hospitals: పేరుకే అప్‌గ్రేడ్!
ABN , Publish Date - May 26 , 2025 | 12:08 AM
hospitals: జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సేవలు మెరుగుపడడం లేదు. ప్రభుత్వం గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఫలించడం లేదు.
- సేవలు మాత్రం అంతంతే
- రోగులకు తప్పని ఇక్కట్లు
- ప్రైవేటు వైద్యమే దిక్కు
- ఇదీ జిల్లాలోని 8 ఆస్పత్రుల పరిస్థితి
రాజాం, మే 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సేవలు మెరుగుపడడం లేదు. ప్రభుత్వం గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఫలించడం లేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో హడావుడి, ఆర్భాటం తప్ప ప్రజలకు ప్రయోజనం లేకుండా పోయింది. నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపరిచామని జగన్ సర్కారు ఆర్భాటం చేసింది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. చాలా ఆస్పత్రులు ఇంకా వసతులకు దూరంగానే ఉన్నాయి. ఇక వైద్యసేవలు సైతం అందని ద్రాక్షగా ఉన్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చుచేసినట్టు గణాంకాలు చూపినా.. సేవలు మాత్రం అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న ఆస్పత్రులు రోగుల్లో విశ్వాసం కల్పించలేకపోతున్నాయి. ప్రధానంగా వైద్యసేవల్లో వెనుకబాటు కనిపిస్తోంది.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో వైద్య విధాన పరిషత్ పరిధిలో ఎనిమిది ఆస్పత్రులు ఉన్నాయి. రాజాం, గజపతినగరం, ఎస్.కోట ఏరియా ఆస్పత్రులు, బాడంగి, చీపురుపల్లి, బొబ్బిలి, భోగాపురం, నెల్లిమర్ల సీహెచ్‌సీలు ఏపీవీపీ పరిధిలో కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో వీటిని అప్‌గ్రేడ్ చేసినా.. సేవలు మాత్రం పెరగలేదు. పేరుకే గైనిక్, పిడియాట్రిక్, ఎముకలు, కంటి, డెంటల్, జనరల్ సర్జరీ విభాగాలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. కానీ, కనీసం ఓపీ సేవలు కూడా అందించలేదు. అటు ఇన్‌పేషెంట్ విభాగం కూడా అంతంత మాత్రమే. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా తక్కువే. ప్రసవాలు, కుటుంబ నియంత్రణ చికిత్సలు కూడా లక్ష్యం మేరకు జరగడం లేదు. చాలా ఆస్పత్రుల్లో ఈసీజీ, ఎక్స్‌రే వంటి సేవలు కూడా సక్రమంగా అందడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 13 లక్షల వరకూ ఓపీ లక్ష్యాలుగా నిర్దేశించారు. అందులో సగం కూడా పూర్తిచేయలేకపోయారు. ఇన్‌పేషెంట్ల విభాగం గురించి చెప్పనవసరం లేదు. ఆపరేషన్లు, ప్రసవాల టార్గెట్ కూడా అలానే ఉంది. అన్నింటిలోనూ వెనుకబాటే కనిపిస్తోంది.
వైద్య పరీక్షలు లేవు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. జ్వరం వస్తే వైద్యులు రక్త పరీక్షలకు సిఫారసు చేస్తున్నారు. సరైన పరికరాలు లేకపోవడం, కొన్నిరకాల పరీక్షలు జరపకపోవడం, ల్యాబ్ టెక్నిషియన్ లేకపోవడం వంటి కారణాలతో చాలా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు జరగడం లేదు. దీంతో పేద, సామాన్య ప్రజలు ప్రైవేట్ ల్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. సొంత డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్స్‌రే, స్కానింగ్ విభాగాలు ఉన్నా రోగులకు రకరకాల కారణాలు చెప్పి బయటకు పంపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కనీసం వైద్య విధాన పరిషత్‌లో ఉన్న ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపరిస్తే జిల్లా వ్యాప్తంగా ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది.
ప్రైవేటు ఆస్పత్రులు కిటకిట
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వ్యాధుల సీజన్ నడుస్తోంది. ఏ ఆస్పత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. అదే సమయంలో పేదలు, సామాన్యులు ప్రభుత్వ ఆస్పత్రుల వైపు వస్తున్నా.. సిబ్బంది నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. దీంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తుండడంతో అవి కిటకిటలాడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు ఉన్నత చదువులు పేరిట సెలవుల్లో ఉన్నారు. దీంతో రోగులకు మెరుగైన వైద్యసేవలందడం లేదు.
ఇబ్బందులు పడుతున్నాం
రాజాం ప్రభుత్వాస్పత్రిలో సేవలు అంతంత మాత్రంగా అందుతున్నాయి. వైద్య పరీక్షలు సక్రమంగా జరగడం లేదు. ఎక్స్‌రే, స్కానింగ్ వంటివి బయట తీసుకురామంటున్నారు. వైద్య సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. అందుకే మాలాంటి వారికి ఆర్థిక భారమైనా ప్రైవేట్ వైద్యం చేయించుకుంటున్నాం.
-పినిశెట్టి గణేష్, స్థానికుడు, రాజాం
పట్టించుకోవడం లేదు
రాజాం ప్రభుత్వ ఆస్ప్రత్రికి ఆశతో వెళుతుంటే నిరాశే ఎదురవుతోంది. ఒక్కోసారి పట్టించుకునేవారు కరువవుతున్నారు. ఒక రుగ్మతతో వెళుతుంటే సంబంధిత నిపుణుడు లేకుండా పోతున్నారు. మరో విభాగం వైద్యుడితో సేవలు పొందాల్సి వస్తోంది. కనీసం ఇటువంటి పెద్దాస్పత్రుల్లోనైనా సేవలు పెంచాల్సిన అవసరం ఉంది.
-పుట్టిపు కూర్మారావు, స్థానికుడు, రాజాం