Visionary Vajpayee దార్శనికుడు వాజపేయి
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:59 PM
Visionary Vajpayee దేశ రాజకీయాల్లో మచ్చలేని మహోన్నత వ్యక్తి, దార్శనికుడు, కవి అటల్‌బిహారీ వాజపేయి అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. అటల్-మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దార్శనికుడు వాజపేయి
ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నేత
రాజకీయాల్లో మచ్చలేని మహావ్యక్తి
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
విజయనగరం దాసన్నపేట,
డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
దేశ రాజకీయాల్లో మచ్చలేని మహోన్నత వ్యక్తి, దార్శనికుడు, కవి అటల్‌బిహారీ వాజపేయి అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. అటల్-మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయాల్లో సుపరిపాలన అందించేలా నాయకులు ఉండాలన్నారు. బెదిరింపులు, ఆక్రమణలు, వసూళ్లకు పాల్పడడం వంటివి చేయకూడదని, వాజపేయి మచ్చలేని వ్యక్తిగా రాజకీయాలు చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని, ఆయన ఆశయాలను నేటి రాజకీయ నాయకులు ఆచరించాలన్నారు. రాష్ట్రీయ స్వయంసంఘ్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగా ఎంపీగా, ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా, బీజేపీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులుగా పదవులు అధిరోహించానని, ఇవన్నీ నాకు తల్లి లాంటి పార్టీ వల్లే లభించాయని అన్నారు. విజయనగరం మంచి జిల్లా అని, రాజకీ యాల్లో మచ్చలేకుండా బయటకు వచ్చిన వ్యక్తుల్లో పూసపాటి అశోక్‌గజపతిరాజు ఒకరని చెప్పారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం వాజపేయి బాటలో సుపరిపాలన అందిస్తోందన్నారు. నాడు వాజ్‌పేయి గ్రామీణ సడక్ యోజన, జాతీయ రహదారుల నిర్మాణంతో దేశంలోని అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేశారన్నారు. విమర్శలను సైతం సంతోషంగా స్వీకరించే వ్యక్తి వాజపేయి అని అన్నారు. ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంతో ఉండాలని, విమర్శలకు తావివ్వకూడదని, సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పారు. బూతులు మాట్లాడే ప్రజాప్రతినిధులకు ప్రజలు బూత్‌లోనే సమాధానం చెప్పారని చమత్కరించారు. మరక అంటకుండా రాజకీయాల్లో ఉండి రెండు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా ఉంటూ ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగానన్నారు. అడ్డదారులు తొక్కకుండా నిజాయితీగా ముందుకు వెళ్లాలన్నదే వాజపేయి సిద్ధాంతమని, ఆయన విధానాన్నే తాను పాటించానని చెప్పారు. తాను పదవీ విరమణ చేశాను తప్ప, ‘పెదవి’ విరమణ చేయలేదని చమత్కరించారు. పరిపాలనలో 32 పార్టీలను ఏకం చేసిన మహోన్నత వ్యక్తి అటల్ బిహారీ వాజ్‌పేయి అన్నారు. వాజపేయి రాష్ట్రానికి వచ్చే సమయాల్లో తాను జెట్కా బండి ఎక్కి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశానని, గోడలు మీద రాయడం, మైకులో మాట్లాడటం ద్వారా ఆయన సహాయకుడిగా పనిచేశానన్నారు.
- రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్‌డీఏ ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, అటల్ బిహారీ వాజపేయి తీసుకొచ్చిన సంస్కరణనలనే నేడు ఎన్‌డీఏ, కూటమి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు.
- వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన వ్యక్తి అటల్‌బిహారీ వాజపేయి అని, అవినీతికి తావులేకుండా భారతదేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లిన వ్యక్తి వాజ్‌పేయి అని అన్నారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, వాజపేయి మహోన్నతమైన వ్యక్తి అని, రాజకీయాల్లో తనదైన శైలిలో వ్యవహరించి భారతీయ జనసంఘ్ నుంచి బీజేపీని విస్తరించిన మహోన్నత వ్యక్తి వాజ్‌పేయిఅని అన్నారు. ఆయన విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు సహాయ సహకారాలు అందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి ముందు నగరంలోని వై.జంక్షన్‌లో ఏర్పాటు చేసిన వాజపేయి విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకటరావు, కోండ్రు మురళీ, అదితి గజపతిరాజు, బేబీనాయన, నడుకుదిటి ఈశ్వరరావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్‌వర్మ, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావనీ, మరోనేత రమేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.