Use technology in farming: సాగులో టెక్నాలజీని ఉపయోగించండి
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:25 AM
ఆధునిక సాంకేతిక పద్ధతిలో వ్యవసాయం చేయాలని, అందుకు అవసరమైన డ్రోన్, ఇతర పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో
సాగులో టెక్నాలజీని ఉపయోగించండి
సబ్సిడీపై డ్రోన్‌లు, ఇతర పరికరాలను అందిపుచ్చుకోండి
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరం/బొండపల్లి, ఆగస్టు13 (ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతిక పద్ధతిలో వ్యవసాయం చేయాలని, అందుకు అవసరమైన డ్రోన్, ఇతర పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో భాగంగా స్థానిక రైల్వేస్టేషన్ కాలనీ నుంచి జాతీయ రహదారి మీదుగా వ్యవసాయ మార్కెట్ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ట్రాక్టర్‌ను నడుపుతూ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రైతు రాజుగా ఎదగాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, ప్రభుత్వం ఆధునిక సాగు యంత్రాలపై అందిస్తున్న సబ్సిడీని ఉపయోగించుకోవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20 అందజేస్తామని, మొదటివిడతగా రూ.7వేలు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రెండో విడతలో మరో రూ.7వేలు, మూడో విడతగా రూ.6వేలు అందజేస్తామన్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ వ్యవసాయరంగంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదిలోనే అనేక రైతు అనుకూల నిర్ణయాలు తీసుకుందన్నారు. ఆండ్ర, తాటిపూడి రిజర్వాయర్ పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, యూరియా అధికంగా వాడవద్దని, ఎంత అవసరమైతే అంతే వాడాలని సూచించారు. ఏటా మూడు పంటలు పండించుకొనేందుకు రైతులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు కొండపల్లి కొండలరావు, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, జనసేన పీఏసీ సభ్యురాలు మాజీమంత్రి పడాల అరుణ, బీజేపీ రాష్ట్ర నాయకురాలు రెడ్డి పావని, పీఏసీఎస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
బొండపల్లిలోనూ ర్యాలీ
అన్నదాత సుఖీభవ పథకంతో లబ్ధిపొందిన రైతులతో బుధవారం బొండపల్లిలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. కొద్దిసేపు ట్రాక్టర్ నడిపారు. బొండపల్లి, గంట్యాడ, జామి మండలాలకు చెందిన సుమారు 350 ట్రాక్టర్లతో ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు అల్లు విజయ్‌కుమార్, రొంగళి అర్జునరావు, బొండపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు రాపాక అచ్చింనాయుడు, బుద్ధరాజు బుచ్చిరాజు, గొట్లాం పీఏసీఎస్ అధ్యక్షుడు సిగడాం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.