Share News

Urban Governance… పుర పాలన.. గాడిన పడేనా?

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:19 AM

Urban Governance… Will It Get on Track? జిల్లాకేంద్రం పార్వతీపురం మున్సిపాల్టీలో పాలన పూర్తిగా గాడి తప్పింది. ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదు. తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణ అధ్వానంగా మారింది. వార్డుల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి. మరోవైపు ఇన్‌చార్జి అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయ లోపంతో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.

Urban Governance…  పుర పాలన..  గాడిన పడేనా?
పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం

  • అధ్వానంగా తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణ

  • అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం

  • చోద్యం చూస్తున్న పాలకవర్గ సభ్యులు

  • ఎవరికీ పట్టని ప్రజా సమస్యలు

  • ఇదీ పార్వతీపురం మున్సిపాల్టీలో పరిస్థితి

పార్వతీపురం టౌన్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం పార్వతీపురం మున్సిపాల్టీలో పాలన పూర్తిగా గాడి తప్పింది. ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదు. తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణ అధ్వానంగా మారింది. వార్డుల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి. మరోవైపు ఇన్‌చార్జి అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయ లోపంతో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. గ్రేడ్‌-1 మున్సిపాల్టీకి గ్రూప్‌-2 స్థాయి అధికారులను కమిషనర్లుగా నియమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పాలకవర్గం పూర్తిగా రాజకీయ కుర్చీలాటకే పరిమితమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్వతీపురం పురపాలక సంఘంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- పార్వతీపురం మున్సిపాల్టీ గత కొన్ని నెలలుగా ఓన్‌పే, ఎఫ్‌ఏసీ కమిషనర్ల పాలనలోనే సాగుతోంది. రెండేళ్ల కిందట కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కోన శ్రీనివాసరావు రాజకీయ కారణాల వల్ల గత ఏడాది అక్టోబరులో ఆయన బదిలీపై వెళ్లిపోయారు. మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం డీఈ శ్రీనివాసరావును మూడు నెలల పాటు ఎఫ్‌ఏసీ కమిషనర్‌గా నియమించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న గ్రేడ్‌-2 మేనేజర్‌ స్థాయిలో ఉన్న సీహెచ్‌.వెంకటేశ్వర్లు ఓన్‌ పే కమిషనర్‌గా నియమించార. గతనెల 5న సీడీఎంఏ కార్యాలయానికి సరెండర్‌ కావాలని ఆదేశాలు రావడంతో ఆయన కూడా వెళ్లిపోయారు. ఆగస్టు 9న మళ్లీ డీఈ శ్రీనివాసరాజును ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించారు. అయితే జీతాలు, ఇతర బిల్లులు పాస్‌ చేసేందుకు అధికారాలు లేకపోడంతో అధికారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. దీంతో గత నెల 28న శ్రీనివాసరాజుకు ఎఫ్‌ఏసీగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పాలనా వ్యవహారాలను చక్కబెట్టడంలో అంతగా అనుభవం లేని ఆయన ఏదోలా నెట్టుకొస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

- గత ఆరు నెలలుగా ఇంజనీరింగ్‌, రెవెన్యూ, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడింది. తాగునీటి సరఫరాకు సంబంధించి ఇంజనీరింగ్‌ అధికారులు, ఉద్యోగులు, కార్మికులతో పనిచేయించుకోలేక చేత్తులెత్తేశారు. పనిఒత్తిడి తట్టుకోలేక ఓ ఇంజనీర్‌ వారం రోజుల కిందట సెలవు పెట్టి వెళ్లినట్లు సమాచారం. రెవెన్యూ విభాగంలో ఆర్‌వో, ఇద్దరు ఆర్‌ఐల మధ్య సరైన అవగాహన లేక పన్నుల వసూళ్లను పెంచలేకపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఒక్కరే ఉండడంతో పని ఒత్తిడి పెరుగుతుందనేది వాస్తవం. పట్టణంలోని ప్రణాళిక విభాగం అనుమతులు లేకుండా భవనాల నిర్మాణం జరుగుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు.

వార్డుల్లో సమస్యలు

ఓన్‌పే, ఎఫ్‌ఏసీ కమిషనర్ల వల్ల వార్డుల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణ మెరుగుపడడం లేదు. ప్రస్తుతం కుళాయిల ద్వారా రంగు మారిన నీరు సరఫరా అవుతున్నా స్పందించేవారే కరువయ్యారు. పట్టణంలో 80 వేలకు పైబడి జనాభా ఉన్నా.. ఆ స్థాయిలో పారిశుధ్య కార్మికులను నియమించడం లేదు. పక్కనే ఉన్న బొబ్బిలి, సాలూరు మున్సిపాల్టీల్లో పారిశుధ్య కార్మికుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా.. పార్వతీపురంలో మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు పట్టణంలో వీధి దీపాల నిర్వహణను సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో గత మూడు నెలలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారిలో ఎప్పటికప్పుడు సెంటర్‌ లైటింగ్‌ మరమ్మతులకు గురవడంతో పాదచారులు బిక్కుబిక్కు మంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీనికి తోడు ఏ మాత్రం వర్షం పడినా.. ప్రధాన రహదారిలో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోవడంతో నివాసితులు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. వాహనదారులు కూడా ప్రయాణించలేక పోతున్నారు. మొత్తంగా అటు అధికారులు, ఉద్యోగులు, ఇటు పాలకవర్గ సభ్యులు ఎవరికి వారే అన్న చందంగా తయారయ్యారు.

సమస్యల పరిష్కారానికి కృషి

మున్సిపాల్టీలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తున్నాం. అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు అన్ని వేళల సేవలు అందించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం.

- శ్రీనివాసరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎఫ్‌ఏసీ, పార్వతీపురం

Updated Date - Sep 24 , 2025 | 12:19 AM