Share News

JNTU: ప్రొఫెసర్‌ బాబులు బదిలీపై యూటర్న్‌

ABN , Publish Date - May 13 , 2025 | 11:22 PM

JNTU:జిల్లాలోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక గురజాడ విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ) తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి.

JNTU: ప్రొఫెసర్‌ బాబులు బదిలీపై యూటర్న్‌

- రద్దు చేస్తూ జేఎన్‌టీయూ అధికారుల ఉత్తర్వులు

- వివాదస్పదమవుతున్న వర్సిటీ నిర్ణయాలు

విజయనగరం రూరల్‌, మే 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక గురజాడ విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ) తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. విశ్వవిద్యాలయానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలి. కానీ, ఆ సమావేశం నిర్వహించకుండానే నిర్ణయాలు తీసుకుంటుండడంతో అవి వివాదస్పదం అవుతున్నాయి. దీనివల్ల వర్సిటీ ప్రతిష్ట మసకబారుతుందని అధ్యాపకులు, విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. తాజాగా, జేఎన్‌టీయూలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ బాబులును విజయనగరం నుంచి కాకినాడ జేఎన్‌టీయూకి ఈ నెల 9న బదిలీ చేశారు. ఈ బదిలీ విషయంలో కూడా ఎగ్జిక్యూటివ్‌ సమావేశం నిర్వహించలేదు సరికదా, నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీ చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. బాబులు కాకినాడ జేఎన్‌టీయూలో రిపోర్టు చేయడానికి వెళ్లగా అక్కడ తిరస్కరించారు. దీంతో రెండు రోజుల పాటు ఆయన విజయనగరం, కాకినాడలో ఎక్కడా కూడా విధులకు హాజరుకాలేని పరిస్థితి ఏర్పడింది. నిబంధనల ప్రకారం బాబులును బదిలీ చేయడానికి అవకాశం లేదు. ఈ విషయం తెలిసినా వర్సిటీ అధికారులు ఆయన్ను బదిలీ చేశారు. ఇది వివాదస్పదమవుతుండడంతో యూనివర్సిటీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బాబులు బదిలీని రద్దు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, జిల్లా జేఎన్‌టీయూకి పూర్తిస్థాయి వీసీ లేరు. గత ఏడాది కాలంగా ఇన్‌చార్జి పాలనలో నడుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టడం, కొంతమందికి జీతాలు పెంపుదల చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు సిఫారసులు చేయడం వంటి విషయాలు వివాదస్పదమయ్యాయి. ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న వీసీని రెగ్యులర్‌ చేయడమో, లేదా కొత్తవారిని నియమించడమో చేస్తే ఇటువంటి వివాదస్పద నిర్ణయాలకు తెరపడే అవకాశం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Updated Date - May 13 , 2025 | 11:22 PM