గగనతలంలో విజయనగరం
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:37 PM
మరో ఆరు నెలల్లో భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి తొలి విమానం ఎగరనుంది.
- ఆరు నెలల్లో భోగాపురం విమానాశ్రయం రెడీ
- మేలోనే ఎగరనున్న తొలి విమానం
-వచ్చే నెలలో ట్రయల్ రన్
- ఏవియేషన్ ఎడ్యుకేషన్ సంస్థ ఏర్పాటుకు శ్రీకారం
-జీఎంఆర్-మాన్సాస్ మధ్య కుదిరిన ఒప్పందం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మే నెలలో ప్రారంభిస్తాం. వాస్తవానికి జూన్‌లో ప్రారంభించాలనుకున్నాం. కానీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకున్న లక్ష్యానికి ముందే వాటిని పూర్తిచేస్తాం. వచ్చే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తాం. ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయంగా రూపొందించాం. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు.
ఈ నెల 16న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చేసిన ప్రకటన ఇది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో విజయనగరం-విశాఖ సరిహద్దు ప్రాంతాలు ఇంటిగ్రేటెడ్ ఇన్నోవేషన్- ఎడ్యుకేషన్ హబ్‌గా మారనున్నాయి. జిల్లాకు చెందిన గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు సంయుక్తంగా జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. దీంతో పౌర విమానయాన శాఖకు సంబంధించి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
విజయనగరం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మరో ఆరు నెలల్లో భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి తొలి విమానం ఎగరనుంది. అనుకున్న గడువు కంటే నెల రోజుల ముందుగానే విమానాశ్రయ పనులు పూర్తికానున్నాయి. వచ్చే నెలలో ట్రయల్ రన్ కూడా జరగనుంది. మరోవైపు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎయిర్‌పోర్టు నిర్మాణ బాధ్యతలు చూస్తున్న గ్రంథి మల్లికార్జునరావు (జీఎంఆర్), గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు సంయుక్తంగా జీఎంఆర్-మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సంస్థను ప్రారంభించారు. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేశ్ సమక్షంలో ఈ సంస్థ ప్రారంభమైంది. త్వరలో పౌర విమానయాన శాఖకు సంబంధించి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇచ్చే అన్నిరకాల కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. అదే జరిగితే గగనతల రంగంలో విజయనగరం ఖ్యాతి మరింత ఇనుమడింపజేసుకోవడం ఖాయం.
అహర్నిశలు శ్రమిస్తూ..
ప్రస్తుతం భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకూ సుమారు 94 శాతం పనులు పూర్తయ్యాయి. జనవరిలో ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నారు. లక్ష్యానికి ముందే నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ కృతనిశ్చయంతో ఉంది. కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలు సాగించేందుకు వీలుగా అన్ని ప్రైవేటు విమానాయాన సంస్థలతో కేంద్ర పౌర విమానయాన శాఖ చర్చలు జరుపుతోంది. ప్రపంచంలో ప్రముఖ విమానయాన సంస్థలు, అన్ని దేశాలకు కనెక్టివిటీ ఉండేలా చర్యలు చేపడుతోంది. మొన్న విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలో టూరిజం, హోటల్స్ రంగాలకు సంబంధించి చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఏవియేషన్ ఎడ్యుకేషన్ ఏర్పాటుకు జీఎంఆర్-మాన్సాస్ ముందుకొచ్చాయి. మిగిలిన 6 శాతం పనులు వేగంగా జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ప్రస్తుతం 5,050 మంది ఇంజనీర్లు, కార్మికులు, సిబ్బంది పనులు చేస్తున్నారు.
అతి పొడవైన రన్ వే..
దేశంలో ఎక్కడా లేని విధంగా 3.8 కిలోమీటర్ల మేర రన్‌వే నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. రన్‌వే 99 శాతం, టాక్సీ వే 98 శాతం, టెర్మినల్ భవనం 90 శాతం, ఏటీసీ టవర్ 72 శాతం, ఇతర భవనాలు 43 శాతం, ప్రధాన రహదారి పనులు 37 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే అత్యాధునిక ఎయిర్‌పోర్టులుగా ముంబాయి, ఢిల్లీ సమీపంలోని నొయిడాలో ఉన్నాయి. ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సైతం వాటి సరసన చేరనుంది. మత్స్య ఆకారంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఎగిరే విమాన ఆకారం సైతం ఉండనుంది. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయం, కళలు ఉట్టిపడేలా విమానాశ్రయంలో ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారు.
విశాఖ నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని విశాఖ పోర్టు నుంచి మూలపేట పోర్టు వరకూ కనెక్టివిటీ రహదారిని నిర్మించాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించి ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేసేందుకు ఓ సంస్థకు కాంట్రాక్ట్ సైతం ఇచ్చారు. విశాఖ జిల్లా అనకాపల్లి, విజయనగరం జిల్లా మీదుగా వెళ్లే అరకు ప్రధాన రహదారి, విజయనగరం మీదుగా పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్లే అన్ని ప్రధాన రహదారులను సైతం కనెక్టివిటీ చేస్తున్నారు. అటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే జాతీయ రహదారులను సైతం అనుసంధానం చేస్తున్నారు. ఎయిర్ పోర్టు సమీపంలో ప్రపంచ ప్రఖ్యాతి తాజ్ గ్రూప్ హోటల్ ఏర్పాటు కానుంది.
ఎయిర్‌పోర్టుకు దగ్గరగా 500 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వులో పెట్టింది. అక్కడ పర్యాటక, ఇతరత్రా నిర్మాణాలు జరగనున్నాయి. మరోవైపు ఎయిర్‌పోర్టు దృష్ట్యా విశాఖ నుంచి భోగాపురం వరకూ మెట్రో రైలు మార్గం నిర్మితం కానుంది. అన్నింటికీ మించి ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణ బాధ్యతలను జీఎంఆర్ సంస్థ చూస్తోంది. గతంలో ఎన్నో విమానాశ్రయాలను నిర్మించిన ఘనత ఆ సంస్థది. అటు జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు ఇదే జిల్లా వారు కావడంతో అంకిత భావం తోడవుతోంది. భావితరాలు గుర్తుండిపోయేలా ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలన్నది జీఎంఆర్ లక్ష్యం. అందుకే సవాల్‌గా తీసుకొని పనిచేస్తున్నారు. ఏడాదికి 3.5 మిలియన్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించే వీలుగా వచ్చే ఏడాది జూన్‌కు పూర్తిచేయాలని సంకల్పం పెట్టుకున్నారు. దేశీయ విమానాలకు సంబంధించి 1360, అంతర్జాతీయ విమానాలకు సంబంధించి 560, టర్మినల్‌లో 300 ఇన్‌కమింగ్, 700 అవుట్ గోయింగ్ పాసింజర్ల లక్ష్యంతో విమానాశ్రయాన్ని ఏర్పాటుచేస్తున్నారు. మొత్తానికైతే భోగాపురం విమానాశ్రయంతో జిల్లా ఖ్యాతి ప్రపంచ నలుమూలల వ్యాపించనుంది.