very sad కన్నీటి సంద్రం
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:52 PM
very sad ఆ రెండు గ్రామాలు కన్నీటి సంద్రమయ్యాయి. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అయ్యప్ప భక్తుల మృతదేహాలు సోమవారం ఉదయం స్వగ్రామాలకు చేరాయి.
కన్నీటి సంద్రం
స్వగ్రామాలకు చేరిన అయ్యప్ప భక్తుల మృతదేహాలు
కడసారి చూసేందుకు క్యూకట్టిన ఆత్మీయులు
నివాళులు అర్పించిన మంత్రి శ్రీనివాస్
గజపతినగరం/దత్తిరాజేరు, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఆ రెండు గ్రామాలు కన్నీటి సంద్రమయ్యాయి. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అయ్యప్ప భక్తుల మృతదేహాలు సోమవారం ఉదయం స్వగ్రామాలకు చేరాయి. అప్పటికే చివరిచూపు కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పార్థివ దేహాలను చూసి కన్నీరుపెట్టారు. నిన్న మొన్నటి వరకు తమతో కలిసి తిరిగిన ఆ నలుగురిని అచేతన స్థితిలో చూపి తీవ్రంగా విలపించారు. గజపతినగరం మండలం మరుపల్లికి బండారు చంద్రరావు మృతదేహం చేరే సమయానికి గ్రామమంతా మూగబోయింది. మృతుని ఇంటికి గ్రామస్థులంతా తరలివచ్చారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి దైర్యం చెప్పారు. మృతదేహం వద్ద నివాళి అర్పించారు. ప్రమాదం నుంచి బయటపడిన బెవర శ్రీరాములు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి తదితరులు చంద్రరావు కుటుంబాన్ని పరామర్శించారు.
కన్నీరుపెట్టిన కోరపుకొత్తవలస
కోరపుకొత్తవలస గ్రామానికి మార్పిన అప్పలనాయుడు, వంగర రామకృష్ణ, మరడ రాముల మృతదేహాలు సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్వగ్రామం చేరుకున్నాయి. కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. ప్రమాదం జరిగి మూడు రోజులు కావడంతో బరువెక్కిన గుండెలతో కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. గ్రామమంతా బంధువుల రోదనతో విషాదమయమైంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గ్రామానికి చేరుకొని మృతదేహాల వద్ద నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.