Vizianagaram was shocked విజయనగరం ఉలిక్కిపడింది
ABN , Publish Date - May 19 , 2025 | 12:32 AM
Vizianagaram was shocked విజయనగరం జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఉగ్రవాద ప్రేరేపిత కేసుకు సంబంధించి ఓ యువకుడు అరెస్టు అయినట్లు తెలిసి కలవర పడుతున్నారు. నగరానికి చెందిన సిరాజ్‌ఉర్ రెహమాన్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన సమీద్ సయ్యర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విజయనగరం ఉలిక్కిపడింది
ఉగ్రవాద సానుభూతిపరుడి అరెస్టుతో కలకలం
ఓ ఇంట్లో పేలుడు పదార్థాలు స్వాధీనం
కూపీలాగుతున్న పోలీసులు
ఆందోళనలో నగరవాసులు
విజయనగరం, మే 18 (ఆంధ్రజ్యోతి)
విజయనగరం జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఉగ్రవాద ప్రేరేపిత కేసుకు సంబంధించి ఓ యువకుడు అరెస్టు అయినట్లు తెలిసి కలవర పడుతున్నారు. నగరానికి చెందిన సిరాజ్‌ఉర్ రెహమాన్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన సమీద్ సయ్యర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారించారు. వారిచ్చిన సమాచారంతో ఓ ఇంట్లో తనిఖీ చేయగా ప్రమాదకర పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. పేలుళ్లకు వినియోగించే అమోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. విజయనగరంలో ఉగ్ర మూలాలు వెలుగుచూడడం సర్వత్రా భయం గొల్పుతోంది. పాకిస్తాన్‌తో యుద్ధ వాతావరణం చల్లారక ముందే ఇలా ఉగ్రవాద సానుభూతిపరులు నగరంలో అరెస్టు కావడం కలకలం రేగింది. ఇంకా విజయనగరంలో ఎంతమంది ఉన్నారు? పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారా? ఇవి ఎక్కడి నుంచి తెచ్చారు? ఎందుకోసం తెచ్చారు? అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఆన్‌లైన్‌లో కొనుగోలు
నిందితుడు సిరాజ్‌ఉర్ రెహమాన్ బీటెక్ చదివాడు. భారీ విస్పోటం ఎలా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంటర్నెట్ ద్వారా సమాచారం పొందుతున్నాడు. ఆన్‌లైన్‌లో మూడు దఫాలుగా అమోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ తదితర పేలుడు పదార్థాలను బుక్ చేసి తెచ్చుకుని ఇంట్లో భద్రపరిచినట్లు తెలిసింది. ఇంతమొత్తంలో పేలుడు సామగ్రిని ఎక్కడ.. ఎప్పుడు వాడాలనుకుంటున్నాడో పోలీస్ విచారణలో తేలనుంది. ఈయన తండ్రితో పాటు సోదరుడు పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్టు సమాచారం. ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న తరువాత సిరాజ్ హైదరాబాద్ వెళ్లాడు. కొన్నాళ్లు అక్కడే ఉన్నాడు. ఆ సమయంలోనే ఆన్‌లైన్‌లో ఎక్కువగా పేలుడు పదార్థాలు, ఉగ్రవాదంపై సెర్చ్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. అంతే కాకుండా గతంలో పాకిస్తాన్‌కు అనుకూలంగా తన సామాజిక మాధ్యంలో పోస్టులు పెట్డాడు. దీంతో గత కొద్దిరోజు లుగా సిరాజ్‌పై ఏపీ, తెలంగాణ కౌంటర్ ఇంటిలిజెన్స్.. పోలీస్ విభాగాలు నిఘా పెట్టాయి. వారు ఇచ్చిన సమాచారంతోనే జిల్లాలోని ఉన్నతాధికారులు అప్రమత్తమై పక్కా ఆధారాలతో విజయనగరం పోలీసులు వల వేసి నిందితులను పట్టుకున్నారు. సిరాజ్ ఇచ్చిన సమాచారంతోనే సమీద్ సయ్యర్‌ను సైతం అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ప్రేరేపిత ఉగ్రవాద ఉచ్చులో సిరాజ్ పడినట్టు సమాచారం. ప్రాథమిక స్థాయి నుంచి ఉగ్రవాద భావజాలంతో ఉండేవాడని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఈయనపై ఆరు నెలలుగా ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా పెట్టారు. హైదరాబాద్‌లో గత కొంతకాలంగా గడిపిన సిరాజ్ నడవడిక గురించి పోలీసులు కూపీలాగుతున్నారు. ఈ ఇద్దరే ఉన్నారా? లేకుంటే మరికొందరు వచ్చారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బ్యాచిలర్స్‌కు ఇళ్లను అద్దెకిచ్చేవారిలో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉత్తరాధి రాష్ట్రాల వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వాలంటేనే స్థానికులు భయపడిపోతున్నారు.
