vigetables rates effected వారికి పన్నీరు.. వీరికి కన్నీరు
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:15 AM
vigetables rates effected నాలుగైదు రోజుల వరకూ కిలో టమాటా ధర రూ.30-40 మధ్య ఉండేది. మంగళవారం నాటికి కిలో రూ.60కి చేరింది. వారం క్రితం పచ్చిమిర్చి కిలో రూ.80లోపు ఉండగా.. ఇప్పుడు సెంచరీ దాటింది. పావు కిలో తీసుకుంటే రూ.40 ఇవ్వాల్సిందే. అల్లం కిలో రూ.300 కాగా వెల్లుల్లి మాత్రం కిలో రూ.200 వద్ద స్థిరంగా ఉంది.
వారికి పన్నీరు.. వీరికి కన్నీరు
పెరిగిన ధరలు వ్యాపారులు, దళారులకే
రైతులు, వినియోగదారులకు నష్టమే
జిల్లాలో మార్కెట్ మాయాజాం ఇదీ
- మార్కెట్‌లో కూరగాయలు, ఆకుకూరల ధరలు దడ పుట్టిస్తున్నాయి. కొనేందుకు వెళ్లేవారికి చుక్కలు చూపిస్తున్నాయి. ఈరోజు ఉన్నధర మరుసటి రోజు ఉండడంలేదు. ఫలితంగా సామాన్య, మధ్యతరగతి వర్గాలు బెంబేలెత్తి పోతున్నారు. రూ.500 నోటు పట్టుకెళ్లినా ఐదారు కిలోలు రాని పరిస్థితి.
- కూరగాయల ధరలు బాగా పెరిగాయి సరే. వాటిని పండించే రైతులు లాభపడుతున్నారని అనుకుంటే పొరపాటే. మార్కెట్‌లో కొందరు వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా కావడంతో.. వారు అడిగిన రేటుకే ఇవ్వాల్సిన పరిస్థితి. దీంతో రూ.వేలు పోసి.. ఆరుగాలం కష్టపడిన రైతులు నష్టపోతున్నారు.
- రైతులు నష్టపోకుండా వినియోగదారులకే నేరుగా కూరగయాలు అమ్మేందుకు ప్రభుత్వాలు రైతుబజార్లను అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఇక్కడా వ్యాపారులదే హవా. రైతుల పేరిట తిష్టవేసి మార్కెట్ నుంచి తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ ఎక్కువకు అమ్మేస్తున్నారు.
- మొత్తంగా రైతులు, వినియోగదారులు నష్టపోతున్నారు. మార్కెట్ మాయాజాలంలో కొట్టుకుని పోతున్నారు. మధ్యలో దళారులు, వ్యాపారులు మాత్రమే లాభపడుతున్నారు. కిలో సరుకు 50కి కొనుగులు చేస్తే.. వాటిని రూ.90-100కి విక్రయిస్తున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి.
రాజాం రూరల్, జూలై 29(ఆంధ్రజ్యోతి): ఆషాడంలో కూరగాయల ధరలు కాస్త అటూఇటుగా ఉన్నా శ్రావణం రాకతో పైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న ప్రజలకు కూరగాయల ధరలు ‘మూలిగేనక్కపై తాటిపండు’ అన్న చందంగా మారాయి. ఈ పెరిగిన ధరల ప్రతిఫలం రైతులకు ఏమ్రాతం దక్కడం లేదు. వినియోగదారులకూ దక్కడం లేదు. దళారులు, వ్యాపారులకు మాత్రం పంట పండుతోంది.
కిలో పర్చిమర్చి వంద పైనే..
