మొలకెత్తని మొక్కజొన్న
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:21 AM
మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి, ఐదెకరాలలో సాగుచేసి, మొలకలు రాకపోవడంతో లబోదిబోమంటున్నాడో రైతు.
రాజాంరూరల్, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి, ఐదెకరాలలో సాగుచేసి, మొలకలు రాకపోవడంతో లబోదిబోమంటున్నాడో రైతు. నాట్లు వేసి 20 రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో మొలకెత్తలేదు. దీంతో నాణ్యతలేని నాశిరకం విత్తనాలు కొని మోసపోయానని బావురుమంటున్నాడు. తనకు నకిలీ విత్తనాలు అంటగట్టిన షాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. ఎప్పటిలాగే దిగుబడి వస్తే సుమారు రూ.5లక్షలు లాభం వచ్చేదని చెబుతున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని లక్ష్మీపురంలో చోటుచేసుకుంది.
లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు తాడి రాము రాజాంలోని ఓ విత్తనాల దుకాణం లో 20 రోజుల కిందట మొక్కజొన్న విత్తనాలు కొనుగో లు చేశాడు. తన ఐదెకరాల పొలంలో వాటిని సంప్ర దాయ పద్ధతిలో నాట్లు వేశాడు. పంట ఎదుగుదల కోసం రసాయన ఎరువులు వినియోగించాడు. అయితే 20 రోజులు గడుస్తున్నా అక్కడక్కడ చిన్నచిన్న మొలక లు మినహాయిస్తే పూర్తిస్థాయిలో మొలకెత్తలేదు. దీంతో తాను కొన్న విత్తనాలు నాణ్యత లేనివిగా గుర్తించాడు. ఇదే విషయాన్ని షాపు యజమాని దృష్టికి తీసుకు వెళ్లాడు. ఆయన స్పందించలేదు. దీంతో వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదుపై పరిశీలించిన అధికారులు
రైతు ఫిర్యాదు మేరకు వ్యవసాయ శాస్త్రవేత్త డా.లక్ష్మణరావు, వ్యవసాయ శాఖ ఏడీ చంద్రరావు, ఏవో రఘునాథ్ శుక్రవారం ఆ మొక్కజొన్న పంటను పరిశీ లించారు. రైతు ఆరోపణలను నమోదు చేసుకున్నారు. మొలకలు రాక పోవడానికి గల కారణాలను పరిశీ లించారు. విత్తనాలు సరఫరా చేసిన కంపెనీ ప్రతి నిధితో పాటు అమ్మకం చేసిన షాపు యజమానిని విచారిస్తామని అధికారులు స్పష్టం చేశారు.