంగారు కుటుంబాల దత్తతపై వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా ప్రణాళికాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జేసీ పాల్గొని మాట్లాడారు. బంగారు కుటుంబాల దత్తతకు మార్గదర్శకులు ముందుకు రావాలని కోరారు. ‘ఇందులో ఎటువంటి ఒత్తిడి లేదు. వారు స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగానే రావచ్చు. అలాంటి వారిని మార్గదర్శిగా ఎంపిక చేస్తాం. మార్గదర్శకులకు సచివాలయ సిబ్బంది అవగాహన కల్పించాలి. మార్గదర్శకుల ఎంపికకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దానిని తప్పకుండా పాటించాలి. వారివల్ల బంగారు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఉద్యోగ బాధ్యతలతో పాటు సామాజిక స్పృహ కూడా ఉండాలి. బంగారు కుటుంబాలకు ఆర్థికంగా లేదా ఇతర సహాయ సహకారాలను అందించి మార్గదర్శి ఆదుకోవచ్చు. ఈ విషయంపై మార్గదర్శికి అవగాహన కల్పించి వారి పేర్లను పీ-4లో నమోదు చేయాలి.’ అని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రణాళికాధికారి ఎస్‌.ఎస్‌.ఆర్‌.కె.పట్నాయక్‌, స్టాటిస్టికల్‌ రాష్ట్ర పరిశీలకుడు లతీఫ్‌, రాష్ట్ర శిక్షకులు శ్రీనివాస్‌, జిల్లా ప్రణాళికా కార్యాలయ సెక్షన్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 12:07 AM