నది దాటించలేక..
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:23 AM
నాలుగు నెలల గిరిజన బాలుడు అనారోగ్యంలో చనిపోయాడు. తుఫాన్ కారణంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
నది ఒడ్డున గ్రామంలో బాలుడి అంత్యక్రియలు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
మెంటాడ, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): నాలుగు నెలల గిరిజన బాలుడు అనారోగ్యంలో చనిపోయాడు. తుఫాన్ కారణంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ ఊరికి వెళ్లడానికి అది తప్ప వేరే మార్గంలేదు. దీంతో నది దాటలేక పొరుగూరులోనే కుటుంబీకులు ఆ బాలుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
మెంటాడ మండలం లోతుగెడ్డ గ్రామపంచాయతీ మధుర పోరపుబాడవ, దిబ్బగుడి గ్రామాలు చంపావతి నది ఆవల ఉన్నాయి. వీరు ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా నది దాటుకుని కొండపర్తి గ్రామానికి వచ్చి అక్కడి నుంచి వాహనాల్లో వెళ్లాలి. ఆదివారం పోరపుబాడవకు చెందిన నాలుగు నెలలు గిరిజన బాలుడు జనార్దన్ ఆదివారం కడుపునొప్పితో విలవిల్లాడి పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అప్పటికప్పుడు తెప్పపై చంపావతి నది దాటించి గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచి విజయనగరం ఘోషా ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా.. అక్కడ కుదుట పడకపోవడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.
ఇంటికి చేరని మృతదేహం
పోరుపుబాడవ చిత్రావతి నది ఆవల ఆండ్ర రిజర్వాయర్ ఒడ్డున ఉంది. సోమవారం నుంచి తుఫాన్ ప్రభావం వల్ల చంపావతి నది పొంగి ప్రవహించడం, రిజర్వాయర్ నీరు విడుదల చేయడంతో తెప్పలు నడిపేందుకు ఆస్కారం లేదు. రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చిన్నారి మృతదేహం గ్రామంలోకి తీసుకెళ్లేందుకు వీలు కాలేదు. దీంతో నది ఈవల గ్రామమైన జీరికివలసలో కుటుంబీకులు బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.