velugu department currepted అక్రమాలు ‘వెలుగు’చూసేనా...!
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:07 AM
velugu department currepted
అక్రమాలు ‘వెలుగు’చూసేనా...!
గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి
వీవోఏలే కీలకం
సహకారం అందించిన మండల స్థాయి అధికారులు
రికవరీ అంతంతమాత్రమే
స్ర్తీనిధి రుణాల వ్యవహారంపై దృష్టిసారించని కూటమి ప్రభుత్వం
గజపతినగరం, సెప్టెంబరు 27(ఆంఽధ్రజ్యోతి):
- రామన్నపేట గ్రామానికి చెందిన వీవోఏ స్ర్త్రీనిధి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో వెలుగు అధికారులు ఆమెను విధుల నుంచి తొలగించారు. రూ.4లక్షల50 వేల రికవరీకి ఆదేశించగా ఇంకా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంది.
- పాత శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన వీవోఏపై అవినీతి ఆరోపణలు రావడంపై డ్వాక్రా గ్రూపుసంఘ సభ్యులే స్వయంగా తీర్మానం చేసి ఆమెను తొలగించి వేరొకరికి బాధ్యతలు అప్పగించాలని అధికారులను కోరారు.
- పురిటిపెంట గ్రామానికి చెందిన వీవోఏ ఇటీవల విధులు నిర్వహించలేనంటూ స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఈమెపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. స్ర్త్రీనిధి రుణాల రికవరీలో సంఘ సభ్యుల నుంచి నగదు వసూలు చేసినట్లు అధికారుల దృష్టికి రావడంతో ఆమెపై విచారణ జరుగుతోంది.
గజపతినగరంలోని వెలుగు విభాగంలో జరుగుతున్న అక్రమాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్థానిక వెలుగు కార్యాలయం కూడా ఎన్నో ఏళ్లనుంచి అక్రమాలకు నిలయంగా ఉందన్న అపవాదు ఉంది. పాలకులు మారుతున్నప్పుడు అధికారులకు బదిలీ కావడం, అలాగే వీవోఏలు స్వచ్ఛందంగా తప్పుకోవడం జరుగుతోంది. ఇప్పుడు కూడా గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ వ్యవహారాలన్నీ ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మండలంలో 1531 డ్వాక్రా సంఘాలు ఉండగా 15,300 మంది వరకు సభ్యులున్నారు. డ్వాక్రాసంఘాల్లో మహిళలకు రుణాలు మంజూరు చేయడంలోగాని, వాటి వసూళ్లలో గాని గ్రామాల్లో ఉండే వీవోఏలు కీలకం. ఇదే అదనుగా కొందరు చేతివాటం చూపుతున్నారు. 2024-25 ఏడాదికి సంబంధించి ఈ మండలానికి రూ.6కోట్ల50 లక్షల వరకు స్త్రీనిధి రుణాలు ఇచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.12కోట్లు ఇచ్చారు. కాగా రుణాలు ఇచ్చేటప్పుడు ఒక్కో సంఘం రూ.3వేలు నుంచి రూ.5వేలు ఇచ్చేయాల్సిందేనట. వీవోఏలే ఆ డబ్బులను వసూలు చేస్తారు.
- 2006లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ సామాజిక పెట్టుబడి నిధి (సీఐఎఫ్) కింద రుణాలు మంజూరు చేశారు. వాటిని 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద వసూలు చేయడానికి ప్రయత్నించింది. 2022లో ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంట్లో వీవోఏలే కీలక పాత్ర పోషించారు. గజపతినగరం,పురిటిపెంట, మరుపల్లి, గంగచోళ్లపెంట వంటి పెద్ద గ్రామ పంచాయతీల్లో సీఐఎఫ్ రుణాలు రూ.లక్షల్లో వసూళ్లు చేసినా వేలల్లో జమ చేసినట్లు విమర్శలు వచ్చాయి.
- వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత కార్యక్రమాల్లో సభల నిర్వహణకు మండల సమాఖ్య నుంచి లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వాటికి రికార్డులు పక్కాగా లేవని తెలిసింది.
-వైసీపీ హయాంలో నియోజకవర్గ స్థాయిలో గజపతినగరంలో మహిళా మార్ట్ ఏర్పాటు చేస్తామని అందుకు డ్వాక్రా సంఘాల సభ్యులు నుంచి రూ.310 చొప్పున సుమారు రూ.50 లక్షలకు పైగా వసూలు చేశారు. కానీ మార్టూ లేదు. డబ్బులూ తిరిగి ఇవ్వలేదు.
చర్యలు తీసుకుంటున్నాం
వెలుగుపథకంలో అవినీతి ఆరోపణలు ఉన్న వీవోఏలపై చర్యలు తీసుకుంటున్నాం. కొందరి నుంచి రికవరీ కూడా చేశాం. ప్రతి ఒక్కరి వద్ద రికార్డులు సక్రమంగా ఉండాలని సూచించాం. విధుల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.
- ఏపీఎం, నారాయణరావు, గజపతినగరం
--------------------