నాలుగైదు రోజుల వరకూ కిలో టమాటా ధర రూ.30-40 మధ్య ఉండేది. మంగళవారం నాటికి కిలో రూ.60కి చేరింది. వారం క్రితం పచ్చిమిర్చి కిలో రూ.80లోపు ఉండగా.. ఇప్పుడు సెంచరీ దాటింది. పావు కిలో తీసుకుంటే రూ.40 ఇవ్వాల్సిందే. అల్లం కిలో రూ.300 కాగా వెల్లుల్లి మాత్రం కిలో రూ.200 వద్ద స్థిరంగా ఉంది. కిలో ఉల్లిధర చిన్నవి రూ.40 కాగా.. కాస్త పెద్దవి రూ.50 పలుకుతున్నాయి. గతవారం వీటి ధరలు రూ.30 నుంచి రూ.40 ఉండేది. బల్లచిక్కుడు కాయలు కిలో రూ.80 కాగా పొడవు చిక్కుళ్లు కిలో రూ.60 పలుకుతోంది. బీరకాయలు కిలో రూ.80 కాగా, బెండ, దొండ కాయలు కిలో రూ.60 నుంచి రూ.70కి చేరాయి. రెండు అరటికాయలు రూ.25 కాగా నాటు అంగాకరకాయలు కిలో రూ.180 పలుకుతోంది. హైబ్రిడ్ అంగాకరకాయలు ధర కిలో రూ.120కిచేరింది. కేబేజీ బుట్ట కిలో రూ.60 కాగా, వంకాయలు, బెండకాయలు కిలో రూ.60 ఆపై అమ్ముడవుతున్నాయి. చిన్న ఆనపనకాయ ధర రూ.30 కాగా పచ్చిమిర్చి, అల్లం ధరలు కూడా అల్లాడిస్తున్నాయి. బీన్స్ కిలో రూ.120, బీట్‌రూట్ రూ.60, క్యారెట్ రూ.60, బంగాళా దుంపలు రూ.40, కాకరకాయలు రూ.50కి చేరాయి. వారం, పదిరోజుల వ్యవధిలోనే ధరలు అమాంతంగా పెరిగాయి. కూరగాయలు కొనేందుకు కొంతమంది వెనుకంజ వేస్తుండగా.. కిలో కొనేందుకు వెళ్లినవారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. పండగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మున్ముందు ధరలు ఇంకా పెరగవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి, టమాటా దిగుమతి తగ్గిందని, ఇటీవల కురిసిన వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనంతో ధరలు భారీగా పెరిగాయని అంటున్నారు.
అల్లాడిస్తున్న ఆకుకూరలు
ఎన్నో పోషక విలువలుండే ఆకుకూరల ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేవు. గతంలో నాలుగు కట్టల తోటకూర, గోంగూర రూ.20కి లభ్యం కాగా.. నేడు వాటి ధర రూ.30కి చేరింది. బచ్చలకూర, పాలకూర ధరలదీ ఇదే పరిస్థితి. గతంలో రూ.5కే దొరికే కొత్తిమీర కట్ట రూ.10 పలుకుతోంది. కరివేపాకు కట్ట సైతం రూ.10 పైనే.
పదిరోజుల్లో భారీగా పెరిగాయి: ఆదిలక్ష్మి, గృహిణి, వస్త్రపురికాలనీ, రాజాం
వారం, పదిరోజుల్లో కూరగాయలు, ఆకుకూరల ధరలు అమాంతంగా పెరిగాయి. తోపుడుబళ్లపై వీధుల్లోకి తెచ్చి అమ్మేవారి వద్ద గతంలో కాస్త తక్కువ ధరకే దొరికేవి. ప్రస్తుతం వారి వద్ద కొనాలన్నా భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతుబజార్‌లో బోర్డుపై కనిపిస్తున్న ధరలకు
ఆకుకూరలు, కూరగాయలు అమ్మడం లేదు. అధిక ధరలు తీసుకుంటున్నారు.
ధరలు రైతులకు దక్కట్లే!
