Farmer's Distress! విభిన్న వాతావరణం.. రైతన్న కలవరం!
ABN , Publish Date - May 25 , 2025 | 11:18 PM
Unpredictable Weather... Farmer's Distress! జిల్లా రైతులు ఈ ఏడాది పూర్తి స్థాయిలో రబీ పంటలను దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. విభిన్న వాతావరణ పరిస్థితులతో పంటలు చేతికందడం లేదు. మరోవైపు ఖరీఫ్ పనులు కూడా ముందుకు సాగడం లేదు. దీంతో అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు.
చేతికందని రబీ పంటలు
అకాల వర్షాలతో కోతలు కాని వైనం
ముందుకు సాగని ఖరీఫ్ పనులు
ఆందోళనలో అన్నదాతలు
పాలకొండ, మే25 (ఆంధ్రజ్యోతి): జిల్లా రైతులు ఈ ఏడాది పూర్తి స్థాయిలో రబీ పంటలను దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. విభిన్న వాతావరణ పరిస్థితులతో పంటలు చేతికందడం లేదు. మరోవైపు ఖరీఫ్ పనులు కూడా ముందుకు సాగడం లేదు. దీంతో అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. వాస్తవంగా ఈ ఏడాదిలో రబీలో కొందరు మొక్కజొన్న, నువ్వు, పెసర, మినుమును సాగుచేశారు. పశువుల దాహార్తి తీర్చేందుకు ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని విడుదల చేయడంతో కాస్త ఊరట చెందారు. అయితే వాతావరణ పరిస్థితులు వారిని కలవరపెడు తున్నాయి. ఓవైపు తీవ్ర స్థాయిలో ఎండలు.. మరోవైపు అకాల వర్షాలతో నువ్వు, పెసర పంటలను కోయలేకపోతున్నారు.
- వేసవిలో అడపాదడపా కురిసే వర్షాల వల్ల దుక్కులు చేపట్టి ఖరీఫ్ పంటలకు రైతులు సన్నద్ధమవుతారు. అయితే అధికంగా వర్షాలు పడుతుండడంతో నారు మడులు సిద్ధం చేసుకోలేకపోతున్నారు.
- కూలీల కొరత, వ్యవసాయ ఖర్చులను అధిగమించేందుకు ఎద పంట వేసేందుకు కూడా దుక్కులను చేపట్టాల్సి ఉంది. కలుపు నివారణ ద్వారానే ఎద పంటకు అనుకూల పరిస్థితి ఉంటుంది. అయితే ఓ పక్క ఎండకాస్తూ.. మరోపక్క వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆ పనులేవీ చేపట్టలేకపోతున్నారు. ఇప్పటికే కోత దశలో ఉన్న రబీ పంట లను తీసుకోలేక.. ఖరీఫ్ పనులకు సన్నద్ధం కాలేక మథనపడుతున్నారు. మరో 15 రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఇంతవరకు రైతులకు కావల్సిన విత్తనాలు కూడా అందలేదు.
- నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో వర్షాలు మరింత అధికమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి రబీ పంటకు వేసిన పెసర, మినుము పంటలు ఆశించినస్థాయిలో దిగబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఖరీఫ్ పనులకూ ఆంటకం ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది.
సమాచారం లేదు..
ఈ ఏడాది వేసవిలో జిల్లాలో రైతులు నువ్వు, పెసర, మినుము వంటి పంటలు వేశారు. అవి కొన్నిచోట్ల కోత దశలో ఉండగా, మరికొన్ని చోట్ల కోత కోసి కుప్ప పెట్టి ఉన్నారు. మరికొన్ని చోట్ల నూర్పులు చేస్తున్నారు. అయితే పంట నష్టంపై మాకు ఎటువంటి సమాచారం లేదు. మండల స్థాయి అధికారులు సమాచారం ఇస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తాం
-రాబర్ట్‌పాల్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి