Yoga Festivities ఊరూవాడా.. యోగా సందడి
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:51 PM
Village Abuzz with Yoga Festivities జిల్లా వ్యాప్తంగా శనివారం యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాలయాలు ఈ వేడుకలకు వేదికలయ్యాయి. సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలతో పాటు 15 మండలాల్లోనూ యోగా డే నిర్వహించారు.
పార్వతీపురంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహణ
యోగాంధ్రలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు
భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అధికారులు
పార్వతీపురం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శనివారం యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాలయాలు ఈ వేడుకలకు వేదికలయ్యాయి. సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలతో పాటు 15 మండలాల్లోనూ యోగా డే నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఆసనాలు వేశారు. అనంతరం యోగా గురువులు , ఉన్నతాధికారులు ఆసనాల ప్రాముఖ్యతను వివరించారు. మొత్తమ్మీద ఊరూవాడా అంతటా యోగా సందడి కనిపించింది.
జీవన విధానంలో యోగా ఒక భాగం : కలెక్టర్
ప్రతిఒక్కరి జీవన విధానంలో యోగా ఒక భాగం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆసనాలను అలవాటు చేసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం పొందచ్చన్నారు. శనివారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా యోగాంధ్ర నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు, ఉపాధ్యా యులు, విద్యార్థులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని పలు ఆసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విశాఖలో ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో మూడు లక్షల మందితో యోగా దినోత్సవం నిర్వహించారన్నారు. ఇదే సమయంలో జిల్లా వ్యాప్తంగా 3,150 ప్రదేశాల్లో ఐదు లక్షల మందితో యోగాడే జరిపామని వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐదు వేల మందితో యోగాంధ్ర నిర్వహించగా.. 15 ఏళ్ల నుంచి 80 ఏళ్ల లోపు వారందరూ ఇందులో భాగస్వాములు కావడం గొప్ప విషయమన్నారు. జిల్లా వ్యాప్తంగా యోగా నిర్వహణ కోసం 3,160 మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీల్లో జిల్లాకు 10 పతకాలు వచ్చాయని, మన్యం ద్వితీయ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. అనంతరం అధికారులు, యోగా గురువులకు జ్ఞాపికలను అందించి దుశ్శాలువాలతో సత్కరించారు. కళాకారులు, యోగాసనాలు చేసిన వారికి ధ్రువీకరణపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు కె.మోహన్, డీఎంహెచ్‌వో భాస్కరరావు, ప్రోగాం అధికారులు టి.జగన్మోహన్‌రావు, రఘు, ఆయుష్ అధికారి బి.సుశీల, డ్వామా పీడీ కె.రామచం ద్రరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో ‘మన్యం’ నేతలు
పార్వతీపురం/కురుపాం/గుమ్మలక్ష్మీపురం, జూన్21(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినో త్సవం సందర్భంగా విశాఖ వేదికగా ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్రలో మన్యం నేతలు సందడి చేశారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పాల్గొన్న కార్యక్రమంలో తాము భాగస్వాములవడం, గిన్నిస్ రికార్డు సాధించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా గిరిజన విద్యారులు 108 సూర్య నమస్కారాలు చేసి ఒక చరిత్ర సృష్టించారని మంత్రి సంధ్యారాణి తెలిపారు.
ప్రధాని మోదీని కలిసిన విజేతలు
పార్వతీపురం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీల్లో విజేతలుగా నిలిచిన జిల్లావాసులకు విశాఖలో ప్రధాని మోదీని కలిసే అవకాశం దక్కింది. సూర్య క్రాంతి గంటాయత్, అనిల్‌కుమార్‌శర్మ, గుణ ప్రీత్‌సాహు, బి.మోహన్‌కుమార్, ఆకుల ప్రసాద్ తదితరులు ప్రధానమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా యోగాపై పీఎం మాట్లాడినట్లు వారు తెలిపారు. ఏదేమైనా మోదీని కలుసుకోవడం ఎన్నటికీ మరిచిపోలేమని జిల్లా విజేతలు చెప్పారు.