విలువలతో కూడిన విద్యను అందించాలి
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:19 AM
విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరం, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలుర హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత భవిష్యత్ లభిస్తుందన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మంత్రి నారా లోకేశ్ విద్యా వ్యవస్థకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆలోచన శక్తి దేశానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇంటి వద్ద తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. విద్యతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. పదో తరగతిలో ఈఏడాది శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. సీఎస్‌ఆర్ నిధుల ద్వారా 2027 జనవరి నాటికి అదనపు తరగతుల గదులు నిర్మిస్తామని తెలిపారు. హైస్కూల్‌కు 12, జూనియర్ కళాశాలకు 6, డిగ్రీ కళాశాలకు 26 గదులను నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా టీచింగ్, అండ్ లెర్నింగ్ మెటీరియల్‌ను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో సర్వశిక్షా అభియాన్ ఏపీసీ రామారావు, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, పీఏసీఎస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, మాజీ ఎంపీపీ, పార్టీ మండల అధ్యక్షుడు గంట్యా శ్రీదేవి, శీరం రెడ్డి రాంకుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రకాశరావు పట్నాయక్, ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.