Undercooked Rice... ఉడకని అన్నం.. చాలీచాలని కూర!
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:38 PM
Undercooked Rice... Barely Enough Curry! ఉడకని అన్నం.. చాలీచాలని కూరతో విద్యార్థినులకు భోజనం పెట్టడంపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరాసువలస కేజీబీవీ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పిల్లలకు ఇలానే భోజనం పెడతారా? అంటూ ప్రశ్నించారు.

సిబ్బంది తీరుపై అసహనం
పిల్లలకు ఇలానే భోజనం పెడతారా? అంటూ మండిపాటు
సాలూరు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఉడకని అన్నం.. చాలీచాలని కూరతో విద్యార్థినులకు భోజనం పెట్టడంపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరాసువలస కేజీబీవీ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పిల్లలకు ఇలానే భోజనం పెడతారా? అంటూ ప్రశ్నించారు. బుధవారం ఖరాసువలస కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా విద్యాలయంలో వంట గదిని, విద్యార్థులకు పెట్టే ఆహారాన్ని పరిశీలించారు. 152 మంది విద్యార్థినులకు చాలా తక్కువలో వండిన ఉక్కిరి((గుడ్డుతో చేసిన వంటకం), ఉడకని అన్నం చూసి అవాక్కయ్యారు. ‘ మీ పిల్లలకు ఇలానే వండి పెడతారా? ఇలా తింటే విద్యార్థినులకు కడుపు నొప్పి రాదా?’ అని వంట నిర్వాహకులను ప్రశ్నించారు. ‘ మంత్రిని కాకముందే ఓ ఇంటికి గృహిణిని.. ఇద్దరు పిల్లల తల్లిని.. ఎలా వండాలో.. ఎలా పెట్టాలో నాకు తెలుసు.. నా దగ్గర కఽథలు చెప్పొద్దు.’ అని అన్నారు. అనంతరం ఇంటర్ విద్యార్థినులను కలిసి.. ఇక్కడ భోజనం ఎలా ఉందని ప్రశ్నించారు. భోజనం పర్వాలేదు అని వారు చెప్పడంతో కాస్త బాధపడ్డారు. ఆ తర్వాత అన్ని తరగతులను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. విద్యాలయం ఆవరణలో తినే పాత కంచాలు, గ్లాసులు కాల్చి ఉండడం చూసి ఇదేమిటని ప్రత్యేకాధికారిని ప్రశ్నించారు. 152 మంది విద్యార్థినులకు 152 గుడ్లు ఇచ్చి ఉంటే కూర ఎక్కువగా తయ్యారయ్యేదని తెలిపారు. నాలుగు కేజీలతో పప్పు కూడా వండలేదన్నారు. మొత్తంగా సిబ్బంది పర్యవేక్షణ లోపంపై మంత్రి సీరియస్ అయ్యారు. ఖరాసువలస కేజీబీవీలో విద్యార్థినులకు సరిగా భోజనం పెట్టడం లేదని ఫిర్యాదులు రావటంతో హాస్టల్‌ను ఆకస్మికంగా సందర్శించినట్లు ఆమె విలేఖర్లకు తెలిపారు. విద్యాలయంలో ప్రత్యేకాధికారి పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ కృష్ణవేణిని ఆదేశించారు. వసతి గృహాల్లో చదివే విధ్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి వెంట ఐటీడీఏ అధికారులు ఉన్నారు.