కూరగాయలు, ఆకుకూరలు సాగుచేసే రైతులకు లాభాలు లేకపోయినా దళారులు, చిరు వ్యాపారులు మాత్రం పంట పండుతోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు సరైన మార్కెట్ సదుపాయం లేకపోవడంతో వ్యాపారి అడిగిన ధరకు అమ్మేసి ఇంటిబాట పట్టాల్సి వస్తోంది. రూ.వేలు పోసి సాగుచేసిన పంటను కోసేందుకు తెల్లవారుజాము 2-3 గంటలకే పొలాల్లోకి వెళ్లి.. సూర్యోదయానికి ముందే మార్కెట్‌కు తెస్తున్న రైతుకు మాత్రం ఒక్కోసారి పెట్టుబడులు కూడా రావడం లేదు. రాజాం మార్కెట్‌కు నిత్యం 10 నుంచి 25 కిలోమీటరు పయనించి ఉదయం 5 గంటలకే రైతులు పంట ఉత్పత్తులు తీసుకుని వస్తుంటారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట మండలం గంగాడ, గళావిల్లి, విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఉత్తరావల్లి, సమీప గ్రామాల రైతులతో పాటు తెర్లాం మండలం ఉద్దవోలు, వెలగవలస, పెరుమాళి, రాజాం మండలం గెడ్డవలస, గార్రాజు చీపురుపల్లి, బొమ్మినాయుడు వలస, పెనుబాక, బొద్దాం, సోపేరుతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండలం వెలగాడ, జి.సిగడాం, జాడ, జగన్నాథవలస, దేవరపొదిలాం తదితర గ్రామాల రైతులు పంటను రాజాంకు తీసుకువస్తారు. ఇక్కడి మార్కెట్ కూరగాయలు, ఆకుకూరల అమ్మకానికి అనుకూలంగా ఉంటుంది. దీన్ని ఆసరగా చేసుకుని దళారులు, కొందరు హోల్‌సేల్ వ్యాపారులు ఉదయం 5 నుంచే వేచిచూస్తుంటారు. సిండికేట్‌గా మారి తక్కువధరకే వాటిని కొనుగోలు చేస్తుంటారు. దీంతో పాతిక కిలోల వంకాయలను రూ.500 నుంచి రూ600కే అమ్మాల్సిన పరిస్థితి రైతులకు ఎదురవుతోంది. వాటిని తిరిగి కిలో రూ.40 నుంచి రూ.50 చొప్పున వ్యాపారులు వినియోగదారులకు అమ్మతున్నారు. ధరలు పెరుగుతున్నా రైతాంగానికి ఒరిగేదేమీ కనిపించడం లేదు. కూరగాయల వ్యాపారం లాభసాటిగా ఉండడంతో దళారులు, హోల్‌సేల్ వ్యాపారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో వీరంతా సిండికేట్‌గా మారుతున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో 25 కిలోల వంకాయలకు ఏడెనిమిది వందలు వస్తే, ఇప్పుడు ఐదారు వందలే వస్తున్నాయి. కూరగాయల రైతులకు రాజాం తప్ప దగ్గరలో అమ్ముకునేందుకు మార్కెట్ సదుపాయం లేదు. వ్యాపారులు అడిగిన ధరకు ఇవ్వకపోతే వాటిని ఇంటికి తీసుకువెళ్లాల్సి వస్తుండడంతో రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది.
మరో అవకాశం లేదు: చేపేన రామినాయుడు, రైతు, వెలగవలస, తెర్లాం మండలం
రెండెకరాల భూమిలో వంగ, బీర, చిక్కుళ్లు పండిస్తున్నాను. అప్పుడప్పుడు ఆకుకూరల సాగు కూడా చేస్తుంటాను. వాటిని అమ్మేందుకు రాజాం వెళ్తాను. రాజాం కన్నా బొబ్బిలి పట్టణం దూరం కావడంతో గత్యంతరం లేక ఈ ప్రాంతీయులంతా రాజాం మార్కెట్‌నే ఆశ్రయిస్తుంటాం. దీంతో దళారులు, హోల్‌సేల్ వ్యాపారులు ఆడిందేఆటగా సాగుతోంది. దీంతో వారు అడిగిన ధరకే అమ్మేసి వెళ్లాల్సి వస్తోంది.
--------------------------