Share News

Urea.. యూరియా.. ఏదయా?

ABN , Publish Date - Aug 31 , 2025 | 10:54 PM

Urea.. What’s the Matter? జిల్లా రైతులను ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి ఉబాలు ఆలస్యంగా ప్రారంభమవడం, అనుకున్న సమయానికి నీరు లేకపోవడంతో రైతులు కొంత ఆందోళన చెందారు. అయితే తరువాత వర్షాలు కురవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ వారికి పూర్తిస్థాయిలో ఎరువులు లభించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 Urea..  యూరియా.. ఏదయా?
వీరఘట్టంలో యూరియా కోసం క్యూ కట్టిన రైతులు (ఫైల్‌)

  • అదే దారిలో మిగిలిన ఎరువులు కూడా..

  • ఏజెన్సీ మండలాల్లో పరిస్థితి దారుణం

  • అరకొరగా వచ్చే వాటి కోసం రైతుల బారులు

జియ్యమ్మవలస, ఆగస్టు31(ఆంధ్రజ్యోతి): జిల్లా రైతులను ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి ఉబాలు ఆలస్యంగా ప్రారంభమవడం, అనుకున్న సమయానికి నీరు లేకపోవడంతో రైతులు కొంత ఆందోళన చెందారు. అయితే తరువాత వర్షాలు కురవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ వారికి పూర్తిస్థాయిలో ఎరువులు లభించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా జిల్లా పరిధిలో రైతులు 2025-26 ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం 73,139 హెక్టార్ల (1.82 లక్షల ఎకరాలు)లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఇందులో వరి 59,168 హెక్టార్లు, మొక్కజొన్న 5,531 హెక్టార్లు, పత్తి 5,581 హెక్టార్టు, చెరకు 818 హెక్టార్లు, రాగులు 1,032 హెక్టార్లలో పండిస్తున్నారు. జనుము, కందులు, సజ్జలు, మినుములు, కొర్రలు, సామలు కలిపి 709 హెక్టార్లలో సాగు చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

- జిల్లాకు 17 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా కావాలని వ్యవసాయాధికారులు ప్రభు త్వానికి నివేదించారు. అయితే ఇప్పటివరకు 14 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను గ్రామ వ్యవసాయ అసిస్టెంట్లు ద్వారా రైతులకు పంపిణీ చేశారు. ఇంకా 3 వేల టన్నుల యూరియా అవసరం. ప్రస్తుతం ఇది అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ మండలాల్లో వారు నానా అవస్థలు పడుతున్నారు.

- పీఏసీఎస్‌లకు వచ్చే అరకొర యూరియా కోసం రైతులు గంటల కొద్దీ క్యూలైన్లలో బారులుదీరాల్సి వస్తోది. కొన్నిచోట్ల పోలీసుల సమక్షంలో ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నారు.

- ఇక డీఏపీ 680 మెట్రిక్‌ టన్నుల వరకు ఇచ్చామని అధికారులు చెబుతున్నా.. అక్కడక్కడా దీని కొరత ఉంది. ఇది కాకుండా పొటాష్‌, ఎస్‌ఎస్‌పీ, కాంప్లెక్స్‌ ఎరువులు, క్రిమి సంహారక మందుల విషయంలో జిల్లా వ్యవసాయ అధికారులు వివరాలు తెలిపేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ఇతర ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉన్నాయా? లేదో? అనే ఆందోళన రైతుల్లో ఎక్కువవుతోంది. దీనిపై కలెక్టర్‌ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లా అధికారులు ఏమన్నారంటే..

‘జిల్లాకు రావల్సిన యూరియా పూర్తిస్థాయిలో రాలేదు. దీనిపై ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. త్వరలో యూరియా వస్తుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తాం.’ అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అయితే మిగిలిన ఎరువుల విషయంపై మాత్రం సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.

Updated Date - Aug 31 , 2025 | 10:54 PM