Share News

ప్లాస్టిక్‌ రహిత నగరంగా విజయనగరం

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:44 PM

కళలు, క్రీడలు, విద్య, సాహిత్యానికి నిలయంగా ఉన్న విజయనగరాన్ని ప్లాస్టిక్‌ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

ప్లాస్టిక్‌ రహిత నగరంగా విజయనగరం
మాట్లాడుతున్న హోంశాఖ మంత్రి అనిత

- ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి

- తడి, పొడిచెత్తపై అవగాహన పెరగాలి

- హోంశాఖ మంత్రి అనిత

విజయనగరం/ విజయనగరం రూరల్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కళలు, క్రీడలు, విద్య, సాహిత్యానికి నిలయంగా ఉన్న విజయనగరాన్ని ప్లాస్టిక్‌ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర.. స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గంట స్తంభం నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ సంగీత కళాశాల రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి అనిత మాట్లాడారు. ‘ప్లాస్టిక్‌ను వినియోగించి రోగాలను మనమే కొని తెచ్చుకుంటున్నాం. ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి. దీనిపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలి. దశలవారీగా ప్లాస్టిక్‌ని నిర్మూలించే విధంగా కృషి చేయాలి.’ అని సూచించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ.. విజయనగరాన్ని ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ కమిషనర్‌ నల్లనయ్య ఇప్పటికే కృషి చేస్తున్నారని తెలిపారు. దుకాణాల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ని విక్రయించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. తడిచెత్త, పొడిచెత్తపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో కమిషనర్‌తో పాటు, శానిటేషన్‌ విభాగం కృషి ప్రశంసనీయమని కొనియాడారు. చెత్త నుంచి వచ్చిన పలు వ్యర్థాలను రీ సైక్లింగ్‌ చేసి, రోడ్డు నిర్మాణంలో కూడా ఉపయోగించవచ్చునని అన్నారు. జేసీ సేతు మాధవన్‌ మాట్లాడుతూ.. ప్రతి నెల మూడో శనివారం సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ పలు కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 12 మంది పారిశుధ్య కార్మికులను సన్మానించారు. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌ నల్లనయ్య, ఆర్డీవో దాట్ల కీర్తి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గంపా కృష్ణ, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఏఎన్‌ఎంలు, సచివాలయ ఉద్యోగులు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు, పోలీసులు, వివిధ ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 11:44 PM