పెరుగుతున్న నేర సాంస్కృతి
ఒడిశా, చత్తీస్‌గఢ్‌లకు విజయనగరంతో కనెక్టవిటీ ఉంది. ఇటు విశాఖకు కూతవేటు దూరంలో ఉంది. అటు పర్యాటక ప్రాంతం అరకుకు కూడా దగ్గరగా ఉంది. ఒడిశాతో పాటు చత్తీస్‌గఢ్ వెళ్లాల్సిన వారు విజయనగరం జంక్షన్‌నే ఆశ్రయిస్తుంటారు. ఈ తరుణంలో ఎక్కువ మంది ఉత్తరాధి రాష్ట్రాల వారు నగరానికి వస్తుంటారు. ఉపాధి కోసం వచ్చేవారు అధికం. చిరువ్యాపారులు, ఫుట్ పాత్ వ్యాపారం చేసేవారు కూడా ఉన్నారు. కొంతకాలంగా గంజాయితో పాటు నిషేధిత వస్తువులతో ఉత్తరాధి రాష్ట్రాల వారే పట్టుబడుతున్నారు. నేర నియంత్రణ సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉగ్ర ఛాయలు కనిపించడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పోలీసులకు ఇది ఒక సరికొత్త సవాలే.
విశాఖకు బదులుగా ఇక్కడ?
విశాఖకు కూతవేటు దూరంలో విజయనగరం ఉంది. పాక్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని నగరాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విశాఖ నగరంలో అడుగడుగునా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అణువణువూ జల్లెడ పట్టారు. 1971లో సైతం పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో విశాఖపై జలంతర్గామితో దాడి జరిగింది. అందుకే విశాఖలో ఈసారి తనిఖీలు పెరిగాయి. అందుకే ఉగ్రవాద సానుభూతిపరులు విజయనగరాన్ని ఎంపిక చేసుకున్నారా? అన్న అనుమానం అందరినీ కలుగుతోంది. విశాఖ నగరంలో పోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. వాటిపై దాడికి రెక్కీ చేశారా? అన్న అనుమానాలు తాజాగా కలుగుతున్నాయి.
తీరప్రాంతం...
జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. వాటిని లక్ష్యంగా చేసుకుని ఏమైనా ప్రణాళిక వేశారా? అన్న అనుమానమూ పలువురిలో కలుగుతోంది. జిల్లాలో 29 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో పదుల సంఖ్యలో మత్స్యకార గ్రామాలున్నాయి. అయితే ఒక్క మెరైన్ పోలీస్ స్టేషన్ కూడా లేదు. దీంతో తీర ప్రాంత భద్రత డొల్లగా మారింది. తీరం గుండా ఉగ్రవాదులు జిల్లాలో ప్రవేశిస్తే పరిస్థితి ఎంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎలా పరిచమయ్యారు ?
- సిరాజ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉగ్రవాద కార్యకలాపాల వైపు మొగ్గుచూపే వ్యక్తులను ఇన్‌స్టా గ్రామ్ ద్వారా పరిచయం చేసుకునేవాడు. ఈ విధంగానే హైదారాబాద్‌కు చెందిన సయ్యాద్ సమీర్‌తో కలిసి ఉంటున్నాడు. ఈ విషయాన్ని నిఘా వర్గాలు గ్రహించి ముందస్తు చర్యలు తీసుకోవటంతో భారీ విధ్వంసం తప్పిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరికి ఇతర దేశాల్లోని ‘ఐసిస్’ వంటి ఉగ్రవాద సంస్థలతో ఏమైనా పరిచయాలు ఉన్నాయా అని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
- విజయనగరంలోని అంబటిసత్రం వద్ద నివాసముంటున్న సిరాజ్ తండ్రి, సోదరుడు ఇద్దరు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. సిరాజ్‌పై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం, పేలుళ్ల సామగ్రి కలిగి ఉండడం, ఉగ్రవాద దేశాల సంస్థలతో సంబంధాలు ఉండడం, దేశ రహస్యాలను చేరవేయడం తదితర అంశాలకు సంబంధించిన సెక్షన్‌లపై కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. విజయనగం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
-------------------