Share News

No Facilities? అప్‌గ్రేడ్‌ సరే.. వసతులేవీ?

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:50 PM

Upgrade Done, but No Facilities? సీతంపేట ఏజెన్సీలోని గిరిశిఖర గ్రామం చావిడివలస పాఠశాలను ఎంపీపీఎస్‌ (మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల) నుంచి మోడల్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌ (ఎంపీయూపీఎస్‌)గా ఇటీవల అప్‌గ్రేడ్‌ చేశారు. అయితే వసతుల కల్పన మాత్రం మరిచారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.

  No Facilities? అప్‌గ్రేడ్‌ సరే.. వసతులేవీ?
అదనపు భవనం లేక రేకులషెడ్డులోనే గిరిజన చిన్నారులకు బోధిస్తున్న దృశ్యం

  • ఆరుబయటే భోజనాలు

  • అదనపు భవనాలు లేక అవస్థలు

  • ఇదీ చావిడివలస పాఠశాలలో పరిస్థితి

సీతంపేట రూరల్‌, జూలై1(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలోని గిరిశిఖర గ్రామం చావిడివలస పాఠశాలను ఎంపీపీఎస్‌ (మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల) నుంచి మోడల్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌ (ఎంపీయూపీఎస్‌)గా ఇటీవల అప్‌గ్రేడ్‌ చేశారు. అయితే వసతుల కల్పన మాత్రం మరిచారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో ఏర్పాటు చేసిన తాత్కాలిక రేకుల షెడ్డులోనే గిరిజన చిన్నారులు చదువుకోవాల్సి వస్తోంది. మరోవైపు ఆరుబయటే మధ్యాహ్నం భోజనం చేయాల్సి వస్తోంది. చావిడివలస పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 75 మంది విద్యార్థులు చదువుతున్నారు. పీవి ఈతమానుగూడ, చావిడివలస, గురండి, కోమటిగూడ, పుట్టిగాం గ్రామాల్లోని గిరిజన చిన్నారులు ఇదే పాఠశాలకు వస్తుంటారు. అయితే ఇటీవల చావిడివలస స్కూల్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు హెచ్‌ఎం, సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ను నియమించారు. దీంతో మొత్తంగా ఐదుగురు ఉపాధ్యాయులు గిరిజన చిన్నారులకు బోధిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా పాఠశాలలో చదువుతున్న గిరిజన చిన్నారులకు వసతి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. అదనపు భవనాలు లేకపోవడంతో వారికి అవస్థలు తప్పడం లేదు. మధ్యాహ్న భోజనం కూడా ఆరుబయట నేలపైనే కూర్చుని తినాల్సి వస్తోంది. గ్రామస్థులే తాత్కాలికంగా చీరలను అడ్డుపెట్టి బాత్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇలా అనేక సమస్యల నడుమ గిరిజన చిన్నారుల చదువులు సాగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఎంఈవో ఏమన్నారంటే..

‘ఈ ఏడాది మండలంలోని అన్ని ఎంపీయూపీ, మోడల్‌ ప్రైమరీ పాఠశాలలన్నింటికీ అదనపు భవనాలు, మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. గిరిజన విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో చావిడివలస పాఠశాలకు కూడా పక్కా భవనాలు, మరుగుదొడ్లు తదితర మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.’ అని ఎంఈవో ఆనందరావు తెలిపారు.

Updated Date - Jul 01 , 2025 | 11:50 PM